ధాన్యం కొనుగోలులో జాప్యంపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. అకాల వర్షాలకు తడిసిన వడ్లు మొలకెత్తుతున్నా సర్కారు పట్టించుకోకపోవడంపై కన్నెర్ర చేశారు. గుండె మండిన రైతులు ధాన్యం కుప్పలకు నిప్పు పెట్టారు. ధాన్యం తెచ్చి నెల రోజులైనా కాంటా కావడంలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు రాస్తారోకో చేశారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలంలోని కొమలంచ రైతులు బోధన్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని బైఠాయించారు.
తూకం వేసిన ధాన్యాన్ని లారీల కొరతతో మిల్లులకు తరలించడంలేదని మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్లో రైతులు ఆందోళనకు దిగారు. అకాల వర్షానికి మొలకెత్తిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని సూరేపల్లి, పచ్చర్లబోడుతండా గ్రామస్థులు బుధవారం వేర్వేరుగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. బీబీనగర్ మండలం గూడూరులో రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లేదంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
చిలిపిచెడ్/కోనరావుపేట/నిజాంసాగర్/భువనగిరి కలెక్టరేట్/బీబీనగర్, మే 15 : వరిధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన..సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేశారు. కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు కావొస్తున్నా కొనుగోలు ప్రక్రియ సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంటా అయిన ధాన్యం కూడా మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముైద్దెంది. ధాన్యపు గింజలన్నీ మొలకెత్తాయి.
అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవట్లేదు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లర్లు కలిసి రైతులను శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో సుమారు 2 గంటల పాటు రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు వారం రోజులు గడుస్తున్నా లారీల కొరత కారణంగా ధాన్యం కేంద్రాల్లోనే నిల్వ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్లో తూకం వేసిన ధాన్యం తరలించడం లేదని అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళన చేశారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించడంలో తీవ్రం జాప్యం చేయడంతో పాటు ధాన్యం బస్తాకు మూడు కిలోల తరుగు తీయడాన్ని నిరసిస్తూ బుధవారం మెదక్-సంగారెడ్డి రహదారిపై రైతులు రాస్తారోకోకు దిగారు. సోమక్కపేట పీఏసీఎస్ సిబ్బంది నర్సింహులు అక్కడికి చేరుకొని సివిల్ సైప్లెల్ డీఎంతో ఫోన్లో మాట్లాడి రైతులను సముదాయించారు.
డీఎం హామీ మేరకు రైతులు రాస్తారోకోను విరమించారు. ఐదారు రోజులుగా కాంటాలు చేయడం లేదని కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలంలోని కొమలంచ రైతులు బోధన్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించారు. రెండు గంటల పాటు సాగిన రైతుల ధర్నాతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ కొమలంచకు వచ్చి అన్నదాతలతో చర్చలు జరిపారు. తహసీల్దార్ క్రాంతికుమార్ హామీ ఇవ్వడంతో కర్షకులు శాంతించారు.
తడిసిన ధాన్యం కొనాలని…
అకాల వర్షానికి మొలకెత్తిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని సూరేపల్లి, పచ్చర్లబోడుతండా గ్రామస్థులు బుధవారం వేర్వేరుగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న సివిల్ సప్లయ్ మేనేజర్ గోపీకృష్ణ రైతుల ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. అలాగే బీబీనగర్ మండలం గూడూరులోనూ రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పంటించి ధర్నా చేపట్టారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాంతో 40 నిమిషాలు రోడ్డుపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన చేపట్టిన రైతుల వద్దకు పోలీసులు, అధికారులు వచ్చి సర్ది చెప్పారు.
వెంటనే వడ్లు కొనాలె
నెల కిందనే పొలం కోసి వెంటనే సెంటర్లో వడ్లు పోసిన. ఇప్పటివరకు కొనలె. మొన్నటిదాకా ఎలక్షన్ అన్నరు. ఇప్పడేమో వడ్లు కొనలేక, తేమ శాతం వస్తేనే వడ్లు కొంటాం అని బెదిరిస్తున్నరు. వడ్లు వెంటనే కొనుగోలు చేయాలి.
– తిరుపతి, మల్కపేట, రాజన్నసిరిసిల్ల జిల్లా
లారీలు లేవంటున్నరు
మల్కపేటలో తూకం వేసిన బస్తాలు మిల్లులకు తరలించకుండా లారీలు లేవంటున్నరు. ధాన్యం అమ్మేందుకు ఇ బ్బందులు పడుతున్నం. వెంటనే మా సమస్య పరిష్కరించాలి.
-అద్దాల మల్లేశం, మల్కపేట, రాజన్నసిరిసిల్ల జిల్లా
తడిసిన ధాన్యం కొనాలి
ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. కాంటా వేసిన 350 బస్తాల ధాన్యం వాన లో తడిసి ముద్దయితున్నది. ధాన్యం కాంటా వేసి ఎనిమిది రోజు లు దాటినా ఇంకా మిల్లులకు తరలించకుండా కొనుగోలు కేంద్రంలోనే ఉంచిం డ్రు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి.
– గడ్డం విజయ, రైతు, గూడూరు, యాదాద్రి భువనగిరి జిల్లా
సగం కుప్పలు అయిపోలే
ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోసి నెల అవుతుంది. ఇంకా సగం మంది కుప్పలు కూడా అయిపోలేదు. కాంటా వేసిన ధాన్యా న్ని కూడా పది రోజులుగా ఆపుతున్నరు. వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
– నోముల భిక్షపతి, గూడూరు, యాదాద్రి భువనగిరి జిల్లా
ఉసురు తగులుతుంది
రైతులను ఇబ్బందికి గురి చేసే వారికి ఉసురు తప్పక తగులుతుంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే రైతులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. 20 రోజులుగా ధాన్యంరాశులు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. ధాన్యం తడిసి మొలకలొచ్చాయి. వెంటనే ధాన్యం కొనుగోలు చేయకుంటే తిరిగి ఆందోళన చేపడుతాం.
– ఆంజనేయులుగౌడ్, సూరేపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా