హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మొంథా తుపాను (Cylone Montha) బీభత్సంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వారం రోజులుగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసినా.. పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ సర్కారు (Congress Govt) పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి, వడ్లు, మక్కలు, సోయాబీన్ సహా పంటలన్ని తడిసిపోతున్నాయని భోరుమంటున్నారు. పత్తిలో నీళ్లు చేరి ఎందుకూ పనిరాకుండా పోతున్నదని వాపోతున్నారు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రోదిస్తున్నారు. విపత్కర సమయంలో ఆదుకోవాల్సిన సర్కారు.. చేతులెత్తేసిందని నిప్పులు చెరుగుతున్నారు.
వర్షాలొస్తాయని తెలిసినా వీడని నిర్లక్ష్యం
వర్షాలొస్తాయని సర్కారుకు ముందే తెలుసు. ఇలాంటి సందర్భంలో పంట కొనుగోళ్లలో వేగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించిందని రైతులు మండిపడుతున్నారు. ఈ సీజన్లో 80 లక్షల టన్నుల వడ్లు, 25 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు. ఈ నెలలో 6.89 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. కానీ 2 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. పంటల కొనుగోళ్లు ఎంత ఘోరంగా జరుగుతున్నాయో ఈ లెక్కలను బట్టి అర్థం చేసుకోవచ్చని రైతులు మండిపడుతున్నారు.
తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు
వడ్లు, మక్కలు, పత్తి కొనుగోలు కేంద్రాల్లో సర్కారు నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పంటల కొనుగోళ్లకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. ఈ సీజన్లో పత్తి కొనుగోళ్ల కోసం 318 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 72 జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. అంటే ఇంకా 246 మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభమే కాలేదు. సోమవారం వరకు 4428 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించింది. ఇంకా 3814 కేంద్రాలు ప్రారంభానికే నోచుకోలేదు. ప్రారంభించిన కేంద్రాల్లోనూ కేవలం 100లోపు కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోళ్లు మొదలైనట్టు తెలిసింది. ఈ విధంగా ప్రభుత్వం పంటల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొర్రీలతో తిప్పలు.. రైతుకు సీసీఐ చుక్కలు
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది.. పత్తి రైతుల పరిస్థితి. అసలే అకాల వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. దిగుబడి సగానికి సగం పడిపోయింది. ఇప్పుడు మరోసారి తుపాను రావడంతో రైతులకు దెబ్బ మీద దెబ్బ పడినైైట్టెంది. చేతికొచ్చిన పత్తిలో వర్షపు నీళ్లు చేరి పాడైపోతున్నది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మాత్రం పత్తి రైతులకు చుక్కలు చూపిస్తున్నది. తేమ 12శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని, లేదంటే కొనుగోలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నది. కాంటపై పెట్టిన పత్తిని తిప్పి పంపిస్తున్నది. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోక తప్పడంలేదు. మద్దతు ధర రూ.8110 ఉండగా ప్రైవేటు వ్యాపారులకు రూ. 5-6 వేలకు విక్రయించి నష్టాలను మూటగట్టుకుంటున్నారు. రైతులను సీసీఐ అధికారులు సతాయిస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు చేష్టలుడిగి చూస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అకాల వర్షం..భారీ పంట నష్టం!
మొంథా తుపాను బీభత్సంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30వేల ఎకరాల వరకు పంటకు నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ముఖ్యంగా పత్తి, వరి పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. పత్తి దూది పింజ వర్షానికి తడిసిపోయి నల్లబడుతుండగా, వరి పైరు నేలకొరిగినట్టు గుర్తించారు. దీనికి తోడు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయినట్టు అధికారులు తెలిపారు. ఈ వర్షాలకు ప్రధానంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలతోపాటు సిద్దిపేట జిల్లాలోని కొంతమేర పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.