న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ, జూలై 19: రైతు కష్టాలు కాంగ్రెస్‌కు ఏం తెలుసు? మూడు గంటల కరెంట్‌తో సరఫరాతో సాగు సాధ్యమైతదా? ప్రాజెక్టుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్న తరుణంలో మూడు గంటల కరెంటు వల్ల రైతులు పంటలు ఎలా పండించుకుంటారు? కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మళ్లీ చీకటే.. వ్యవసాయానికి ఉచిత కరెంట్ వద్దు.. మూడు గంటల మస్త్.. అన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బుద్ధిచెప్పాలి. ఊర్లలోకి కాంగ్రెస్ నాయకులు రాకుండా తరిమికొట్టారు. మూడు పంటలు పండించుకునేందుకు 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ జై కొట్టాలి’ అని రైతులు ముక్తకంఠంతో నినదించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడోరోజైన బుధవారం కూడా రైతు వేదికల్లో రైతులు కాంగ్రెస్ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గంటలే కరెంట్ ఇవ్వాలన్న కాంగ్రెస్‌ను ఖతం చేయాలని పిలుపునిచ్చారు. 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని, రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రైతులు తీర్మానాలు చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపుమేరకు బీఆర్ఎస్ నాయకులు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలవ్యాప్తంగా ‘కాంగ్రెస్ పార్టీ కరెంట్ కట్’పై ఊరూరా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
రేవంత్‌కు రైతులే బుద్ధి చెప్పాలె: ఎర్రబెల్లి
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి రైతులే బుద్ధి చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పే ర్కొన్నారు. బుధవారం మహబూబాబాద్ పెద్దవంగరలో ఆయన మాట్లాడుతూ.. కరెంట్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు, మేధావులు తిప్పికొట్టాలన్నారు.
కాంగ్రెస్ కుట్రలు తెలిశాయి: కొప్పుల
కాంగ్రెస్ రైతుల పట్ల చేస్తున్న కుట్రలు అందరికి తెలిసిపోయాయని, వాటిని కలిసికట్టుగా తిప్పి కొట్టాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం బాగుంటేనే, మిగిలిన అన్ని రంగాలు, ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుందని చెప్పారు. తొమ్మిదేండ్లలో ఒక్క వ్యవసాయం రంగంపైనే 4.50 లక్షల కోట్లు ఖర్చుచేశారని గుర్తుచేశారు. రైతు వేదిక వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు.
రేవంత్‌రెడ్డికి మతి భ్రమించింది: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వ్యవసాయాన్ని పండుగ చేస్తుంటే, మరోవైపు కాంగ్రెసోళ్లు రైతులను మళ్లీ అప్పుల ఊబిలోకి నెట్టే కుట్రలు చేస్తున్నారని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, అసలు ఆయనకు రైతు కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా సోన్‌లోని రైతువేదికలో మంత్రి మాట్లాడుతూ.. ఉచిత కరెంటుపై అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమికొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు.
Revanthreddy
రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదు
భూదందాలు చేసే రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై ఏమాత్రం అవగాహన లేదు. కమ్యూనిస్టు వాదినైనా నేను సీఎం కేసీఆర్ పథకాలకు ఆకర్షితుడినై బీఆర్ఎస్లో చేరా. తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ పాలనలో రైతులకు అందిన రైతుబంధు, రైతుబీమాతో రైతులంతా ఆనందంగా ఉన్నారు. రైతులు అప్పులు చేయకుండా వ్యవసాయం చేసి లాభపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియకపోయేది. రేవంత్‌రెడ్డి చెప్పిన మూడు గంటల కరెంటుతో ఎకరం కూడా పారదు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణలు చెప్పాలి. ఐదు ఎకరాలున్న రైతు కాంగ్రెస్ హయాంలో 20 నుంచి 30 బస్తాలు పండిస్తే, నేడు 24 గంటల కరెంటుతో వందలాది బస్తాల ధాన్యం పండిస్తున్నారు. వ్యవసాయానికి మూడు గంటలు చాలన్న కాంగ్రెస్‌ను రైతులమే బొందపెడుతాం.
-చిట్యాల రాజిరెడ్డి, రైతు, నారెగూడెం, కట్టంగూర్