కొత్తగూడ, జూలై 5: వానకాలం సీజన్ ప్రా రంభం కావడంతో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అరకొరగా యూరియా సరఫరా చేస్తుండగా, రైతులకు సరిపోవడం లేదు. దీంతో సొసైటీలకు యూరియా వచ్చిందన్న వార్త తెలియగానే రైతులు ఒక్కసారిగా ఎగబడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీకి యూరియా బస్తాలు రావడంతో శనివారం రైతులు పెద్దఎత్తున చేరుకున్నారు. కొందరు క్యూలైన్లో నిలబడలేక చెప్పులు వరుస క్రమంలో పెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విరివిరిగా లభించిన యూరియా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సరిపడా రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏఐతో పంటల తెగుళ్ల గుర్తింపు ; మంత్రి తుమ్మల వద్ద ప్రదర్శన
హైదరాబాద్, జూలై 5(నమస్తే తెలంగాణ): ఏఐ సాంకేతికతతో వివిధ పంటలకు సోకే తెగుళ్లను గుర్తించే విధానాన్ని కృషివాస్ సంస్థ అభివృద్ధి చేసింది. మొబైల్ యాప్ ద్వారా రైతులు దీనిని వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. యాప్ వినియోగం, ఉపయోగాలపై శనివారం సంస్థ ప్రతినిధులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వివరించారు. వివిధ దశల్లో పంటలకు సోకే చీడపీడలను ముందుగానే గుర్తించవచ్చని సంస్థ ప్రతినిధులు వివరించారు. మొక్కలో కనిపించకుండా ఉన్న తెగుళ్లను కూడా ముందస్తుగానే గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా వరి, పత్తి, మిరప సహా 60కి పైగా పంటలను పరీక్షించే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇలాంటి యాప్ల వినియోగంతో రైతుల విలువైన సమయం ఆదా అవడంతోపాటు, రైతులు తమ పంటలకు కచ్చితమైన నివారణ చర్యలు తీసుకునే వీలు కలుగుతుందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.