నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 15: పంటను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన రైతులు… ఇంటిల్లిపాది యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. అదనుదాటితే ఎరువు వేసినా ప్రయోజనం ఉండదని, దిగుబడి భారీగా తగ్గిపోతుందని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. యూరియా దొరుకుతుందన్న ఆశతో తెల్లవారగానే రైతువేదికలు, పీఏసీఎస్ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. యూరియా రాలేదంటూ అధికారులు టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
రమ్మన్న సమయానికి వచ్చినా కూడా ఇంకా లోడ్ రాలేదంటూ ముఖం చాటేస్తున్నారు. మరోవైపు రైతులకు ఇచ్చేందుకు ఎరువు కరువైందని ప్రభుత్వం చెప్తుంటే.. లారీలకు లారీల లోడ్ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యూరియా కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. వినూత్న రీతిలో నిరసనలు నిర్వహిస్తూ సర్కారుకు కనువిప్పు కలిగించేలా యూరియా సంచులతో బతుకమ్మ ఆడుతున్నారు.
ఒక్క యూరియా బస్తా కోసం ఉయ్యాలో
నాడు తెలంగాణ ప్రజల గోస బతుకమ్మ పాటల రూపంలో వ్యక్తమైంది. నేడు తెలంగాణ రైతుల యూరియా కష్టాలను కూడా బతుకమ్మ పాటల రూపంలో పాడుకునేదాకా వచ్చింది. రాష్ట్రంలో ఎరువుల కొరతపై సోమవారం కరీంనగర్ మండలం దుర్శేడులో మహిళలు వినూత్నంగా బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ‘ఒక్క యూరియా బస్తా కోసం ఉయ్యాలో.. పడిగాపులు పడుతున్నరు ఉయ్యాలో” అంటూ పాట పాడుతూ బతుకమ్మ ఆడి కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు. వీరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికారు.
నిరసనకు దిగితే నిర్బంధమా?
కరీంనగర్ జిల్లా దుర్శేడులో రాజీవ్ రహదారిపై రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను అరెస్ట్ చేసి బలవంతంగా తరలిస్తున్న పోలీసులు
నిరీక్షించి.. నీరసించి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సొసైటీ వద్ద యూరియా కోసం బారులు తీరి, కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన రైతులు
విసుగెత్తి రోడ్డెక్కిన రైతులు
యూరియా దొరకక అవస్థలు పడుతున్నామంటూ ఆవేదనతోవరంగల్ జిల్లా ఖానాపురంలో నర్సంపేట-మహబూబాబాద్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించిన రైతులు, భారీగా నిలిచిపోయియిన వాహనాలు
పడిగాపులే పనయిపాయే
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని రైతు వేదిక వద్దకు ఉదయమే పెద్ద సంఖ్యలో తరలివచ్చి యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులు
గోడు చెప్పుకుంటే గొడవేంటి?
నారాయణపేట జిల్లా మరికల్లో యూరియా కోసం రాస్తారోకో చేస్తున్న అన్నదాతలు, అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం
నిర్లక్ష్యంపై నిరసన జ్వాల
యూరియా సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట తహసీల్దార్ కార్యాలయం గేటు మూసివేసి, బైఠాయించిన రైతులు
ఆకలితో అన్నదాత పడిగాపులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సొసైటీ కార్యాలయం వద్ద సోమవారం తెల్లవారుజాము నుంచే రైతులు పెద్దసంఖ్యలో బారులుదీరారు. సుదూర ప్రాంతాల నుంచి ఇబ్బందులు పడ్డారు. సొసైటీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కాంపెల్లి కనకేశ్ ఆధ్వర్యంలో రైతులకు భోజనం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు.
అట్టుడికిన ఆదిలాబాద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సోమవారం యూరియా కోసం రైతులు పంపిణీ కేంద్రాల వద్ద బారులుదీరారు. ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్, బేల, బజార్హత్నూర్, భీంపూర్, సోనాల పంపిణీ కేంద్రాల పడిగాపులు కాశారు. భీంపూర్‌లోని ఆదిలాబాద్-మహారాష్ట్ర రోడ్డుపై బైఠాయించారు. లక్షెట్టిపేటలోని అంబేదర్ చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.
క్యూలో రైతుకు గాయం
జనగామ జిల్లా కొడకండ్లలోని గ్రోమోర్ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూలో జరిగిన తోపులాటలో కింద పడటంతో తలకు గాయమై విలవిల్లాడుతున్న కడగుట్ట తండాకు చెందిన ధరావత్ బిచ్చ(75)
3 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది? ; బ్లాక్ దందాను ఎందుకు కంట్రోల్ చేయట్లేదు: బండి
కరీంనగర్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ర్టానికి కేంద్రం పంపిన 12 లక్షల టన్నుల యూరియాలో 3లక్షల టన్నుల యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ యూరియా ఏమైందో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలని అన్నారు. కరీంనగర్లో పాస్‌పోర్టు కార్యాలయ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. ముందుగా పొన్నం మాట్లాడుతూ ఎరువుల తయారీ, ఎరువుల పంపిణీ బాధ్యత కేంద్రానిదేనని, యూరియా కోసం బండి సంజయ్‌కి విజ్ఞప్తి చేశామని తెలిపారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 9లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అడిగితే కేంద్రం పంపిందని, మళ్లీ 3 లక్షల మెట్రిక్ టన్నులు కావాలంటే ఇచ్చిందని తెలిపారు. అదనంగా ఇచ్చిన 3లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఏమైందో చెప్పాలన్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే గన్‌మ్యాన్ లారీలోడ్ యూరియాను పక్కదారి పట్టించాడని, దొరకని లోడ్స్ ఎన్ని అని, బ్లాక్‌మార్కెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నదని బండి సంజయ్ ప్రశ్నించారు.
మరో 40 వేల టన్నుల యూరియా వస్తున్నది ; మంత్రి తుమ్మల వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి కేంద్రం అదనంగా మరో 40 వేల టన్నుల యూరియా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. త్వరలోనే రాష్ట్రానికి చేరుకుంటుందని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన మంత్రి తుమ్మల.. కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ కార్యదర్శి రజత్‌కుమార్ మిశ్రాతో సమావేశమయ్యారు. వరి, మక్కకు, పత్తి పంటలకు యూరియా అత్యవసరమని చెప్పారు