హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు ఏడాది ఏలుబడిలో రైతులు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు అధ్యయన కమిటీ నిర్వహిస్తున్న సమావేశాల్లో స్పష్టమవుతున్నది. కమిటీ పర్యటనల్లో ప్రతీ రైతు ఆవేదనను పంచుకుంటున్నారు. ఏ రైతును కదిలించినా ఏడాదిగా కడుపులో దాచుకున్న అంతులేని బాధను వెళ్లబోసుకుంటున్నారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులకు రైతు అధ్యయన కమిటీ ధైర్యాన్ని అందిస్తున్నది.
బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ శనివారం నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్‌లో నిర్వహించిన సమావేశంలో రైతులు తమ సమస్యలు చెప్పుకున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా రాక పెట్టుబడికి ఇబ్బందిగా మారిందని తెలిపారు. అమలుకు నోచుకోని రుణమాఫీ, వేధిస్తున్న కరెంటు కోతలు, సాగునీటి కొరతతో అవస్థలు పడుతున్నామని చెప్పారు. పంట కొనకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆవేదనను వెల్లడించారు. సమావేశంలో ఒక్కోరైతు 5 నుంచి 10 నిమిషాల పాటు మాట్లాడారు. ఏడాదిగా కడుపులో దాచుకున్న గోడును వెళ్లగక్కారు.
రైతు అధ్యయన కమిటీ సభ్యులు అన్నదాతల బాధ వింటూ ధైర్యం నింపుతున్నారు. దీంతో కమిటీని చూడగానే రైతుల్లో భరోసా వస్తున్నది. ఎదురొచ్చి గ్రామాల్లోకి ఆహ్వానిస్తున్నారు. రైతులు పిడికిలి బిగించి సమరానికి సిద్ధమంటూ నినదిస్తున్నారు. అధ్యయనంలో భాగంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రుణమాఫీ, రైతుభరోసా, ఇతర అంశాలపై రైతులను ప్రశ్నలు అడుగుతున్నారు. రూ.2 లక్షల రుణమాఫీ అయిందా? అని ప్రశ్నిస్తుంటే అక్కడున్న 99 శాతం మంది రైతులు కాలేదని చెప్తున్నారు. ‘అంతా ఉత్తదే.. ఉత్తదే’ అంటూ నినాదాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ ముందు సమస్యలను ఏకరవు పెడుతున్న అన్నదాతలు ఫిర్యాదులు కూడా అందిస్తున్నారు. శనివారం బుస్సాపూర్ సమావేశానికి చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా తరలివచ్చారు. ఒక్క సమావేశంలోనే 82 ఫిర్యాదులు అందాయంటే రైతులు ఎంతటి కష్టాల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.