నమస్తే తెలంగాణ, న్యూస్‌నెట్‌వర్క్ ; రుణమాఫీపై ధోఖా చేసిన సర్కారుపై రైతులు సమరశంఖం పూరించారు. మూడు విడతల్లోనూ మాఫీ కాకపోవడంతో కడుపుమండి రోడ్డెక్కారు. ప్రభుత్వ రుణభంగాన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రమంతటా రణరంగమైంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో 44 జాతీయరహదారిపై, జగిత్యాల జిల్లా మెట్పల్లి 63వ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాప్రిలో, నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో, బోధన్ మండలం కల్దుర్కిలో, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో అన్నదాతలు ఆందోళనలు నిర్వహించారు. బాన్సు వాడలో రుణమాఫీకాని రైతుల సంతకాలను సేకరించారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో,మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని రైతువేదిక వద్ద రైతులు వ్యవసాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ ఏపీజీవీబీకి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలోని ఇండియన్ బ్యాంకుకు రైతులు తాళం వేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద రైతులు పడిగాపులు కాశారు.నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ వ్యవసాయ శాఖ కార్యాలయం, వికారాబాద్ జిల్లా మైలార్‌దేవ్‌పల్లి ఏడీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కథలాపూర్‌లో జరిగిన ధర్నాలో మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇదే ధర్నాలో ఏనుగు సాగర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్ఐ నవీన్‌కుమార్ అప్రమత్తమై రైతు చేతిలో నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కెళ్లారు.