గద్వాల, నవంబర్ 4 : ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ 12గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులోని 29 ఎకరాల పంట భూముల్లో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తుండటంతో రైతులు నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం రైతులు బైఠాయించారు. కంపెనీ నుంచి వచ్చే కాలుష్యం, వ్యర్థాలతో క్యాన్సర్‌తోపాటు శ్వాసకోశ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పచ్చని భూములు బీళ్లుగా మారడంతోపాటు సమీపంలోని తుంగభద్ర జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందే ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని, కానీ ఏకపక్ష నిర్ణయాలతో నిర్మిస్తున్నారని ఆరోపించారు.
గద్వాల కలెక్టరేట్ ఎదుట ఇథనాల్ కంపెనీ వద్దని ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకొని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సాట్స్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, నాయకులు బైకాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, విజయ్‌కుమార్, పల్లయ్య రైతుల వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి మద్దతు తెలుపుతూ.. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమను రద్దు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు.