తొర్రూర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు (Farmers) కష్టాలు పెరిగాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం, మాటేడు గ్రామ రైతులు పక్కనే కాలువ ఉన్నా నీటి కొరతతో పంటలను కోల్పోతున్నారు. వ్యవసాయం కోసం అప్పులు చేసి ఖర్చు పెట్టిన రైతులకు ప్రభుత్వం నీటి సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది. సేద్యానికి నీరు ప్రాణాధారం. అయితే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాలువలు మిగిలినా, నీరు మాత్రం అందడం లేదు. మాటేడు గ్రామంలో 12 ఎకరాల వరి పంట పెట్టిన రైతులు, నీటి లభ్యత లేక పంటను పూర్తిగా కోల్పోయారు. సాగు కోసం తీసుకున్న అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
రైతుల సమస్యలను అధికారులకు తెలియజేసినా, అధికారులు స్పందించకపోవడంతో సమస్య మరింత పెరిగింది. నీటి కేటాయింపు, కాలువ నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అడుగు దూరంలో నీరు ఉన్నా, పొలాలకు మాత్రం చేరడం లేదు. మాటేడు చెరువులో నిండుగా నీరున్న పొలాలకు చేరుకొని వైనంగా అధికారుల నిర్వహణ కొనసాగుతుంది. ఒకపక్క పంటలు ఎండిపోతుంటే చెరువు నిండా నీరు ఉంచుకొని పంటకు నీరీయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పంటలు పొట్ట దశకు వస్తున్న సమయంలో కూడా పంటలకు నీరందకపోతే పంటలో తాలు సంభవిస్తుందని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి పంటలకు నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో సాగునీటి సమస్యలు పరిష్కరిస్తామన్న కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి రాగానే పూర్తిగా మౌనంగా మారిపోయారు. నీటి సరఫరా, కాలువల నిర్వహణ, చెరువుల పునరుద్ధరణపై ప్రభుత్వానికి ఎలాంటి క్లారిటీ లేకపోవడం వల్ల రైతులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. తొర్రూరు రైతులకు సాగునీటి సమస్య సకాలంలో పరిష్కరించకపోతే, భవిష్యత్తులో పరిస్థితి మరింత విషమంగా మారనుంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే, రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. రైతుల భరోసా కోల్పోయిన ఈ ప్రభుత్వం, వ్యవసాయాన్ని గాలికొదిలేస్తే రైతాంగం నాశనమవడం ఖాయం.
12 ఎకరాల పంట పెట్టాం.. కానీ ఎండిపోయింది!
ఎంతో ఆశగా 12 ఎకరాలు కౌలుకు తీసుకుని, ఆశగా రెండు లక్షల 20 వేల రూపాయలు అప్పు తెచ్చి వరి పంట వేశానని మాటేడు గ్రామ రైతు అక్కల శంకర్ అన్నారు. మంచి ఆశలతో మొదలెట్టిన పంట ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు, ఎవర్ని అడగాలో కూడా తోచడం లేదు. పక్కనే సబ్ కెనాల్ కాలువ ఉంది. కానీ అందులో నీరు రావడం లేదు. కళ్ళ ముందు నీటి వంతెనలా కనిపించినా, మా పొలాలకు మాత్రం చుక్క నీరు రాలేదు. ఒక్క బోరు, ఒక బావి ఉన్నా వాటిలోనూ నీరు లేకపోయింది. బోరు నీటిమట్టం పడిపోయింది, బావిలో వారానికి ఒకసారి కొద్దిగా నీరు ఊరుతున్నా, 12 ఎకరాల పొలానికి అది ఏం సరిపోతుంది?,మేము పంట పెట్టిన అప్పులు ఎప్పుడు తీర్చగలం? మా కుటుంబం ఇప్పుడు ఎలా బతకాలంటే అర్థం కావడం లేదు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యులు కాదా. పక్కనే కాలువ ఉంచి, మాకు నీరు ఇవ్వకపోతే, మేం రైతులుగా ఎలా బ్రతకగలమని ప్రశ్నించారు.