Telangana | అసలు గీ కాంగ్రెసోళ్లకు ఎవుసం ఎట్ల చేస్తరో ఎరికేనా!! పంటలు ఎట్ల పండుతయో తెలుసా!! వరి పంటకు ఎన్ని నీళ్లు కావాలే? తోటకు, కూరగాయల పంటకు ఎన్ని నీళ్లు పడుతై అనేది ఎరికేనా? గాలి మాటలతోని.. నోటి దురుసుతోని ఎవుసం నడువది. విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చేదాక సంటి పిల్లను సాధినట్టు చూసుకోవాలే. ఒల్పట, దాపట తెల్వనోళ్లు ఎవుసం గురించి మాట్లాడితే గిట్లనే ఉంటది. ‘ఎద్దేడిసిన ఎవుసం.. రైతేడిసిన రాజ్యం బాగుపడదు’ అన్న మాట ఈల్లు ఎప్పుడన్నా ఇన్నరా!! కన్నరా!! పదేండ్ల కింద ఎట్లుండె ఎవుసం.. గిప్పుడెట్లున్నది? ఒకప్పుడు కరెంటు లేక గోసపడ్డ రైతు.. ఈ పదేండ్లలో కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటుతో అన్నదాత గుండెపై చెయ్యి వేసుకొని నిమ్మలంగ ఉన్నడు. రైతులు కోరి కష్టాలు తెచ్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఇదే మాటను రైతన్నలు స్పష్టం చేస్తున్నారు.
కడుక్కుతినుడు.. లోపుకుతాగుడే తెలిసినోళ్లకు ధరణి వంటి మంచి పోర్టల్ గురించి ఏమి తెలుస్తుంది. కాంగ్రెస్ అంటేనే ఎన్కటి నుంచి దోచుకునుడు.. దాచుకునుడు.. బలితీసుకునుడు అని రైతులు మండిపడుతున్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థలు వస్తే రైతుల గతేంకాను. ‘ధరణిని తీసేస్తాం’ అన్న మాట వింటేనే రైతులు భయపడిపోతున్నారు. 24 గంటల కరెంటు, రైతుబంధుతో భూమినే నమ్ముకొని ఎవుసం చేసుకుంటు సంతోషంగా ఉన్న అన్నదాతల కుటుంబాలు మళ్లీ ఆగం కావొద్దని ఒకరికొకరు సముదాయించుకుంటున్నారు. పాత రోజులు వద్దని, కేసీఆర్ పాలనే ముద్దని చెప్పుకుంటున్నారు.
ధరణితోనే రైతుల భూములకు రక్షణ
భూముల రికార్డులు సక్రమంగా ఉండేందుకు తెలంగాణ సర్కారు ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. భూ సమస్యలు తగ్గినయి. అమ్ముడు, కొనుడు.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ అవుతున్నయ్. అధికారుల, కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు.
ధరణి వచ్చినంకనే రైతుబంధు, రైతుబీమా వస్తున్నయ్. ధరణిని రద్దు చేస్తే రైతుల బతుకులు ఆగమవుతాయి. దళారులు, పటేల్, పట్వారీల ఎంబడి తిరిగి పైసలు ఇవ్వాల్సి వస్తది. రైతులు మంచిగ ఉండటం కాంగ్రెసోళ్లకు ఇష్టం లేదు. ధరణి తీసేసి భూమాత పోర్టల్ ఏర్పాటు చేస్తామనడం మంచి మాటకాదు. ధరణితోనే రైతుల భూములకు రక్షణ కలిగింది. కాంగ్రెస్ నేతలు ఎవుసంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు.
– చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, కమలాపూర్, భూపాలపల్లి
కాంగ్రెస్ వస్తే బావుల కాడ పండుకోవాలె
కేసీఆర్ సీఎం అయ్యాక బావుల కాడ పండడు బంద్ అయింది. పొద్దుగాలే పొలానికి పారకం పెట్టుకుంటున్నం. గిపుడు ఎవుసం మంచిగున్నది. మళ్లా ఆ కాంగ్రెస్ వస్తే బావుల కాడ పండుకోవాలె. కోరి కష్టాలు తెచ్చుకుంటామా? ఎవుసం గురించి తెలిస్తే మూడు గంటల కరెంటిస్తమని కాంగ్రెసోళ్లు చెప్పరు. గతంలో కరెంటు కోసం మస్తు తిప్పలు పడ్డం. ఇప్పుడా సమస్య తీరిపోయింది. రేవంత్‌రెడ్డి చెప్తున్నట్టు 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకుంటే తిప్పలు తప్పవు. కాంగ్రెస్ మాటలు నమ్మం. అప్పటి కష్టాలు మళ్లీ రావొద్దు.
– భూమయ్య, రైతు, నేరడిగుంట గ్రామం, అందోల్ మండలం, సంగారెడ్డి జిల్లా
మూడు గంటల కరెంటు అద్దు.. గా కాంగ్రెస్ అసలే అద్దు
ఉమ్మడి పాలనలో కరెంటు కోతలతో అరిగోసపడ్డం. ఏనాడూ కంటి నిండా నిద్రపోలే. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం చేసుడంటేనే భయమయ్యేది. మళ్లీ ఆ కష్టాలు మాకొద్దు. మూడు గంటల కరెంటు ఇస్తే తడిచిన పొలమే మళ్లీమళ్లీ తడుస్తది. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటున్నరు. అవి పెడితే బోర్లు ఎండిపోతయ్. అవి పెట్టుకోవాలన్నా మస్తు పైసలవుతయ్. ఇప్పుడు 24 గంటల కరెంటుతో పొలాలు మంచిగ పండుతున్నయ్. 3 గంటల కరెంటు అద్దు.. గా కాంగ్రెస్ అసలే అద్దు.
– భూమన్న, రైతు, న్యాల్కల్ గ్రామం, నిజామాబాద్ జిల్లా
భూమాత అస్తే ఎనుకటి రోజులే
ఉన్న ధరణి తీసేసి అధికారుల కడుపు నింపే భూమాతను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెస్తామనుడు రైతులను భయపెడుతున్నది. భూమాత అస్తే ఎనుకటి రోజులే. కాంగ్రెస్ వస్తే పటేల్, పట్వారీల దందా ఊర్లల్లో మల్లా తిరిగి వస్తది.
తాసిల్దార్ ఆఫీస్‌లో దళారీ దందా వస్తే రైతుల భూములు ఒకల పేరు మీది నుంచి మరొకల పేరు మీదికి ఎక్కించి పైసలను పట్వారీలు నింపుకుంటరు. ఇప్పుడున్న ధరణితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుబంధు, రైతుబీమా రావట్టె. కాంగ్రెస్ తెస్తానంటున్న భూమాత మా రైతులకు వద్దు. ధరణితో ఇయ్యాల్ల రైతులు చానా సంతోషంగా బతుకుతున్నరు. భూములు అమ్మినా, కొన్నా 20 నిమిషాల్లో పట్టా పాసు బుక్కులు చేతికస్తున్నయ్. కాంగ్రెస్ నాయకులు రైతుల పొట్టలు కొట్టి వాళ్ల కడుపులు, అధికారులు కడుపులు నింపుకునే భూమాతను తెస్తామంటుంటే భయం పుడుతున్నది. కేసీఆర్ పాలనచ్చినంకటే రైతులకు మంచిగున్నది.
– ర్యాకం చంద్రం, రైతు, మిరుదొడ్డి (సిద్దిపేట జిల్లా)
ధరణిని తీస్తమన్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
పాత చట్టం వస్తే గతంలో జరిగిన భూ ఆక్రమణలు ఎక్కువవుతాయి. అక్రమార్కులు గతంలో ఒక్క భూమిని ఎంతో మందికి విక్రయించేవారు. గతంలో కంటే భూమి రేటు ఎక్కువైంది కాబట్టి బలం ఉన్నోందే రాజ్యమవుతుంది. అలాంటి పరిస్థితులు ఎక్కువవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరణి ఉండడమే మేలు. పాత పద్ధతి రైతును నిండా ముంచుతుంది. కౌలుచట్టంతో రైతులు, కౌలుదారులకు అనవసర వివాదాలు తలెత్తుతాయి. దీంతో పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి పాత పద్ధతి వద్దు. గతంలో రైతు ఆఫీసులకు పోతే నెలలు గడిచినా పని అయ్యేది కాదు. పైగా ఖర్చుల పాలయ్యేవారు. ధరణి ఉండడం వల్ల రైతుకు మేలు జరుగుతుంది. ఆలోచించి ఓటెయ్యాలె. నాడు అరిగోస పెట్టి, ఇప్పుడు మళ్లీ వస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలె. భూములకు రక్షణ కల్పించిన బీఆర్ఎస్నే గెలిపించుకోవాలి.
– సింగిరెడ్డి వెంకట రాంరెడ్డి, రైతు, తాళ్లపెల్లి, ఇల్లంతకుంట, రాజన్న సిరిసిల్ల జిల్లా
పట్వారీలతో పైరవీలు మాతో కాదు
మా భూమి ధరణిలో ఎక్కింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఎవరైనా భూమి బదలాయించుకోవాలన్నా నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అవుతున్నాయి.. ఇంత మంచి ధరణిని తొలగిస్తామని కాంగ్రెసోళ్లు చెబుతుండటం సరికాదు. రైతులను ఇబ్బందులపాలు చేసేందుకు ఇదో కుట్ర. ఒకవేళ ధరణి తీసేస్తే మా భూముల వివరాలు మాకు తెలియవు. మాకు తెలియకుండా అధికారులు భూములను ఇతరుల పేరుపైకి మార్చే అవకాశం ఉన్నది.
గతంలో పలు మార్లు ఇలాగే మార్చిండ్రు. పట్వారీలతో పైరవీలు రైతులకు చేతకాదు. పట్టాపాస్ పుస్తకాల కోసం కాళ్లరిగేలా తిరిగినా నాడు వచ్చేవి కావు. కానీ తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు దయతో భూమి కొన్నా.. అమ్మినా.. వాటి వివరాలు గంటలో మాకు తెలుస్తున్నాయి. మా ఫోన్లకు మెసేజ్‌లు కూడా వస్తున్నాయి. ఏ ఇబ్బందులు లేకుండా ఇంటికే పట్టా పాస్‌బుక్ పోస్టులో వస్తున్నది. పైరవీలు అసలే లేవు. లంచం ఇచ్చేది లేదు. ధరణి తీస్తే రైతులకు కష్టాలే. వారి భూములు వారికి దక్కవు.. కాంగ్రెస్ రైతులను మోసం చేయాలని చూస్తున్నది. ధరణితో ఇబ్బందుల్లేవు.. పట్వారీ వ్యవస్థతోనే ఇబ్బందులు.
– కొండారెడ్డి, రైతు, మరికల్, నారాయణపేట జిల్లా
బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి
కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంటిస్తామని, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని అంటున్నారు. 10 హెచ్‌పీ మోటర్ కొనాలంటే లక్ష ఖర్చవుతుంది. అంత డబ్బు పెట్టి మేం కొనగలమా? ఈ బాధలన్నీ మావల్ల కాదు. రైతులందరూ ఒకేసారి మోటర్లు ఆన్‌చేస్తే లోడ్‌పడి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతయ్. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటు వల్ల ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు వెళ్లి మోటర్ వేసుకుని పంటలకు తడిపెట్టుకుంటున్నాం. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ చేసే బీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు కావాలి.
– కుంజా దుర్గారావు, రామచంద్రాపురం, భద్రాచలం మండలం, భద్రాద్రి జిల్లా
మూడు గంటల కరెంటు సరిపోదు
రైతుల కరెంటు మీద ఇంత గొడవ ఎందుకు చేస్తున్నరో అర్థమైతలేదు. బావులల్ల మస్తుగ నీళ్లున్నయ్. కరెంటు లేకపోతే ఎట్ల పారిస్తం. మాకు వీలున్నప్పుడు బాయికాడికిపోయి నీళ్లు పారించుకోవాలంటే 24 గంటలు కరెంటు ఉండాలె. మూడు గంటల కరెంటు సరిపోదు. గతంలో ఇట్లనే రాత్రి, పగలు కలిపి కరెంటు ఇస్తే ఎప్పుడు వస్తుందోనని బావుల కాడనే కాపలా కాసేటోళ్లం. రాత్రిళ్లు టార్చ్లైట్లు పట్టుకొని బాయిల కాడికి పోయి నీళ్లు పారించినం. అప్పుడు ఎరువులు, విత్తనాలకూ అరిగోస పడ్డాం. తెల్లారగట్ల పోయి లైన్ల నిల్చునేటోళ్లం. ఎరువుల కోసం పోవాల్నా? ఎప్పుడు వస్తదో తెలియని కరెంటు కోసం బాయికాడికి పోవాల్నా తెలియకుండా ఉండేది. ఇప్పుడైతే గా బాధ లేదు.
– మామిడి తిరుపతిరెడ్డి, రైతు, పెంచికల్‌పేట, హనుమకొండ
ఇంతకీ గా రేవంత్‌కు పొలం ఉందా?
కాంగ్రెసోళ్లకు కరెంట్ గురించి, ఎవుసం గురించి ఏమీ తెలిసినట్టు లేదు. 10 హెచ్‌పీ మోటర్ వాడితే ట్రాన్స్ఫారం ఉంటదా? ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలు గావాలే. పంట పండియ్యనికి పైసలు పెట్టాల.
గా మోటర్ గురించి అప్పు చేయాల్నేమో గీ కాంగ్రెసోళ్ల వల్ల. గెలవక ముందే గింత లొల్లి జేస్తున్నరు. ఇంతకీ గా రేవంతరెడ్డికి పొలం ఉన్నదా? మోటరు గురించి తెలుసా లేదా? గిప్పుడుగిప్పుడే రైతులు తెల్లబడుతున్నరు. మళ్లా మమ్మల్ని ఆగంజేస్తరేంది. కేసీఆర్ కరెంట్ మంచిగిస్తున్నడు. రైతుబంధు ఇయ్యవట్టే. ఎరువులు, విత్తనాలు మంచిగ దొరకవట్టే. మా రైతులకు గీ తెలంగాణ సర్కారు మంచిగనే చేయవట్టే. మళ్లా ఇప్పుడు 3 గంటల కరెంట్, 10 హెచ్‌పీ మోటర్లని ఎందుకు ఆగం కావుడు.
-ఈశ్వర్ నాయక్, రైతు, ప్యారారం, మెదక్ జిల్లా
మూడు గంటల కరెంట్‌తో ఒక మూల కూడా తడవదు
రేవంత్‌రెడ్డి పూటకో మాట చెప్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ చాలు.. 10 హెచ్‌పీ మోటర్లు వాడాలంటూ కనీస అవగాహన లేకుండా ప్రకటనలు చేస్తున్నాడు.
మూడు గంటల కరెంట్‌తో ఒక మూల కూడా తడవదు. 10 హెచ్‌పీ మోటర్లతో రైతులపై మోయలేని భారం పడుతుంది. కాంగ్రెస్ వస్తే రైతులు వ్యవసాయాన్ని వదులుకోవాల్సిందే. రైతుల బాధలు తెలిసిన వారికి మాత్రమే ఇవి అర్థమవుతాయి. మూడు గంటల కరెంట్ వద్దు. కాంగ్రెస్ పార్టీ కూడా వద్దు. మరోసారి కేసీఆర్ సర్కార్ రావాలి.
-రాంరెడ్డి, మద్గుల్ చిట్టంపల్లి, వికారాబాద్
10 హెచ్‌పీ మోటర్లు పెట్టేటోళ్లు మాకొద్దు
సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటుతో ఏటా రెండు పంటలు పండించుకుంటున్నాం. కేసీఆర్‌కు రైతుల కష్టాలు తెలుసు కాబట్టే ఎప్పుడు ఏది అవసరమో అది సకాలంలో పెడుతున్నారు. పంటలను చింతలేకుండా పండించుకుంటున్నాం.
పదేండ్ల క్రితం ఎవుసం అస్తవ్యస్తంగా ఉండేది. వానకాలంలో కూడా లోవోల్టేజీ వల్ల పంటలు పండేవి కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. వానకాలంలో వరి, ఇతర పంటలు, యాసంగిలో వేరుశనగ సాగు చేసుకొని సంతోషంగా ఉంటున్నాం. ఇప్పుడు కొందరు ఎవుసం తెలియని కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల కడుపుకొట్టాలని చూస్తున్నారు. మూడు గంటల కరెంటు, 10 హెచ్‌పీ మోటర్లంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. రైతులు బాగుపడడం వారికి ఇష్టం లేనట్టుంది. రైతుల కోసం శ్రమించే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే రైతు కుటుంబాలు బాగుంటాయి. 3 గంటల కరెంట్ ఇచ్చేటోళ్లు, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టేటోళ్లు మాకొద్దు.
– శ్రీశైలం, రైతు, తిర్మలాపూర్, రాజాపూర్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా