ఊట్కూర్ (కృష్ణ), ఏప్రిల్ 03: నారాయణపేట జిల్లా కృష్ణ మండలం భీమా నది (Bhima River) పరివాహక రైతులు సాగు నీటికి సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. దాదాపు రెండు నెలలుగా ఎగువనున్న కర్ణాటక నుంచి భీమాకు సాగునీటిని విడుదల కాకపోవడంతో వరి పంటలకు సరిపడా సాగునీరందక రైతులు కంట నీరు పెడుతున్నారు. కృష్ణానది ప్రధాన ఉపనదులలో ఒకటైన భీమా.. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో పుట్టి ఆగ్నేయ దిక్కున మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో ప్రవహిస్తూ కృష్ణానదిలో కలుస్తుంది. 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు రైతులకు భీమా నది ద్వారా సాగునీరు అందించేందుకు నారాయణపేట జిల్లాలోని కృష్ణ మండలం తంగడి గ్రామం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేశారు.
దీని ద్వారా మండలంలోని సుకూర్ లింగంపల్లి, అయినాపూర్, కుసుమూర్తి, తంగడి గ్రామాల శివారు రైతులకు చెందిన1000 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కొన్నాళ్ల క్రితం కర్ణాటకలోని ఎగువన ఉన్న గూడూరు వద్ద బ్రిడ్జి కం బ్యారేజీని నిర్మించడంతో దిగువన ఉన్న తెలంగాణ రైతులు పంటలకు సాగునీరందక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఏడాది భీమా నది కింద రబీ వరి సాగు చేపట్టిన రైతులకు పంట పొట్ట దశలోనే సాగునీటి ఇబ్బందులతో పాటు కరెంటు కష్టాలు తోడవడంతో దిగుడుబడులపై పూర్తిగా ఆశలు వదులుకున్నారు. గతేడాది అంతంత మాత్రమే వరి పంటలు సాగు చేసిన రైతులు ఈ ఏడాది ఆరంభంలో ఊరించిన వర్షాలకు ఆశపడి పెద్ద మొత్తంలో రెండో పంట ఖరీఫ్ సాగుకు పూనుకున్నారు.
నదీ పరివాహక గ్రామాల రైతులతో పాటు లిఫ్ట్ కింద దాదాపు 5 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ప్రారంభంలో వరి నాట్లకు సరిపడు సాగునీరు నదిలో ఉన్నప్పటికీ సంక్రాంతి తర్వాత ఎగువ నుంచి రావాల్సిన సాగునీటి విడుదలను కర్ణాటక అధికారులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో పంటలు పొట్ట, పాలు పోస్తున్న దశలోనే ఎండిపోతున్నాయి. గూడూరు బ్యారేజి దిగువ నుండి కృష్ణ, భీమా సంగమం వరకు కలిపి దాదాపు పది కిలోమీటర్ల మేర గూడూరు బ్యారేజీ సెటర్ల లీకేజీ ద్వారా పారుతున్న నీటిని రైతులు ఒడిసి పడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు నదిలో జేసీబీల సహాయంతో లోతైన కాల్వలు తీసి విద్యుత్ పంపుసెట్లను ఏర్పాటు చేశారు. కళ్ల ముందు ఎండి పోతున్న వరి పొలాలకు నీటి తడిని అందించేందుకు రైతులు కంటిమీద కునుకు లేకుండా భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
మరో పక్క ఎండలు తీవ్రతరం అవుతున్న కొద్ది నదిలో ఉన్న కొద్దిపాటి నీళ్లు కూడా ఇంకిపోయి భీమా నది ఎడారిని తపిస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో పంటలను కాపాడుకునేందుకు ఎగువ నుండి నీటిని విడుదల చేయించడంలో ఇటు అధికారులు గాని అటు ప్రజాప్రతినిధులు గాని శ్రద్ధ వహించడం లేదని రైతులు వాపోతున్నారు. కర్ణాటక నుంచి భీమాకు నీటి విడుదల చేయించాలనే విషయాన్ని పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకుపోతున్నా తమ ఆవేదనను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
భీమా నదికి కర్ణాటక ఎగువ నుండి రెండు నెలలుగా సాగు నీటిని సక్రమంగా విడుదల చేయకపోవడంతో వరి పంటలు పొట్ట దశలోనే ఎండి పంటలు పూర్తిగా తాలుపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఓ పక్క సాగునీటి కష్టాలు, మరోపక్క కరెంటు కష్టాలతో పంటలకు సకాలంలో నీరందకపోగా ఎకరాకు 45 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. పంట పూర్తిగా తాలు పోయి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఆరంభంలోనే కర్ణాటక ఎగువ నుంచి నదికి నీరంధించి ఉంటే తమకు ఇన్ని కష్టాలు ఉండేవి కావని రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అటు కర్ణాటక ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండగా సాగు నీటిని విడుదల చేయించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భీమా నది కింద 40 ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. నదికి నీటిని విడుదల చేసే విషయంలో రేవంత్ సర్కార్ పట్టించు కోలేదని తంగడి గ్రామానికి చెందిన కావలి హనుమంతరాయ అనే రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువన ఉన్న కర్ణాటక గూడూరు బ్యారేజీ నుండి నదికి రెండు నెలలుగా నీటిని విడుదల చేయకపోవడంతో సకాలంలో నీరందక 90 శాతం పంట గింజ గట్టిపడక తాలు పోయింది. ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు పెట్టుబడి ఖర్చయింది. కర్ణాటకతో మాట్లాడి నదికి నీటిని విడుదల చేయించాలని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినప్పటికీ స్పందించలేదు. మా నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి పరిహారం చెల్లించాలి. కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణ, బీమా సంగమం వద్ద తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. బ్రిడ్జి నిర్మాణం చేస్తే భీమా పరివాహక రైతులకు భవిష్యత్తులో సాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు.
భీమా నది పూర్తిగా వట్టిపోవడంతో లిఫ్ట్ కు నీరందక మోటార్లు పనిచేయడం లేదని కుసుమూర్తికి చెందిన గంగప్ప అన్నారు. దాదాపు పది రోజుల నుండి లిఫ్ట్ బంద్ కావడంతో వరి పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. పంట చేతికి రావాలంటే ఇంకా నెల రోజులు పడుతుంది. ఎగువ నుండి నీటిని విడుదల చేయిస్తే తప్ప ఏమి చేయలేని పరిస్థితి ఉంది. రైతులకు పంట కిస్తు కట్టడం భారమే అవుతుంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే పంటను పశువులకు మేతగా వదులుకుంటా అని చెప్పారు.