Congress | రైతులపై కాంగ్రెస్ ఏ స్థాయిలో కక్షపెట్టుకున్నదో రేవంత్ సహా ఆ పార్టీ నేతల మాటలు వింటే ఇట్టే అర్థమవుతుంది. 24 గంటలు దండగ.. మూడు గంటల కరెంటుతోనే మస్తుగా ఎవుసం చేసుకోవచ్చంటాడో నేత. 10 హెచ్‌పీ మోటర్లు పెడితే నీళ్లు దుంకుడు దుంకుతయంటాడు. అసలు రైతుబంధే దుబారా అంటాడు ఇంకో నేత. వీరందరి కళ్లన్నీ రైతులపైనే. వారు బాగుపడితే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఎలాగైనా వారిని మళ్లీ కష్టాలపాల్జేసే కుట్రలకు తెరలేపుతున్నారు.
రైతులపై ధరణితో సుఖంగా ఉన్న రైతులను అట్లెట్ల ఉండనిస్తమంటూ తామొస్తే దానిని బంగాళాఖాతంలోకి విసిరేస్తామంటాడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రెవెన్యూను రివర్సు చేసి దశాబ్దాల కాలం నాటి పటేల్, పట్వారీ వ్యవస్థలను తెచ్చి అన్నదాతను అష్టకష్టాలపాల్జేస్తామంటడు. కాంగ్రెస్ నేతల చిన్నాపెద్దా నాయకులందరూ కూడబలుక్కుని రైతులు మీద పడ్డారిప్పుడు. పొరపాటున వారు అధికారంలోకి వస్తే కరెంటు కోసం పొలాల వద్ద.. భూముల కోసం రెవెన్యూ కార్యాలయాల వద్ద పడిగాపులు తప్పవు. తస్మాత్ రైతన్నా!
కాంగ్రెస్ రాజ్యమంటేనే కరెంట్, నీళ్ల బాధలు..
గీ కాంగ్రెసోళ్లు ఎన్నేండ్లు రాజ్యమేలిండ్రు. 50,60 ఏండ్లు రైతులు ఎన్ని గోసలు వడ్డరు. రోజూ ఏడ్సుడే.. ఎప్పుడన్నా కరెంటు గురించి పట్టిచ్చుకున్నరా? ఇప్పుడు కేసీఆర్ సర్కారు.. రోజంతా ఫ్రీ కరెంటు ఇస్తున్నది. పాత కష్టాలు దూరమైనయ్. మళ్లా గిప్పుడు రేవంతం సారు మూడు గంటల కరంటు ఇస్తమంటుండు. 10 హెచ్‌పీ మోటర్లు తెచ్చి పెడతరా.. ఉన్న మోటరు పీకి అవతల పడేస్తరా.. కరెంటు ఎప్పుడస్తదోనని ఎదురుజూసుకుంట మళ్లా రాత్రింబగళ్లూ శివార్ల పండుకోవాల్నా? గివన్ని బాధలు మాకెందుకు. కాంగ్రెసోళ్లను తన్ని తరిమేస్తేనే మేము మంచిగుంటం..
-కొమ్మల మోహన్‌రెడ్డి, ముప్కాల్, నిజామాబాద్ జిల్లా
నీళ్లియ్యక నరకం చూపించారు
కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌కు వ్యవసాయం అంటే ఏమిటో తెల్వనట్టు ఉంది. రైతులను చులకన చేసి మాట్లాడుతున్నడు. ఓసారేమో రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అంటున్నడు. మళ్లోసారేమో 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోమంటున్నడు. గాయన చెప్పినట్టు వింటే మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా. మొత్తం కాలి బూడిద అవుతయి.
కరెంటియ్యక.. నీళ్లియ్యక నరకం చూపినోళ్లు ఏ మొహం పెట్టుకొని ఓట్లడుగుతరు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీగల మీద దుప్పట్లు ఆరేయాల్సిందే. బీఆర్ఎస్ పాలనలోనే రైతులు సుఖంగా ఉన్నరు. 24 గంటల కరెంట్ ఉంటుంది. పుష్కలంగా నీళ్లున్నయి. రంది లేకుంట రెండు పంటలు తీస్తున్నరు. అందుకే మళ్లా బీఆర్ఎస్ సర్కారే రావాలి.
– సురేశ్ జన్కాపూర్, రైతు, కన్నెపల్లి, మంచిర్యాల
అప్పుడు మస్తు తకిలీబ్ అవుతుండె
మూడు గంటల కరెంట్ ఇచ్చి ఎవసం ఎట్లసేసుడో రేవంత్ సూపిత్తడా. ఏం మాట్లాడుతుండ్రు. మూడు గంటలు కరెంట్ ఇత్తమని సెప్పుడు మాకైతే సైఅయితలేదు. మూడు గంటల కరెంట్ ఏం సరిపోతది. ఆయన మాట రైతులను ముంచేటట్టు ఉన్నది. మేం ఎవుసం బంద్ జేసుకోవాల్న. రేవంత్‌రెడ్డి ఆఫీసుల కూసోని మాట్లాడుతుండు. కరెంట్ ఎన్నిగంటలు ఇత్తే ఎట్ల అని ఆయనకే అర్థం కావాలె. ఏమన్నా పద్ధతిగా ఉన్నదా ఆయన మాట్లాడుడు. 10 హెచ్‌పీ మోటర్లు పెడితే నీళ్లు ఎల్లద్దా? ఎవడు ఇత్తడు వాటికి పైసలు. ఈ ప్రభుత్వం రాకముందు మస్తు తకిలీబ్ ఉండేది. రాత్రిపూట కరెంట్ కోసం వచ్చుడు.. ట్రిప్పై మస్తుమాట్ల అయ్యేది. కరెంట్ మోటర్లు కాలిపోయేది. ఇప్పుడు పొద్దాక వచ్చి మంచిగ ఎవుసం సేసుకుంటున్నం.
-అందె రాములు, రైతు, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా
3 గంటలతో పంట పండదు..
మూడు గంటల కరెంట్‌తో ఎకరా కూడా తడ్వదు. పంట పడించడం సాధ్యం కాదు. కాంగ్రెస్ నేతల మాటలు మళ్లీ కరెంట్ కష్టాలు తెచ్చి పెడ్తాయి. ఇప్పుడు 24 గంటలతో రైతులు సంతోషంగా ఉన్నరు. సమైక్య రాష్ట్రంలో సమయానికి కరెంట్ లేక పంటలు ఎండిపోయి నష్టపోయాం.
రాత్రిపూట కరెంట్ పెట్టడానికిపోయి పాములు, తేళ్లు కుట్టి ఎంతోమంది రైతులు చనిపోయారు. కేసీఆర్ పాలనలో అలాంటి రోజులు పోయినయి. రాత్రి పొలాల దగ్గరికి పోనవసరం లేకుండా పగలు పొలం పనులు చేసుకుంటున్నరు. 3 గంటల కరెంట్ వస్తే మళ్లీ పాతరోజులు వస్తాయి. 24 గంటల కరెంటు ఉండాలంటే రైతు కష్టం తెలిసిన కేసీఆరే మళ్లీ అధికారంలోకి రావాలి.
– మంగలి బాల్‌రాజ్ , చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా
10 హెచ్‌పీ మోటర్లతో నీళ్లు ఒడుస్తయి..
10 హెచ్‌పీ మోటర్లు వాడితే భూమిల నీళ్లు తగ్గిపోతయి. ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పడి కాలిపోతయి. ఇగ కరెంట్ అధికారుల చుట్టూ తిరగడంతో మళ్ల కథ మొదటికొస్తది. ఏ రైతు కూడా ఆ మోటరు వాడడు. దీని పవర్‌కు పంటలు కూడా కొట్టుకపోవచ్చు.
రేవంత్‌కు ఎవుసం గురించి అస్సలు తెల్వదు. చిన్న, సన్నకారు రైతులు ఈ మోటర్లు వాడరని తెలుసుకోవాలె. రేవంత్ పనికి మాలిన మాటలు మాట్లాడటం సరికాదు. నా పొలానికి రెండు మూడు రోజులకు ఒకసారి నీరు పారిస్తా. నాకు 3 హెచ్‌పీ మోటరు ఉంది. వీలున్న సమయంలో పొలానికి పోయి నీరు పెడ్తా. బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఫ్రీగా ఇస్తుంటే కాంగ్రెసోల్లు ఓట్ల రాజకీయాలు చేస్తున్రు. రైతులను అర్థం చేసుకున్న నాయకుడే కేసీఆర్. రైతులు, ఎవుసంపై ఆయనకు నమ్మకం ఉన్నది.
– పల్లె రమణారెడ్డి, రైతు, చైన్పాక, చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి)
ఎవుసాన్ని ఏ రైతూ ఖరాబు చేసుకోడు
మంచిగ పంటలు పండుతూ బాగుపడ్డ ఎవుసాన్ని ఖరాబ్ చేసుకోం. నాకు ఎకరన్నర భూమి ఉంది. అందులోనే కూరగాయలు పండిస్తున్న. ఇంకొంత భూమిల వరి, మొక్కజొన్న పంటలు ఏసిన. ఇప్పుడున్న 24 గంటల కరెంట్‌తోనే నా ఎవుసం బాగుంది.
కాంగ్రెసోళ్లు వచ్చి మూడు గంటలు ఇస్తమని చెబితే నాలాంటి వాళ్ల బతుకు ఏమిగావాలి. ఇప్పుడు కరెంట్ మంచిగ అస్తుండడంతో రందిలేకుండా పోయింది. నీళ్లు మంచిగుండటంతో మంచిగ పంటలు పండించుకుంటున్న. మా ఇంట్లో ఉన్న ఐదుగురము గీ ఎవుసం మీదనే ఆధారపడి బతుకుతున్నం. కేసీఆర్ అచ్చినంకనే రైతుకు ఫాయిదా జరుగుతున్నది. రైతుబంధు అందుతున్నది. మళ్లీ కాంగ్రెసోళ్లు మమ్మల్ని ఆగంజేస్తరేంది! గీ తెలంగాణ సర్కారచ్చినంకనే మా పొలాలకు మస్తు ధర పెరిగింది. మంచిగ నడుస్తున్న ఎవుసాన్ని ఏ రైతు ఖరాబు చేసుజోవాలని సూడడు.
-కొటీడి ఆంజనేయులు, రైతు, రామాయంపేట, మెదక్ జిల్లా
ఇందిరమ్మ రాజ్యం కాదు.. రైతన్న రాజ్యం కావాలి
కాంగ్రెసోళ్లు చెప్తున్నట్టు మాకు ఇందిరమ్మ రాజ్యం, ఢిల్లీ రాజ్యం వద్దు.. రైతు రాజ్యమే కావాలి. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతమని చెప్తున్నరు. అసలు అదెట్ల పనిచేస్తున్నదో వీళ్లకు తెలుసా? మా ఊళ్లనే మస్తుమందికి విరాసత్ (వారసత్వ పట్టాలు) పట్టాలు గంటలనే అయినయంటే గీ ధరణి చెయ్యవట్టే. గిట్ల గతంలో ఎప్పుడన్న ఆఫీసుల్ల పనులైనయా?. రోజుల కొద్దీ ఆఫీసుల సుట్టూ తిరిగినా కాకపోయేది. గిప్పుడు రూపాయి కూడా ఇయ్యకుండనే పనైపోతున్నది. ఇప్పుడు రైతురాజ్యం నడుస్తుంటే, గీళ్లేందో ఇందిరమ్మ రాజ్యం అంటూ మళ్లా పాతకథ షురూజేసిన్రు. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన పనులు ఒక్క రైతు కూడా మర్చిపోలే. మళ్లీ వీళ్లను తెచ్చి ఎవ్వలూ నెత్తి మీద పెట్టుకోరు. కాంగ్రెస్ పార్టీల ఒక్క సీఎం అన్నా రైతుబంధు ఇచ్చిండా? పోనీ 24 గంటల కరెంటన్నా కరెక్టుగా ఇచ్చిన్రా. ఒక్క ఊళ్లన్నా రైతు వేదిక కట్టిన్రా. సీఎం కేసీఆర్‌తోనే రైతు రాజ్యం సాధ్యం అయితది. ఆయనుంటనే మూడు పంటలు మంచిగ పండుతయ్.
– చిలుకూరి సంజీవ్‌రెడ్డి, రైతు, వడూర్, భీంపూర్ మండలం, ఆదిలాబాద్
మళ్లా లొల్లులు అయితయ్.. రైతులు ఆగమైతరు
తెలంగాణ వచ్చినంక ఇప్పుడు రైతు కష్టం మరిచిండు. ఎవుసం అలుకగైంది. మా మట్టుకైతే అట్ల వరి కోసినమో లేదో, ఇట్ల ఒడ్లపొన్న గడ్డి తీస్తన్నం. ఆరెకరాలు మళ్ల నాటుకు రడీ చేస్తున్నం. ధరణి లేకముందు మన భూమికి గ్యారెంటీ ఉండేది కాదు. ఎవల్దో ఎందుకు మా విషయమే చెప్త. మా పాలోల్ల పెద్ద మనిషి ఒకాయన తెల్వికలోడు ఉండే. మా నాన్న కొద్దిగా అమాయకుడు ఉండే. మా భూమిని మా నాన్నకు తెల్వకుండా మా పాలి పెద్ద మనిషి పట్టాకు ఎక్కించుకున్నడు. అప్పట్ల వాళ్లకు మాకు మస్తు లొల్లులు అయినయ్. పంచాయితీ పెట్టి మళ్ల మేమే పైసలు ఖర్చు పెడితే గానీ మా భూమిని మాకు పట్టాకు ఎక్కించలేదు. ఇప్పుడైతే ధరణితో ఇట్లాంటివేం నడువవ్. రిజిస్ట్రేషన్ల కొరకు ఆఫీసుల సుట్టు తిరుగుడు తప్పింది. ఇప్పుడేమో కాంగ్రెసోళ్లు మళ్ల ధరణి తీసేస్తమంటున్రు. పాత వ్యవస్థను తెస్తమంటున్రు. అట్లయితే భూములకు రక్షణ లేకుండా పోతుంది. ఎన్కటి లెక్కనే భూములు ఒకరివి ఇంకొకరి పేరు మీదికి ఎక్కుతయ్. మళ్లా లొల్లులు అయితయ్. రైతులు ఆగం అయితరు. రైతులకు మేలు చేస్తున్న కేసీఆర్‌నే గెలిపించుకుంటం.
– నల్ల రాజిరెడ్డి, రైతు, కొత్తగట్టు, శంకరపట్నం మండలం,కరీంనగర్ జిల్లా
దరఖాస్తు పెట్టకుండానే రైతుబంధు అస్తున్నది
గతంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు రోజుల తరబడి తిరిగేవాళ్లం. ముందు చలాన్లకు డబ్బులు కట్టి, ఆ తర్వాత సాక్షులను వెంటబెట్టుకుని వెళ్తే ఏ సాయంకాలానికో రిజిస్ట్రేషన్ అయ్యేది. వ్యవవసాయ పనులు విడిచిపెట్టి రెండుమూడ్రోజులు తిరగాల్సి వచ్చేది. గ్రామాల్లో కొంతమంది పైరవీకార్లు, మాజీ పట్వారీలు, సర్పంచులు చేయించేవారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేసిన డ్యాకుమెంట్లతో ఎంఆర్వో కార్యాలయంలో రికార్డుల మార్పులకు మూడుపులు ముట్టచెప్పడం జరిగేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తహసీల్ ఆఫీసుల్లోనే భూములు రిజిస్ట్రేషన్ చేయడంతో సులభంగా పని అయిపోతున్నది. స్లాట్ బుక్ కాగానే ఇచ్చిన టైంకి వెళ్తే తహసీల్దార్ భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వెంటనే ప్రొసీడింగ్ ఇచ్చి, నెలలో నేరుగా ఇంటికే పాసుపుస్తకం వస్తున్నది. ధరణి పోర్టల్‌తో భూములు అమ్మడం కొనుగోలు చేయడం సులభంగా మారింది. భూమికి భద్రత ఏర్పడింది. ఎలాంటి దరఖాస్తు పెట్టకుండనే రైతుబంధు అస్తున్నది. రైతుబీమా అస్తున్నది.
-నర్సింహులు, రైతు, పస్తాపూర్, జహీరాబాద్ మండలం, సంగారెడ్డి
మా భూములు బ్యాంకులో ఉన్నట్టే
ఇయ్యాల తెలంగాణ వచ్చినంక పేదలకు న్యాయం జరిగింది. ధరణి పోర్టల్‌తో భూముల పంచాయితీ తీరింది. మా భూములు మాపేరు మీదికి మారినయి. కేసీఆర్ సార్ జెయ్యవట్టి భూములు బ్యాంకులో ఉన్నట్టే. మాపేరున భద్రంగా ఉన్నయి. ధరణి బంద్ పెట్టద్దు. ధరణి తీసేసి మాభూమి పెడుతమంటూ చెబుతున్న కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే నట్టేట మునుగుతం. యాభై ఏండ్లు చూసినం. గోసపడ్డం. మళ్ల పాతరోజులు చూడాలనుకోవడం లేదు. పంటలన్నీ ఎండి పశువులకు మేత కూడా దొరకలేదు. తెలంగాణ వచ్చినంక పంటలు పచ్చగ కనబడుతున్నయ్. నాకు ఐదు ఎకరాల భూమి ఉంది.
కాంగ్రెస్ పాలనలో పేదల భూములు ధనికులు కాజేసిన్రు. పైసలున్నోళ్లు కాబట్టి వాళ్లు ఎట్ల చెబితే అట్ల పట్వారీలు రాసి వాళ్ల పరం చేసిన్రు. మా భూములు మాపేర కావాలంటే ఎన్ని తిప్పలు పడ్డ కాలేదు. మాతాత పేరు మీద ఉన్న భూమి మా నాయన పేరు మీదకు మార్చేందుకు ఏండ్లు తిరిగినం. ఎమ్మార్వో దగ్గరికి పోతే పట్వారీకి ఎరుకంటడు. పట్వారీ వద్దకు పోతే ఎమ్మార్వో అంటడు. గిట్ల తిరిగి తిరిగి యాష్టకొచ్చింది. ఇటు పని పోతుండే..అటు పని కాకుండే. దళారీలను పట్టుకుంటేనేఆ రోజుల్లో పనైతుండే.
– సీహెచ్ సతీశ్‌రావు, రైతు, సారంపల్లి తంగళ్లపల్లి,రాజన్న సిరిసిల్ల