హైదరాబాద్, జులై 31(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యూరియా సంక్షోభం ముంచుకొస్తున్నది. ఆగస్టులో అదుపు చేయలేని స్థితిలో ఆ సంక్షోభం నెలకొననున్నది. ఆ ఒక్క నెలలోనే సుమారు 4 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నట్టుగా అధికారులే అంచనా వేస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన ఇటు రా ష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల కష్టాలతో రాజకీయం చేస్తున్నాయి. యూరియా కొరతకు కారణాలు చూపుతూ ఒకరిపై ఒక రు ఆరోపణలు చేసుకుంటూ ఇరు ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. ఫలితంగా యూరియా కొరతతో ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ నెలలో యూరియా కష్టాలు రెట్టింపు కానున్నాయి. సాధారణంగానే ఆగస్టు నెలలో యూరియా అవసరం భారీగా ఉంటుంది.
వరితోపాటు మక్క, పత్తి పంటలకు రెండో దశ ఎరువులు వేస్తారు. కానీ అందుకు తగ్గట్టుగా సరఫరా చేయడం కష్టమేననే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు వాస్తవ సరఫరా ప్రణాళికతో పోల్చితే 2.15 లక్షల టన్నుల యూరియా తక్కువగా సరఫరా అయింది. 6.6 లక్షల టన్నులు సరఫరా కావాల్సి ఉండగా 4.45 లక్షల టన్నులే సరఫరా అయింది. ఈ నేపథ్యంలో ఆగస్టు ప్రణాళికలో కోతతోపాటు ఇప్పటికే ఉన్న కొరతతో మొత్తంగా 3.95 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడనున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆగస్టు ప్రణాళిక 1.7 లక్షల టన్నుల్లో కేంద్రం కోత పెడితే కొరత మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
రాష్ర్టానికి ప్రస్తుతం ప్రతినెలా వాస్తవ సరఫరా ప్రణాళిక కన్నా 60-70 వేల టన్నుల యూరియా తక్కువగా సరఫరా అవుతున్నది. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత తారాస్థాయికి చేరింది. అలాంటిది ఆగస్టులో ఏకంగా 4 లక్షల టన్నులకు పైగా యూరియా కొరత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిరుడు వానకాలంలో ఆగస్టు నెలలో 3.28 లక్షల టన్నుల విక్రయం జరిగింది. ఈ లెక్కన ఈ ఏడాది కూడా సుమారుగా 3 నుంచి 3.5 లక్షల టన్నుల యూ రియా అవసరం అవుతుంది. కానీ వ్యవసా య శాఖ మాత్రం ఆగస్టు నెలకు 1.7 లక్షల టన్నుల యూరియా సరఫరాకు మాత్రమే ప్రణాళిక రూపొందించింది. అంటే వాస్తవ అవసరాని కన్నా 1.8 లక్షల టన్నులు తక్కువగా ప్రణాళిక రూపొందించడం గమనార్హం.
సాధారణ అవసరాలు ఉన్న సమయంలో నే యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆగస్టులో పంటలకు యూరియా అవసరం భారీగా పెరగనున్నది. వరి, మక్క, పత్తి పంటలకు రైతులు రెండో దశ యూరియా వేయనున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో పంటల సాగు కూడా జోరందుకున్నది. ప్రస్తుతం 90 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో 26 లక్షల ఎకరాల్లో వరి, 44 లక్షల ఎకరాల్లో పత్తి, 5.5 లక్షల ఎకరాల్లో మక్క, 4.5 లక్షల ఎకరాల్లో కంది పంటలు సాగయ్యాయి.
నిరుడు ఇప్పటి వరకు 73 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయింది. అంటే గతంతో పోల్చితే 17 లక్షల ఎకరాల్లో పంటల సాగు పెరిగింది. దీంతో యూరియా అవసరం కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో యూరియా కొరత కారణంగా రైతుల ఇబ్బందులు రెట్టింపు అవుతాయని భావిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వాలు యూరియా కొరత సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.