నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 2 : ఆరుగాలం కష్టపడి పంటలను పండించే రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక్క బస్తా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే క్యూలో పడిగాపులు కాస్తున్న పరిస్థితి దాపురించింది. ఒకవైపు మంత్రులు, అధికారులు యూరియా కొరత లేదని ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల అవస్థలు వర్ణనాతీతంగా కనిపిస్తున్నాయి. ఖమ్మంజిల్లా చింతకాని మండలంలో గత నెల 31న 750మంది రైతులకు యూరియా కోసం కూపన్లు పంపిణీ చేశారు.
నాగిలికొండ గ్రామానికి 420 కట్టలు, మత్తేపల్లికి 420 కట్టలు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఒకో రైతుకు సాగు విస్తీర్ణాన్నిబట్టి 5 నుంచి 10 కట్టల అవసరం ఉండగా.. ఒకటీ రెండు బస్తాలు మాత్రమే సరఫరా చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి, చంద్రయ్యపల్లి, రామవరం, స్వామినాయక్తండా, బుచ్చినాయక్తండా, రాంనగర్ గ్రామాల్లో రైతులు తెల్లవారుజామునే తరలివచ్చి క్యూ కట్టారు. చెన్నారావుపేట మండలం అక్కల్చెడ, పాపయ్యపేట, లింగగిరి గ్రామాల్లో రైతులు యూరియా కోసం చలిని సైతం లెక్క చేయకుండా దుప్పట్లు కప్పుకొని లైన్లో వేచి ఉన్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ పీఏసీఎస్ ఎదుట యూరియా కోసం రైతులు ఉదయం 4 గంటల నుంచి పడిగాపులు కాశారు.