24 గంటల కరెంటు..ప్రాజెక్టుల నిండా నీళ్లు.. భూమికి పూర్తి రక్షణ కల్పించే ధరణి.. పెట్టుబడి సాయంగా రైతుబంధు.. వీటన్నింటితో తెలంగాణ రైతులు కడుపుల సల్ల కదలకుండా రెండు పంటలు సక్కగ పండించుకుంటున్నరు. కాంగ్రెస్ నాయకులు మాత్రం తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ చుట్టచుట్టి బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ చేస్తున్న ప్రకటనలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆనందాన్ని దూరంచేసి మళ్లీ చీకటి రాజ్యంలోకి విసిరేస్తామంటున్న కాంగ్రెస్ పేరు వింటేనే పాత రోజులను గుర్తు చేసుకుంటూ రైతన్నలు భయంతో వణికిపోతున్నారు. ఆళ్లొత్తే ఆగమాగం.. అంగడంగడేనని భయాందోళనకు గురవుతున్నారు. రైతును రాజులా చూస్తున్న సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కారుతోనే ఉంటామని నినదిస్తున్నారు.
రైతులను ఆగం చేయాలని చూస్తుండ్రు
సక్కంగున్న రైతు బతుకులను ఆగం చేయాలని కాంగ్రెసోళ్లు చూస్తుండ్రు. వాళ్లు అధికారంల ఉన్నప్పుడు ఎరువుల కోసం రైతులు సద్ది సంకన పెట్టకొని లైన్లల్ల నిల్చొని అరిగోసపడ్డరు. కండ్లు కాయలు కాసేలా కరెంటు కోసం సూసిన రోజులు ఇంక గుర్తుకున్నయి. చేనుకు నీళ్ల పెట్టేందుకు రైతు రాత్రి వెళ్తే ఇంటికి వచ్చేదాకా నమ్మకం ఉండక పోయేది. పాము కాటు, విద్యుత్తు షాక్‌లతో అక్కడే బతుకులు తెల్లరి పోయేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక సీఎం కేసీఆర్ రైతులను కడుపున పెట్టకొని సూసుకుంటుండు. ఇప్పుడిప్పుడే రైతులు ఎవుసం చేసుకొని తొవ్వన పడుతున్నరు . మళ్ల కాంగ్రెసోళ్లొచ్చి రైతులను ఆదుకుంటమని ఉద్దెర ముచ్చట్లు చెప్పుతుండ్రు. రైతులు కాంగ్రెసోళ్లను నమ్మి ఇంక మోసపోరు. రైతులకు అండగా ఉన్న బీఆర్ఎస్ సర్కారుకే జై కొడ్తరు.
– బానోత్ రంగీలాల్, రైతు, ఉప్పలపాడు, బయ్యారం, మహబూబాబాద్
ధరణి తీసేస్తే రాబందుల్లా దోచుకుంటారు
కాంగ్రెస్ పాలనలో పహాణీలు తీసుకోవాలంటే డబ్బులు ఇవ్వాల్సి ఉండేది. భూముల రిజిస్ట్రేషన్ కోసం నెలల
తరబడి తిరగాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి తీసుకొచ్చి రైతలకు మేలు చేశారు.
మీ సేవలో స్లాట్ బుక్ చేసిన మర్నాడే తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అవుతున్నది. 10 నిమిషాల్లో బుక్ ఇస్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారా రైతుల భూములకు రక్షణ కలిగింది. రైతులు వేలిముద్రలు పెడితేనే రికార్డుల నుంచి భూమి మారుతది. ధరణి తీసివేస్తే రైతులు మళ్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ధరలు పెరగడంతో భూములను కాపాడుకోవడానికే సమయం పడుతుంది. ధరణి ఉండాలంటే సీఎం కేసీఆర్ మళ్లా అధికారంలోకి రావాలె. ధరణి తీసివేస్తే భూ సమస్యలు పెరుగుతాయి. కాంగ్రెస్ నాయకులు రాబందుల్లా దోచుకుంటరు.
– నాగెళ్లి రాంబాబు, కోరుకొండపల్లి, కేసముద్రం, మహబూబాబాద్
ఎవుసం చేస్తే రైతు బాధ తెలుస్తది
రేవంత్‌రెడ్డి ఇంతకీ రైతేనా? ఇంతకు ఆయనకు పొలం ఉన్నదా? పార్కం పొలం లేదేమో, అందుకే ఏ మోటరు వాడితే ఏమైతదో తెల్వనట్టుంది. కాంగ్రెసోళ్లు ఎప్పుడూ రైతును ఇబ్బందులు పెడుతునే ఉంటారు.
10 హెచ్‌పీ మోటరు, పైపులైను కొత్తది వేసుకోవాలంటే లక్ష రూపాయలు అప్పు చేయాల్సి వస్తది. ఇద్దరు కూలీలు కావాలి. లేకపోతే ఆ స్పీడుకు నేల కోసుకుపోయి గంటల కట్టలన్నీ పగిలిపోతాయ్. మూడు గంటల పనికి ఇద్దరు కూలీలకు రూ. 1200 ఇయ్యాల్సి వస్తది. మేం ఎవుసం చేయాలా? కూలీ డబ్బులు పోగుచేయాల్నా? మాకు అర్థమైత లేదు. ఎవుసం చేస్తే ఎవరికైనా రైతు బాధ ఏంటో తెలుస్తది.
-భూంరెడ్డి, రైతు, మర్పల్లి గ్రామం, రేగోడ్ మండలం, మెదక్ జిల్లా
3 గంటల కరెంటుతో మొదటి మడి కూడా తడవదు
కాంగ్రెస్ హయాంలో కరెంటు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోయి రైతులు నష్టాలపాలైన సంఘటనలు కోకొల్లలు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందుతున్నది. ఎక్కడ చూసినా పంటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. నిరంతర విద్యుత్తుతో రైతులు సంతోషంగా ఉన్నారు. పాడిపరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలనడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనం. 3 గంటల కరెంటుతో మొదటి మడి కూడా తడవదు. కాంగ్రెస్‌కు ఓటు వేసి అంధకారాన్ని కొనితెచ్చుకోవద్దు. రైతులంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలవాలి.
– రెడ్డి సురేఖ, మహిళా రైతు, నాగిరెడ్డిపల్లి, భువనగరి మండలం, యాదాద్రి భువగిరి జిల్లా
ధరణి తీసేస్తే మళ్లీ లంచాల రాజ్యమే
ధరణిని రద్దు చేసి పాత రెవెన్యూ చట్టాన్ని తెస్తే రైతులకు తిప్పలు తప్పవు. గతంలో ఈ వ్యవస్థతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. లంచం ఇవ్వనిదే పని జరిగేది కాదు. ధరణి పోర్టల్‌తో భూములకు సంబంధించిన ఘర్షణలు, కేసులు పూర్తిగా తగ్గాయి. గ్రామాలన్నీ ప్రశాంతంగా మారాయి. ఇదంతా ఇష్టం లేని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మళ్లీ రైతులకు హాని కలిగించేలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రైతులకు 3 గంటల కరెంటు చాలని, వ్యవసాయానికి 10హెచ్‌పీ మోటర్లు వాడాలని చెప్తున్నారు. వారి మాటలు వింటే రైతులు మళ్లీ ఆగం కావాల్సిందే. కాంగ్రెస్ నాయకులతో రైతులంతా జాగ్రత్తగా ఉండాలి. రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో అన్నదాతలు ఆనందంగా ఉన్నారు. రైతులమంతా ఆయన వెంటే ఉంటాం.
– సింగిరెడ్డి కాంతారెడ్డి, రైతు, రంగాపురం, బొమ్మలరామారం
కర్ణాటకల మా సుట్టాలు బాధపడుతుండ్రు
రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌ను కాదని వేరే వాళ్లకు మా రైతులు ఓటేయరు. సీఎం సారు 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తుండు. ఎన్నికలయ్యాక రైతుబంధును రూ. 16 వేలకు పెంచుతామని ప్రకటించిండు. కాంగ్రెసోళ్లు చెప్పేవన్నీ ఝూటా మాటలు. వారి మాటలు నమ్మితే కర్ణాటక గతే పడుతుంది. మాకు పక్కనే కర్టాటక రాష్ట్రం ఔరాద్ తాలూకా గ్రామాలు ఉన్నాయి. మాకు బంధువులు కూడా ఉన్నరు. ప్రతిరోజు ఏదో పనుల మీద ఫోన్లో మాట్లాడుకుంటం. మీ సీఎం కేసీఆర్ గొప్పోడని చెప్తూ ఉంటారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు సక్కగ ఇయ్యట్లేదని బాధపడుతుండ్రు. రైతులు సల్లగా ఉండాలంటే మళ్లా కేసీఆరే రావాలి.
– కురుమ నర్సుగొండ, రైతు, పోట్పల్లి, సిర్గాపూర్ మండలం, సంగారెడ్డి జిల్లా
మోటర్ల వద్ద పండుకునే బాధ తప్పింది
విద్యుత్తు సరఫరా నిరంతరాయంగా ఉండడంతో ఈ ఏడాదంతా పుష్కలంగా పంట పడింది. మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవుడు లేదు. మునుపు చాలా ఇబ్బందులు పడినం. కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు రాత్రిళ్లు పొలాల కాడికి పోతుంటిమి. పారకం పెట్టడానికి పోయి ఎంతోమంది రైతులు కరెంటు షాక్‌లు, పాముకాటులకు గురై చనిపోయారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే ఆ రోజులే వస్తయ్. మూడు గంటల కరెంటుతో పంటలెలా పండిచుకోవాలి. గుంటకూడా పారదు. రైతులు ఇబ్బంది పడకుండా మంచిగ బతకాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి.
– చందర్‌నాయక్, రైతు, బద్రియతండా,చిలిపిచెడ్ మండలం, మెదక్ జిల్లా
పట్వారీల కాళ్లకు మొక్కాల్సి వస్తది
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేసి భూమాత పోర్టల్ పెట్టి పాత పట్వారీ వ్యవస్థను మళ్లీ తీసుకవస్తామని మాట్లాడడం బాగాలేదు. దీంతోటి రైతులకు మళ్లీ కష్టాలు మొదలైనట్టే. మళ్లీ పాత కాలం లెక్క పట్వారీల చుట్టూ తిరుగుతూ వాళ్ల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. రైతులను మళ్లీ బిచ్చగాళ్లను చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. దీన్ని రైతులందరం వ్యతిరేకిస్తున్నాం. ఎన్నికల్లో కాగ్రెస్‌కు గట్టి బుద్ధి చెబుతాం. రాజకీయం లాభం కోసం కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందో అర్థం కావడం లేదు. ధరణి పోర్టల్‌ను రద్దుచేస్తామంటున్న కాంగ్రెస్‌ను ఓటుతో నామరూపాల్లేకుండా చేస్తాం.
-వాల్గోట్ మోహన్, రైతు, సుద్దపల్లి, డిచ్పల్లి, నిజామాబాద్ జిల్లా
ధరణి పోతే భూరికార్డులు అగమాగం
పాత రెవెన్యూ విధానంల మస్తు తిప్పల పడ్డం. భూరికార్డుల సమస్యలతో ఆఫీస్‌ల చుట్టూ తిరుగుడయ్యేది.చిన్న చిన్న పనులకు ఏండ్లు గడిచేది. అయినా పని కాకపోయేది. దళారులదే రాజ్యం ఉండేది. వాళ్లు అందినకాడి దండుకొని రైతులను నిండా ముంచేది. ధరణి వచ్చినంకనే మాకు ధీమా వచ్చింది. మా రైతుల భూములు ఆన్లైన్ల నమోదు కావడంతో కొండంత భరోసా ఏర్పడింది. గతంలో ఉన్న తిప్పలన్నీ తప్పినయ్. ధరణితో మా భూములుకు భద్రత కలిగింది. సంతోషంగా ఎవుసం చేసుకుంటానం. కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తామని అంటుండ్రు. రైతులకు మేలు చేసే ధరణి తీస్తే మళ్లా భూ రికార్డులు ఆగమాగమైతయ్. పాత పద్ధతితో మళ్లా అన్ని చిక్కులే.
– తుంగల సమ్మయ్య, మహదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
ధరణితో భయాలు పోయాయ్
గతంలో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోయి రోజంతా ఎదురు చూడాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ కాగితాలు వచ్చినంక వాటిని తీసుకొచ్చి గ్రామ రెవెన్యూ అధికారికి ఇవ్వాలంటే వారి చేతిలో నగదు పెట్టందే ముట్టుకునేవారు కాదు. ధరణి అమల్లోకి రాగానే రైతుల భయాలన్నీ తొలగిపోయినయ్. వ్యవసాయ భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా అర్ధ గంటలో పని అయిపోతున్నది. ఎవరినీ కలవాల్సిన అవసరమే లేదు. ఆన్లైన్లో కొనుగోలుదారుడి పేరు చూపిస్తున్నది. ఇంత మంచిగ ఉన్న ధరణిని కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తే తొలగిస్తామని చెప్తున్నరు. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మళ్లీ కష్టాలు మొదలైనట్టే.
– గందె ఉపేందర్, రైతు, కట్టవారిగూడెం, గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా
పూటకోమాటలా?
రైతుకు పెట్టుబడి సాయంపై రేవంత్ పూటకో మాట మాట్లాడుతుండు. రైతులను అయోమయానికి గురిచేయడంతో పాటు మాటలతో ఆగంజేయాలనుకుంటుండు.
అప్పుడే మూడు గంటల కరంటు చాలంటడు, అప్పుడే 10హెచ్‌పీ అంటడు, అప్పుడే రైతు పెట్టుబడి సాయంపై అయోమయంగా మాట్లాడుతడు. కౌలురైతు అంటడు.. అప్పుడే భూమి యజమానికి పెట్టుబడి సాయం అంటడు. రైతులను ఆగంజేసి ఎట్లన్నజేసి ఓట్లు రాబట్టుకోవాలని జూస్తున్నరు తప్ప మరొకటి కనిపిస్తలేదు. గిసుంటి మాయమాటలు నమ్మేటందుకు మేమేం పిసోళ్లం కాదు. ఇప్పుడు నడుస్తున్న పథకాల మీద పూటకో మాట మాట్లాడుతున్న వీరి బాగోతం రైతులకు అర్ధమైతుంది.
– రాజేందర్, రైతు, ధర్మోరా, నిజామాబాద్
కాంగ్రెసోళ్లకు ఎవుసం గురించి తెల్వదు
సీఎం కేసీఆర్ ఇస్తున్న నాణ్యమైన ఉచిత కరెంట్‌తో రెండు పంటలు సంతోషంగా పండించుకుంటున్నాం. మాకున్న వ్యవసాయ భూమికి 5 హెచ్‌పీ మోటార్లతో నీళ్లను పారించుకుంటూ సాగు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 గంటలు మాత్రమే కరెంట్ ఇత్తనని అంటున్నది. 10హెచ్‌పీ మోటర్లు వాడాలని కాంగ్రెస్ నాయకులు అనడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్సోళ్లకు ఎవుసం అంటేనే తెలియదని వారి మాటల తీరు చెప్తున్నది. తెలంగాణలో సన్నకారు రైతులే ఎక్కువ. అలాంటి రైతులు 5 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవడమే ఎక్కువ అయితుంటే 10 హెచ్‌పీ మోటర్లు ఎక్కడైనా పెట్టుకుంటారా?
-చింతం రఘు, పోతారం, మంథని మండలం, పెద్దపల్లి జిల్లా