Runa Mafi | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మాటే శిలాశాసనం అంటూ రుణమాఫీపై సంబురాలు చేసిన ప్రభుత్వాన్ని రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. గురువారం ఒక్కరోజే లక్షలోపు రుణాలన్నీ మాఫీఅయ్యాయని అదరగొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు నమ్మి బ్యాంకులకు వెళ్లిన అన్నదాతలకు చుక్కెదురు అయింది. రుణమాఫీ జాబితాలో బూతద్దం పెట్టి వెతికినా పేరు కనిపించకపోవడంతో కన్నెర్ర చేశారు. మిత్తితో కలిపి లక్షలోపు రుణం ఉన్నా మాఫీ ఎందుకు కాలేదని ప్రశ్నిస్తే సమాధానం చెప్పే నాథుడే దొరకలేదు. వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు ఒకరిపైఒకరు నెపాన్ని నెట్టే సుకుని రైతులకు ముఖం చాటేశారు. మార్పు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మితే.. మోసపోతిమి కదరా.. రామా.. ! అంటూ రైతులు తలలు పట్టుకున్నారు. రుణ మాఫీ కాకపోతే కర్రు కాల్చుడేనని హెచ్చరించారు.
రుణమాఫీపై సప్పుడులేదు 
నాకు ఎకరం 10 గంటల భూమి ఉంది. రెండేండ్ల క్రితం ఏపీ గ్రామీణ వికాస్బ్యాంక్లో 90 వేలు అప్పు తీసుకున్నా. బ్యాంకుకు వచ్చి అడిగితే నీ పేరు రాలేదు.. రుణమాఫీ కాలేదు అంటున్నారు. ఎందుకు కాలేదు అనని అడిగితే సడీసప్పుడు చేస్తలేరు.
-పరమాల ఐలయ్య, పుల్లూరు, సిద్దిపేట జిల్లా
చెప్పేదొకటి.. చేసేదొకటి
నేను రూ.35 వేల రుణం తీసుకున్న. లెక్క ప్రకారం నాకు వస్తదని అధికారులు చెప్పిన్రు. కానీ నాపేరు లిస్ట్‌లో లేదు. రుణమాఫీ కాలే. కాంగ్రెస్ సర్కారు చెప్పేదొకటి.. చేసేదొకటని అర్థమయితంది. ఇప్పుడే ఇట్లుంటె కాంగ్రెస్ సర్కారు మున్ముందు ఎట్లుంటదో సూడాలె. ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష లోపు ఉన్నోళ్లందరికీ వెంటనే రుణమాఫీ చేయాలె.
-కూచనపల్లి రాకేష్, యువరైతు, వీణవంక (19కేఎన్ఆర్08బీ)
సగం మాఫీ చేసి సంబురాలా ? 
కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ అన్నది. నాకున్న రూ.75 వేల రుణాన్ని మాఫీ చేయలేదు.రూ.56 వేలు మాత్రమే మాఫీ అయ్యిందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. సగం డబ్బులే మాఫీ చేసి.. కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటు.
– కృష్ణయ్య, మక్తల్, నారాయణపేట

జాబితాలో పేరున్నా డబ్బులు రాలేదు
నాకున్న ఎకరం భూమి ఉంది. ఏపీజీవీబీలో రూ.80 వేలు రుణం తీసుకున్నా. బ్యాంకుకు వెళ్లి రుణ మాఫీ గురించి అడిగితే డబ్బులు రాలేదని మేనేజర్ చెప్పారు. వ్యవసాయశాఖ అధికారులకు వద్దకు వెళ్లి తెలుసుకొమ్మని చెప్పారు. జాబితాలో నా పేరు ఉన్నా.. ఖాతాలో డబ్బులు జమ కాలేదు.
-గనపారపు కృష్ణ, లక్ష్మీపురం, ఖమ్మం
కేసీఆర్ మిత్తితోటి మాఫీ చేసిండు..
నాకు ఎల్లారెడ్డిపేట శివారులో వ్యవసాయ భూమి ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మిత్తితోటి రూ.25 వేలు మాఫీ అయింది. మళ్లీ రూ.25 వేల పంట రుణం తీసుకున్న. కానీ ఇప్పుడు లిస్టులో నాపేరు రాలేదు. రూ.25 వేల అప్పుకు మాఫీ ఎందుకు కాలేదని అడిగెతందుకు బ్యాంకుకు వచ్చిన.
– బుర్క నర్సయ్య, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా
నిరాశే మిగిలింది
నాకు 1.04 గుంటల భూమి ఉంది. 2018 డిసెంబరులో బొంరాస్‌పేట ఎస్బీఐలో రూ.48 వేలు పంటరుణం తీసుకున్న. ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్ తేదీలోనే రుణం తీసుకున్న. మాఫీ అవుతుందని ఎంతో ఎదురు చూశా. కానీ లబ్ధిదారుల జాబితాలో నా పేరు లేకపోవడంతో నిరాశే మిగిలింది. ఎందుకు రుణమాఫీ కాలేదో అర్థం కావడం లేదు.
-రమేశ్‌గౌడ్, తుంకిమెట్ల,వికారాబాద్ జిల్లా

247లో 97మందికే మాఫీ 
గీసుగొండ సొసైటీలో నేను రూ. 75 వేలు రుణం తీసుకున్న. గత సంవత్సరం వడ్డీ కట్టిన. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ఆనంద పడ్డా. కానీ రుణమాఫీ లిస్టులో నా పేరు లేదు. దీనిపై ఎవ్వలను అడిగినా కరెక్టుగ చెప్తలేరు. గీసుగొండ సొసైటీ పరిధిలో లక్ష లోపు రుణం ఉన్న రైతులు 247 మంది లిస్టు పంపితే అందులో 97 మంది రైతులకే మాఫీ వచ్చింది. మిగతా రైతులు ఆందోళన చెందుతున్నరు.
– మండ గోపాల్, బొడ్డుచింతలపల్లి, వరంగల్ జిల్లా
మాఫీ కొందరికే 
నాకు కడ్తాల్‌లో 1.21 ఎకరాల పొలం ఉంది. కెనరా బ్యాంక్‌లో రూ.66 వేల రుణం తీసుకున్నాను. బ్యాంక్‌కి వెళ్లి అధికారులను అడిగితే నీ పేరు లిస్ట్‌లో లేదని చెబుతున్నారు. రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఏ విధంగా చేస్తుందో అర్థం కావడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొందరికి రుణమాఫీ చేసి, మరికొందరికి చేయకపోవడం అన్యాయం.
– ఎగిరిశెట్టి దశరథం, కడ్తాల్, రంగారెడ్డి జిల్లా
మోసపోతిమి గదరా..రామా! 
ఎన్నికల ముందు కాంగ్రెసోళ్లు ఏకకాలంలో రుణమాఫీ చేత్తమన్నరు. గిప్పుడేమో మూడు విడతల్లో అంటున్నరు. గురువారం ఊరుకో 10 నుంచి 20 మందికే వచ్చింది. గిది న్యాయమేనా రేవంత్‌రెడ్డి సారూ.. ప్రభుత్వం చేసిన జిమ్మిక్కు దాత్తేదాగేదా ఏందీ.. ఏవో సార్ టీవీల ఆధార్ నంబర్ కొడితే రుణమాఫీ చేసిన బాగోతం బయట పడుతూనే ఉండె. రేవంత్ సార్ తప్పకుడా రుణమాఫీ చేత్తడని ఆశ పడ్డం. గిైట్లెతదనుకోలే. మార్పు మార్పు అని మోసపోతిమి గదరా.. రామా..
– గుండాల కుమారస్వామి, నల్లబెల్లి, వరంగల్ జిల్లా
60 వేలే అప్పు.. అయినా కాలేదు
నాకున్న ఎకరం భూమిపై తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.60వేల క్రాప్‌లోన్ తీసుకున్న. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడుతలో రూ.లక్షలోపు రుణమాఫీ అని ప్రకటించింది. సంబురాలు కూడా చేసింది. నేను బ్యాంకు వెళితే లిస్ట్‌లో నా పేరు లేదు. అధికారులు పరిశీలించి బ్యాంకు రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలి.
-ఆర్క నాగోరావ్, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్
రేషన్‌కార్డు లేదంటున్నరు 
తాడిచర్ల దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో పట్టాదారు పాస్ పుస్తకం పెట్టి పోయినేడాది రూ.60 వేలు పంట రుణం తీసుకున్న. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రూ. లక్ష వరకు రుణ మాఫీ చేస్తున్నట్టు చెప్పిన్రు. లిస్టులో నా పేరు లేకపోవడంతో బ్యాంక్‌కు వెళ్లి అడిగిన. ఇప్పటి వరకు వడ్డీతో కలిపి రూ.71 వేలు అయినట్లు చెప్పిన్రు. రేషన్ కార్డు లేకపోవడంతో రుణమాఫీ కాలేదంటున్నరు.
– మల్క భాస్కర్‌రావు, తాడిచర్ల, జయశంకర్ భూపాలపల్లి
31వేలే.. మాఫీ కాలే 
నాకు బేతంపూడి సొసైటీలో రూ.31వేల క్రాప్ లోన్ ఉంది. ప్రతి సంవత్సరం రుణానికి వడ్డీ కట్టి రెన్యూవల్ చేయించుకుంటున్నా. కానీ రుణమాఫీ లిస్టులో నా పేరు లేదు. రూ.2 లక్షలలోపు పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పేద రైతును నేను. రుణమాఫీ చేయాలని చేతులెత్తి దండంపెట్టి కోరుతున్నా.
– ధరావత్ జయినా, కోక్యితండా, భద్రాద్రి కొత్తగూడెం
గిట్ల చేస్తరనుకోలే 
నాకు ఎకరం భూమి ఉంది. పట్టా పుస్తకంతో సాగుకు రూ. 45 వేల రుణం తీసుకున్న. నాకు పెండ్లి అయ్యింది. పిల్లలు ఉన్నరు. రేషన్ కార్డు మాత్రం లేదు. రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని చెప్పిన్రు. నేను వందకు వంద శాతం అర్హున్ని. అయినా నాకు రుణమాఫీ కాలే. రుణమాఫీ చేస్తమని వాగ్ధానం చేసి.. ఇప్పుడేమో గిట్ల చేస్తరనుకోలే.
– ఎంబడి తిరుపతి, రైతు, లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా
ఎవ్వరూ చెప్తలేరు
నాకు జఫర్‌గఢ్‌లోని ఏపీజీవీబీలో రూ.60 వేలు బాకీ ఉంది. నాతోపాటు చాలామందికి రుణమాఫీ కాలేదు. వ్యవసాయశాఖ, బ్యాంక్ అధికారులను ఎవ్వరిని అడిగినా సక్కగ చెప్తలేరు. ఇప్పటికైనా రైతుల రుణమాఫీని వెంటనే చేయాలి.
– కౌడగాని సుధీర్,సాగరం, జనగామ జిల్లా
సర్కారుకు మంచిది కాదు 
నాకు ఎకరం భూమి ఉంది. ఏడాది క్రితం పీఏసీఎస్‌లో 40 వేల రుణం తీసుకున్నా. సహకార సంఘం వద్దకు వస్తే జాబితాలో పేరు లేదు. మాలాంటి ముసలోళ్లను తిప్పడం సర్కారుకు మంచిది కాదు.
-కల్లూరి రామిరెడ్డి, ధర్మారెడ్డిగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లా
కేసీఆర్ చేసిండు.. కాంగ్రెస్ చేయలేదు
నాకు ఎకరన్నర పొలం ఉన్నది. సాగు కోసం బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాను. కేసీఆర్ ప్రభుత్వంలో రూ.56 వేలు మాఫీ కాగా.. ఇప్పుడు రూ.28 వేలు రుణం ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని ప్రకటించడంతో డబ్బులు చెల్లించలేదు. తీరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లిస్ట్‌లో నా పేరు కనిపించడం లేదు.
-రాజేందర్, కోటకదిర, మహబూబ్‌నగర్
మాఫీ చేస్తదో.. చేయదో?
నాకు రెండెకరాల భూమి ఉంది. యూనియన్ బ్యాంకుల క్రాప్ లోన్ రూ.72 వేలు తీసుకున్న. రుణమాఫీ లిస్ట్‌లో నా పేరు రాలేదు. అధికారులను అడిగితే సరిగ చెప్తలేరు. బ్యాంక్‌కు వస్తే ఇప్పుడు చెప్పమని వెళ్లిపో అన్నరు. కొద్దిసేపటికి రెండో దఫా మాఫీ చేసినప్పుడు అయితవని చెప్పిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తదో చేయదో తెలుస్తలేదు.
– పీసం నాగేశ్వరరావు, ఈదులపూసపల్లి,మహబూబాబాద్ జిల్లా
నాకెందుకు మాఫీ కాదు ? 
నాకు ఎకరంన్నర భూమి ఉంది. కోహీర్ బ్యాంకులో 2023 ఆగస్టు 30న రూ.80వేల రుణం తీసుకున్నా. ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ.80.708 అయింది. మాఫీ ఎందుకు కాలేదని బ్యాంకు అధికారులను అడిగితే లోన్ తీసుకున్న వివరాల పేపరు తీసి నా చేతిలో పెట్టారు. మా కుటుంబంలో నేను ఒక్కడిని మాత్రమే లోన్ తీసుకున్నా. అయినా ఎందుకు కాలేదో ఎవరూ చెప్పడం లేదు.
-శంకర్, కోహీర్ గ్రామం, సంగారెడ్డి జిల్లా
వడ్డీ చెల్లిస్తేనే మాఫీ చేస్తరట..
2021లో రూ.35 వేలు పంట కోసం రుణం తీసుకున్న. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేశామని ప్రకటించడంతో బ్యాంకుకు వచ్చాను. బ్యాంకు అధికారులను అడిగితే ఇంకా రూ.6వేలు వడ్డీ చెల్లించాల్సి ఉందని చెప్పారు. వాటిని చెల్లిస్తేనే రుణం మాఫీ అవుతుందంటున్నారు. అసలు రుణం, వడ్డీతో కలిపి రూ.లక్షలోపు కూడా లేదు. కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్షలోపు రుణం వడ్డీతో సహా మాఫీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మాఫీ చేసి, వడ్డీ చేయడంలేదు. ఇదేమి న్యాయం ?
-బోయ హన్మంతు, ఉప్పేరు, జోగుళాంబ గద్వాల