Farmers | 3 గంటల కరెంటు చాలన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటలపై తెలంగాణ రైతాంగం కన్నెర్రజేసింది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న చీకటి కష్టాలు మళ్లీ వద్దని రైతన్నలు ముక్తకంఠంతో నినదించారు. 10 హెచ్‌పీ మోటర్లతో ఎవుసం ఎట్లా జేస్తరని నిలదీశారు. ఆ మోటర్లు పెట్టుకుంటే కరెంటు సరిపోతదా? బావుల్లో, బోర్లలో నీళ్లు ఊర్తయా? నీటి ప్రెషర్‌ను పైపులు తట్టుకుంటయా? అని ప్రశ్నించారు. ఎద్దు, ఎవుసం తెలియనోడికి రైతుల కష్టాలు ఏమి తెలుస్తాయని మండిపడ్డారు. ధరణిపై కుట్ర చేసి ఎత్తివేస్తమన్న మాటలపైనా విరుచుకుపడ్డారు. ధరణి తీసివేసి మళ్లీ దళారులకు అప్పజెప్తరా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీ మూడు గంటల కరెంటు ఇచ్చుడొద్దు.. నువ్వొచ్చుడొద్దు అని హెచ్చరిస్తున్నారు.
నాకు 4 ఎకరాల 11 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. బోరు మోటరు ఉన్నది. 200 అడుగుల లోతు బోరులో 5 హెచ్‌పీ మోటరుతో ఖరీఫ్‌లో సోయా, యాసంగిలో మక్క సాగు చేస్తా. 24 గంటల త్రీఫేజ్ కరెంటు ద్వారా పంటకు నీరిస్తా. దీనికే ఆరు రోజులు పడుతది. తెలంగాణ సర్కారు వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తుంటే.. తానేదో ఉద్ధరించడానికి వచ్చినట్టు రైతులకు 3 గంటల విద్యుత్తు సరిపోతుందని రేవంత్‌రెడ్డి చెప్పటం సరి కాదు. 3 గంటల కరెంటు ఇచ్చుడొద్దు.. నువ్వొచ్చుడొద్దు. 24 గంటలు కరెంటు ఇస్తుండగానే ఎమర్జెన్సీ పనులు ఉన్నప్పుడు ఎల్సీ ఇస్తుంటరు.
కరెంటు తీగలు తెగినప్పుడు ఇంకేమైనా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు రోజుకి ఒకటి, రెండు గంటలు తక్కువైతయ్. నీవిచ్చే మూడు గంటలతోని రైతు ఒక మూలకు కూడా పారకం చెయ్యలేడు. నీకు తెలుస్తదందమా అసలే తెలియదనుకుందమా. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే కూడా కుదరని పని. నీవు వ్యవసాయం చేసి ఉంటే రైతుల కష్టాలు, కన్నీళ్లు తెలిసేవి. రైతులను నిండా ముంచే విధంగా మూడు గంటల కరెంట్ సరిపోతుందనడం తెలివి తక్కువతనం. గతంలో చంద్రబాబు నాయుడు ఇలాగే మాట్లాడితే రైతులు తుక్కుతుక్కుగా ఓడగొట్టారు. కాంగ్రెసోళ్లకు కూడా అదే గతి పడుతది.
-జక్కుల లక్ష్మణ్, రైతు, పార్డి(కె), కుభీరు, నిర్మల్ జిల్లా
ఎవుసం తెల్వనోడు పాలన ఎట్ల చేస్తడు
మేము మొత్తం 8 మంది అన్నదమ్ములం. నాకు ఐదెకరాల భూమి ఉంది. తెలంగాణ రాకముందు లారీ డ్రైవర్‌గా పని చేశాను. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా. గతంలో 9 గంటల కరెంటు ఇవ్వాలని సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసేటోళ్లం. తెలంగాణ వచ్చిన నాటి నుంచి నాణ్యమైన 24 గంటల కరెంటు వస్తున్నది. కాంగ్రెసోళ్లు మూడు గంటలు, గంట కరెంటు ఇస్తే చాలంటున్నారు. ఇది నిజంగా వ్యవసాయం తెలవనోడే అంటాడు. తెలంగాణ వ్యవసాయ విధానం తెల్వనోడు రాష్ట్ర పాలన ఎలా చేస్తాడని డౌటుగా ఉంది. ఇక్కడ వ్యవసాయం పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. మా దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ మీద 12 నుంచి 14 వరకు 5 హెచ్‌పీ బోర్లు నడుస్తున్నాయి. భూమిలో నీటి ఊట బాగా ఉన్నప్పుడు ఒకేసారి అందరం బోర్లు ఆన్ చేసినా పోస్తాయి. ఇప్పుడు వర్షాలు లేక నీటి ఊట తగ్గింది. ఐదు హెచ్పీకే భూమిలోని నీరు అందరికీ అందడంలేదు. 10 హెచ్‌పీ మోటరు పెడితే నీళ్లు అందుతయా? అందరి బోర్లు ఎండిపోతాయి. కనీస అవగాహన లేకుండా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి పనిచేస్తే తెలుస్తది రైతుల కష్టాలు. వ్యవసాయం తెలిసినోడే రాజు అవ్వాలి.
– సుర్కంటి సుధాకర్‌రెడ్డి, రైతు, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా
10 హెచ్‌పీ మోటర్లతో ఎవుసం చేసినట్టే..
10 హెచ్‌పీ మోటర్లు పెట్టి ఇక వ్యవసాయం చేసినట్టే. రైతులు 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకొని వ్యవసాయం చేయాలంటే లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. చిన్న, సన్నకారు రైతులు ఎక్కడి నుంచి మోటర్లు కొనుక్కుంటారు. రైతులు 3, 5 హెచ్‌పీ మోటర్ల పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. నీటి వసతిని బట్టి 2 నుంచి 5 గంటల్లో ఎకరం నీల్లు పారించుకుంటున్నాడు. రేవంత్‌రెడ్డికి వ్యవసాయం గురించి తెలిసినట్టు లేదు. నేను 10వ తరగతి నుంచి వ్యవసాయం చేస్తున్న. తెలంగాణ వచ్చినంకనే నాణ్యమైన కరెంటు అస్తున్నది. కరెంట్ మంచిగ వస్తుండడంతో చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నం.
– ఆముదాల రఘుపతిరెడ్డి, రైతు,చేర్యాల, సిద్దిపేట జిల్లా
10 హెచ్‌పీ ఖర్సంత ఎవలు పెట్టుకోవాలె?
సమైక్య పాలనలో ఎవుసానికి కరెంటు సరిపోక పొలమంతా ఎండిపోతుండె. రాత్రిపూట కరెంటు ఇచ్చేటోళ్లు. ఇంట్ల పెండ్లాం, పిల్లల్ని ఇడిచిపెట్టి రాత్రంతా పొలంకాడనే ఉండేటోళ్లం. రాత్రిపూట మోటరుకాడికి వెళ్లిన మా సైడు రైతులు చాలా మంది కరెంటు షాక్ కొట్టి, పాము కాటేసి సచ్చిపోయిండ్రు. తెలంగాణ అచ్చినంక, కేసీఆర్ సీఎం అయ్యినంక ఎవుసానికి 24 గంటలు పుక్యం కరెంటు ఇస్తుండు. ఇప్పుడు గా కాంగ్రెస్ పార్టీ నాయకుడంట రేవంత్‌రెడ్డి.. ఎవుసానికి మూడు గంటల కరెంటు సాలని చెప్తుండంట. మూడు గంటల్ల.. మూడు మడులు కూడా పారిచ్చుడు కాదు. దీనికింక గదేదో 10 హెచ్‌పీ మోటరంట పెట్టుకోవాల్నని చెప్తుండు.. అది పెట్టుకోవాల్నంటే ఎంత ఖర్సు అయితుందో ఆయనకు ఎరుకనేనా.
ఆ ఖర్సంత ఎవలు పెట్టుకోవాలో చెప్తలేడు. గా మోటరు పెట్టాల్నంటే కరెంటు వైర్లన్నీ మార్చాలె. కొత్త మోటరు కొని, పెట్టుకోవాలంటే లక్ష దాకా ఖర్చు అయితుంది. ఇదంతా మా నెత్తిమీద వేసుకోవాలా? ఇగ అందరం 10 హెచ్‌పీ మోటర్లు వాడితే ట్రాన్స్ఫార్మర్ ఉంటదా? పోతే మళ్లా ఎవడు చేయిస్తడు. అసలు ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్న కరెంటు మంచిగ ఉన్నదని మేమే చెప్తున్నం కదా. ఇంక గీ కాంగ్రెసోళ్లు వచ్చి అన్నీమార్చి మా బతుకులు ఆగం చేయాలని చూస్తున్నరా? వీళ్లకు ఇంకేమీ పనిలేదా? అప్పట్ల ఈళ్ల(కాంగ్రెసోళ్ల) పాలనలో రైతులు సచ్చుడు చూసినా కుతి తీరలేదా. ఇప్పుడు మళ్ల వచ్చి మమ్మల్ని సంపాలని చూస్తుండ్ర. ఇట్లాంటోళ్లను ఓటేసి గెలిపిస్తమా? గెలిపించి మా గొంతును మేమే పిసుక్కుంటామా?
– ఆల్లూరి గంగాధర్, రైతు, గోవింద్‌పేట్, ఆర్మూర్ మండలం, నిజామాబాద్ జిల్లా
కేసీఆర్ కడుపు సల్లంగుండా..
కాంగ్రెసప్పుడయితే ఊకే కరెంటు పోయేది. ఒక్క మోటర్ రిపేరు చేయాలంటే రోజంతా కరెంటు కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని చూసేది. దుకాన్ల వట్టిగనే ముచ్చట్లు పెట్టుకుంటూ కూసునేది. రైతులయితే కరెంటు కోసం రోడ్లెక్కి ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడీలు చేసేది. తెలంగాణ వొచ్చినంక, సీఎం కేసీఆర్ అయినంక కండ్లు నలుపుకున్నంత సేపు కూడా కరెంటు పోయే ముచ్చటే లేదు. గప్పుడు లోవోల్టేజీతో మోటర్లు ఇరాము కాలిపోయేది. ఇప్పుడయితే మోటర్లు కాలిపోవుడు తక్కువైంది.
మంచిగ 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లతో రైతులు ఉన్న భూమంతా సాగు చేస్తుండ్రు. ప్రతి ఒక్కలు ఇప్పడు ఆరాముగా కుటుంబాలు ఎల్లదీస్తుండ్రు..అప్పులు లేవ్ సప్పులు లేవ్.. పొద్దంతా వద్దనంగ కరెంటు ఇస్తుండ్రు. బాయికాడికి రాత్రి పోయే కష్టాలు తప్పినయ్. ఊళ్లనే వడ్లు కొంటుండ్రు.. పైసల్ ఖాతాల్లోనే పడ్తున్నయ్. ఇంకా మాకేం కావాలే. రైతు చచ్చిపోతే దినాలు ఎల్లక ముందే రూ.5 లచ్చలు ఇస్తుండ్రు కేసీఆర్ సార్. ఆయన కడుపు సల్లగుండ. ఎన్నికల్లో ఆయనకే మా మద్దతు. మా దగ్గరకు వచ్చే రైతులు కూడ అదే అంటుండ్రు. కేసీఆర్ సార్ మంచి చేస్తుండ్రు.. మళ్లీ గెలిపిస్తమని.
– పాషా, మోటర్ వైండింగ్ మెకానిక్, బచ్చన్నపేట, జనగామ జిల్లా
రేవంత్‌రెడ్డిది ఎవుసం చేసిన ముఖమేనా?
మాకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అందులో రెండెకరాలు పత్తి, రెండెకరాలు మక, ఎకరం వరి వేసిన. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న 24 గంటల కరెంటుతో పంటలు బాగా పండుతున్నయి. కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటు ఇస్తామని, సరిపోతుందని అంటున్నరు. వాళ్లలో ఎవరిదైనా ఎవుసం చేసిన మొఖమేనా? 3 గంటల కరెంటుతో ఎకరం పత్తి పారీయడానికి మూడు, నాలుగు రోజులు పడుతది. అలాంటప్పుడు మిగతా పంటలు మేమెలా పండిస్తం. నేనిప్పుడు 5 హెచ్‌పీ మోటర్ పెట్టుకొని పంటలు పండిస్తున్న. కాంగ్రెసోళ్లకు అవగాహన లేక 10 హెచ్‌పీ మోటర్లతో వ్యవసాయం చేయచ్చని అంటున్నరు.
10 హెచ్‌పీ మోటర్, దానికి పైపులు కావాలంటే లక్షా ఇరవై వేల రూపాయల దాకా ఖర్చయితయ్. ఆ మోటర్‌కు ఇప్పుడున్న పైపులు ఎక్కడికక్కడ పగిలిపోతయ్. కాంగ్రెసోళ్లకు ఓటేస్తే మాకు ఇంకా అదనపు భారమే. ఇప్పుడు రైతులంతా 5 హెచ్‌పీ మోటర్లే వాడుతున్నరు. ఒకరో, ఇద్దరో 7.5 హెచ్‌పీ వాడుతున్నరు. 3 గంటల కరెంటుకు 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకున్నా దండుగే. అందరూ ఒకేసారి మోటర్లు వేస్తే ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ ఎకువై పేలిపోతయ్. ఇప్పుడు కరెంట్ మంచిగ ఇస్తున్నరు. 3 గంటల కరెంట్, 10 హెచ్‌పీ మోటర్లతో ఏమాత్రం ఉపయోగం లేదు.
– వెల్మ జగన్‌రెడ్డి, రైతు, మంగళపల్లి, చొప్పదండి మండలం, కరీంనగర్ జిల్లా
కౌలుదారు చట్టంతో రైతుల మధ్య కయ్యం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీసుకొస్తామంటున్న కౌలుదారు చట్టంతో రైతులకు కష్టాలు తప్పవు. ఇప్పటి వరకైతే భూమి కలిగిన రైతులు తమ అవసరాల నిమిత్తం వేరే ప్రాంతంలో ఉన్నా, ఉద్యోగరీత్యా, సాగు చేసే శక్తి వారిలో లేకున్నా గ్రామంలోని ఇతర రైతులకు కౌలుకు ఇస్తున్నారు. కానీ, కౌలుదారు చట్టం చేస్తే వారికి ఒప్పందం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అలా రాసి ఇవ్వడం మూలంగా భూ యాజమాని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాసిచ్చిన ఒప్పందాన్ని అడ్డం పెట్టుకొని భూమికి అడ్డు తగిలే అవకాశం ఉంటుంది. కౌలు సక్రమంగా ఇవ్వకుండా యజమానికి అనేక రకాల సమస్యలు సృష్టిస్తారు. దీంతో భూ యజమాని నష్టపోవడంతోపాటు పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రస్తుత ప్రభుత్వం అమలుచేస్తున్న ధరణితో భూ యజమానులకు సర్వ హక్కులు కలిగి ఉండి ఏ విధమైన ఇబ్బంది లేకుండా హాయిగా భూమిని కౌలుకు ఇచ్చుకుంటున్నారు. నాకున్న ఐదెకరాల్లో మూడెకరాలు నేను చేసుకుంటున్నా. మిగిలింది పదిహేనేండ్ల నుంచి కౌలుకు ఇస్తున్న. ఇప్పటి వరకు ఏ సమస్యా లేదు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూ యజమానులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి రైతులు ఆలోచించి ఓటెయ్యాలె. ధరణి ఉంటేనే అటు యజమానులు, ఇటు కౌలు రైతులు ఆనందంగా బతుకవచ్చు.
– కేతిరెడ్డి నర్సిరెడ్డి.. రైతు, కొండాయిగూడెం, గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా
పట్వారీ వ్యవస్థతో రైతులకు గోస
ధరణి రద్దు చేసి పాత రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామంటున్నది కాంగ్రెస్ పార్టీ. పటేల్, పట్వారీలు వస్తే మళ్లీ రైతులకు గోస మొదలైనట్టే. రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో భూసమస్యలు తొలిగిపోయాయి. నేరుగా రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం అందిస్తుంటే కాంగ్రెస్ వారికి మింగుడు పడటం లేదు. వారి హయాంలో అధికారులు భూ సమస్యల పరిష్కారానికి చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నరు. కాంగ్రెసోళ్లను నమ్మితే రైతులు ఆగమే. ఇబ్బందులు పడాల్సిందే. ధరణి పోర్టల్‌ను తీసేస్తమని అంటున్న కాంగ్రెస్‌ను రైతులంతా ఏకమై బంగాళాఖాతంతో కలపాలి. గట్లయితే రైతుల బతుకులు బాగపడుతాయి.
– భూమారెడ్డి, రైతు, చీకూర్తి, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా
రాబందులకిస్తే రాష్ట్రం రావణ కాష్ఠమే
బంగారు తెలంగాణను మళ్లీ రాబందుల్లాంటి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు అప్పగించొద్దు. సీఎం కేసీఆర్ పాలన కాదని వారిని కోరుకుంటే మళ్లీ రాష్ట్రం రావణ కాష్ఠంగా మారుతది. ఒకప్పుడు విత్తనాలు, యూరియా కోసం గంటల తరబడి, రోజులకొద్దీ దుకాణాల వద్ద లైన్లలో నిలబడలేక చెప్పులను క్యూ లైన్లో పెట్టిన రోజులను రైతులు గుర్తు తెచ్చుకోవాలి. భూమి పేరు మార్పిడి చేయాలన్నా, పట్టాదార్ పాస్‌బుక్ కావాలన్నా పట్వారీ ఎంబడి తిరిగి, తాసిల్ కచ్చీరు వెంట తిరిగిన రోజులు మర్చిపోలేదు.
రైతులకు క్షణాల్లో పని చేసిపెడుతున్న ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ వాళ్లకు ఓటేస్తే మళ్లీ ఎనకటి రోజులు వస్తయ్. కాంగ్రెస్ పాలనలో పడ్డ గోసలు, వారి మాటలు మర్చిపోవద్దని తోటి రైతులను కోరుకుంటున్న. రైతుల సంక్షేమ కోసం పాటుపడే కేసీఆర్ ప్రభుత్వం గాక వేరే ఏది వచ్చినా రైతుల బతుకులు ఆగమైతవి తప్ప బాగుపడవు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి అన్ని విధాలా ఆదుకొనే బీఆర్ఎస్కు, కేసీఆర్ ప్రభుత్వానికే నా మద్దతు, నా ఓటు.
– అంబాల నాగరాజు, దళిత రైతు, బండ అంకుస్వాడ, హుజూరాబాద్‌టౌన్, కరీంనగర్ జిల్లా
అధికారుల చుట్టూ తిరుగుడే
ధరణి వచ్చినంకనే ఈజీగా భూమి రిజిస్ట్రేషన్లు అవుతున్నయి. రైతుల భూములకు భద్రత ఏర్పడింది. మళ్ల పటేల్ పట్వారీ వ్యవస్థ అస్తే అధికారుల చుట్టూ తిరుగుడు మోపైతది. పైరవీకారుల రాజ్యం వస్తది. గతంల తెలంగాణ రాష్ట్రం రాక మునుపు తిరిగితేగాని రెవెన్యూ పనులు కాకపోయేటివి. భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, మ్యుటేషన్ కావాలన్నా బాగా టైం పడుతుండే. ఆఫీసుల చుట్టూ తిరుగుడు అవుతుండే. ధరణితో ఆ సమస్యలు అన్నీ తీరినై. రైతుబంధు పైసలు డైరెక్ట్‌గా ఖాతలనే పడుతున్నయి. ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలోనే రైతులకు మంచిగ ఉన్నది. కరెంట్ మంచిగ వస్తున్నది.
-నందు నర్సింహారెడ్డి, రైతు, కోనాపూర్, మెదక్ జిల్లా
ధరణి ఎత్తివేస్తే మళ్లీ గొడవలు
ధరణి వెబ్‌సైట్‌ను ఎత్తివేస్తే రైతుకు తీరని నష్టం కలుగుతది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల భూములకు రక్షణ లేకుండా పోయింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. అధికారులు వారికి సహకరించారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పెట్టి ప్రతి రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించారు. ధరణిలో ఏ రైతుకు ఎంత భూమి ఉన్నది తెలుసుకోవడం సులువు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని ఎత్తివేస్తరు. కౌలు రైతులకు రైతుబంధు అందుతుంది. పోర్టల్‌లో కౌలుదారులు, అనుభవదారులకు స్థానం లభిస్తుంది. మళ్లీ గొడవలు ప్రారంభమవుతాయి.
– మోర్ల నరసింహారావు, రైతు, బోనకల్లు మండలం, ఖమ్మం జిల్లా