కోరుట్ల రూరల్/మోర్తాడ్, జూలై 18: కరెంట్ కోతలపై రైతులు కన్నెర్రజేశారు. కోతలు లేకుండా నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో రైతులు, నిజామాబాద్ జిల్లా బాల్కొండలో స్థానికులు సబ్స్టేషన్లను శనివారం ముట్టడించారు. కోరుట్ల మండలం అయిలాపూర్‌లో సబ్‌స్టేషన్‌ను ముట్టడించి అక్కడే రాస్తారోకో చేపట్టిన ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో వరి, మక్క పంట వేశామని, విద్యుత్తు సరఫరా సరిగా చేయకపోవడంతో నీరందక ఎండిపోతున్నాయని వాపోయారు. బీఆర్ఎస్ హయాంలో 24గంటల త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతులను చిన్నచూపు చూస్తున్నదని, ప్రస్తుతం 10 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నా, అందులోనూ తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యవసాయానికి నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్తు సరఫరాను చేయాలని కోరుతూ ఏడీఏకు వినతిపత్రాన్ని అందజేశారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగగా, పోలీసులు వచ్చి రైతులను సముదాయించి విరమింపజేశారు.
బాల్కొండలో గ్రామస్తులు..
రాత్రివేళ తరచూ కరెంట్ తీసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ స్థానికులు నిజామాబాద్ జిల్లా బాల్కొండ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కరెంట్ కోతలు విధిస్తుండటంతో ఇండ్లల్లో ఉండలేకపోతున్నామని, సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఆర్మూర్ డీఈ రఘు, ఏడీఈ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని, స్థానికులతో మాట్లాడారు. విద్యుత్తు సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.