సాగులో నిన్నమొన్నటి వరకు దేశంతోనే పోటీపడిన తెలంగాణ నేడుబేల చూపులు చూస్తున్నది. రైతాంగాన్ని నిలువునా ముంచిన కాంగ్రెస్ సర్కార్ అన్నదాతను ఆగం చేసి వదిలింది. కేసీఆర్ సంక్షేమ పథకాలకు పాతరేసిన రేవంత్ ప్రభుత్వం రైతును నిండా ముంచింది. గత 11 నెలల్లో ఏకంగా 347 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారంటే రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ హయాంలో పసిడి పంటలు పండిన తెలంగాణలో నేడు భూములు పడావు పడుతున్నయి. పదేండ్ల క్రితం నాటి పరిస్థితులు మళ్లీ తాండవిస్తున్నయి.
Congress | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఏడాది క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం రైతులకు స్వర్గధామం. ఎరువులు, విత్తనాలు దొరుకతయో లేదో అనే టెన్షన్ లేదు. పంట పెట్టుబడికి పైసలెట్లా అనే ఆందోళన లేదు. పండించిన పంట అమ్ముడుపోతదో లేదో అనే చింతలేదు. అన్నీ కేసీఆర్ ప్రభుత్వమే చూసుకుంటుందనే భరోసా రైతుల్లో ఉండేది. ఇలా రైతుల నమ్మకాన్ని నిలబెడుతూ కేసీఆర్ సర్కారు సాగులో సాయం చేస్తూ మద్దతు ధరకు పంటను కొనుగోలు చేసేది. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పసిడి పంటలు పండించారు. దేశ వ్యవసాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో అన్నదాతలపై పిడుగు పడింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన రైతులను ఆగం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్లు మళ్లీ రైతుల జీవితాలను వెంటాడుతున్నాయి. రైతుబంధు ఎగ్గొట్టారు, ఎరువులు, విత్తనాల కోసం మళ్లీ క్యూ లైన్లు, పోలీస్ పహారాలు దర్శనమిస్తున్నాయి. పండించిన పంటను ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ సర్కారులో ఆర్థిక భరోసాతో సగర్వంగా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో మళ్లీ కన్నీళ్లు, కడగండ్లు, ఆందోళనలు, ఆత్మహత్యలు తప్పడం లేదు.
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆరేండ్ల పాటు రైతుబంధు పథకాన్ని నిర్విఘ్నంగా ఇచ్చింది. 65లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. కానీ రైతుభరోసా పేరుతో ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన కాంగ్రెస్ ఉన్న రైతుబంధును కూడా అటకెక్కించింది. రైతులు పెట్టుబడి కోసం మళ్లీ వడ్డీ వ్యాపారుల ముందు మోకరిల్లాల్సిన దుస్థితి కల్పించింది. రైతుబంధు కింద కేసీఆర్ సర్కారు పదకొండు పంటలకు అన్నదాతల ఖాతాల్లో రూ.72,808 కోట్లు జమ చేసింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిరుడు డిసెంబర్లో యాసంగి పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ పోరాటంతో పంట కోతల సమయంలో ఆగస్టులో పంపిణీ చేసింది. ఈ ఏడాది వానకాలం రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టింది.
అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కింది. 70లక్షల మంది రైతులకు రూ.50వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉన్నప్పటికీ షరతులు, కోతలు పెట్టి రైతుల సంఖ్యను 42లక్షల మందికి, మాఫీ మొత్తాన్ని రూ.31వేల కోట్లకు తగ్గించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలయాపన చేసి, నాలుగు విడతల్లో 25.35 లక్షల మంది రైతులకు రూ. 20,616 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఇంకా 16.65లక్షల మంది రైతులకు చేయాల్సిన రూ.10,384 కోట్ల రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టతలేదు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేసింది. రెండు విడతల్లో కలిపి 58.29 లక్షల మంది రైతులకు రూ. 29,144 కోట్ల రుణాలు మాఫీ చేసింది. కాంగ్రెస్ పాలనలో మళ్లీ క్యూలైన్లు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్న దుస్థితిని చూశాం. కానీ పదేండ్ల కేసీఆర్ పాలనలో ఈ అవస్థలు లేవు. కేసీఆర్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో సీజన్‌కు ముందే రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మళ్లీ ఎరువులు, విత్తనాల కోసం క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో లేదో మళ్లీ కరెంట్ కోతలు మొదలయ్యాయి. నిరుడు యాసంగిలో ఎడాపెడ కరెంట్ కోతలతో వ్యవసాయం ఆగమైంది. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయాయి. మళ్లీ రాత్రిపూట కరెంట్‌తో పలువురు రైతులు షాక్‌తో చనిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడంతో యాసంగిలో పంటలు ఎండిపోయాయి. ఉమ్మడి నల్లగొండలొ రైతులు అనధికార క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది.
రైతులు పండించిన ప్రతీ పంటను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర అందించేది. వడ్లు, మక్కలు, జొన్నలు, పత్తి ఇలా ఏ పంటైనా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 7.37 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కానీ కాంగ్రెస్ పాలనలో రైతులు పంటలను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు పెడుతుండడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ప్రభుత్వంపై ఆశలు సన్నగిల్లి నష్టాలకు దళారులకు అమ్ముకుంటున్నారు. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ 20 లక్షల టన్నులు కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది.
ఉమ్మడి ఏపీలో వ్యవసాయం కుదేలవడంతో రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడారు. అప్పుల ఊబిలో నుంచి బయటపడే దారిలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ-ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2014లో 1347 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న రైతు సంక్షేమ చర్యలతో 2023 నాటికి ఆత్మహత్యల సంఖ్య 121కి తగ్గింది. ఈ విధంగా రైతుల ఆత్మహత్యలు 11శాతం నుంచి 1.57శాతానికి తగ్గాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ప్రధాన పత్రికల్లో వచ్చిన వివరాల ప్రకారం గడచిన 11 నెలల్లో 347 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రతిపక్ష బీఆర్ఎస్, రైతుల సంఘాలు చెప్తున్నాయి.