ధర్మసాగర్, నవంబర్ 1: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ శివారులో నీట మునిగిన పంటలను శనివారం పరిశీలించేందుకు వచ్చిన కడియంపై రైతులు మండిపడ్డారు. వరదల్లో కొట్టుకుపోయిన కాలువ, పంటలను పరిశీలిస్తుండగా నష్టపోయిన రైతులు నిరసన తెలిపారు.
ఓ రైతు పురుగు మందు డబ్బాతో ఆత్మహత్యకు యత్నిస్తుండగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ గేట్లను ఎత్తివేసే క్రమంలో ఆయకట్టు పరిధి రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అధికారుల నిర్లక్ష్యంతోనే తమ పంటలు నీటమునిగాయని, దీంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే కడియం ఆగ్రహం వ్యక్తంచేశారు. పక్షం రోజుల్లో కాలువ పనులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.