Congress | పరిగి, నవంబర్ 11 : దుద్యాల మండలం హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటీబండతండా, పులిచర్లకుంటతండాల పరిధుల్లోని 1,375 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం, ఇందుకోసం భూ సేకరణకు చర్యలు చేపట్టింది. దీనిని నిరసిస్తూ ఆ ఐదు గ్రామాల రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలతో తమ ఉద్యమాన్ని ఉధృతంచేశారు. భూములు ఇచ్చేది లేదని అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు ఇచ్చారు.
ప్రజాభిప్రాయ సేకరణ అంటూ తమ గ్రామాలకు మళ్లీ మళ్లీ రావొద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల పోరాటానికి మద్దతుగా అక్టోబర్ 9న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పోలేపల్లి నుంచి దుద్యాల వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించగా సర్కార్ పోలీసులతో ముందస్తు అరెస్టుల ద్వారా అడ్డుకున్నది.
పాదయాత్రకు వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిని అరెస్టు చేశారు. అక్టోబర్ 25న లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ ఏర్పాటు చేయగా రోటిబండతండా మీదుగా వెళ్తున్న కాంగ్రెస్ దుద్యాల మండలాధ్యక్షుడు శేఖర్‌ను రైతులు అడ్డుకొని, పంట పొలాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనను నువ్వే ముందుకు తీసుకుపోతున్నావంటూ నిలదీశారు.
సోమవారం ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు లగచర్లకు దూరంగా హకీంపేట, దుద్యాల మధ్య వేదిక ఏర్పాటు చేయగా.. గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కలెక్టర్ ప్రతీక్‌జైన్, కడా ప్రత్యేకాధికారి లగచర్లకు వెళ్లగా దాడి జరిగింది. ఫార్మా రైతుల ఆందోళన, ఆగ్రహావేశాలతో దుద్యాల మండలంలోని అయిదు గ్రామాల వైపు కాంగ్రెస్ నేతలు కనీసం వెళ్లడం లేదని చెప్పొచ్చు.