హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో రాత్రనక పగలనకా గోస పడుతున్నా.. అధికారులు కనికరిస్తలేరని అన్నదాతలు ఆవేదన చెందుతున్నరు. రేవంత్ సర్కార్ వచ్చినంక తమ గురించి పట్టించుకునేటోడే కనిపిస్తలేడని వాపోతున్నరు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అష్టకష్టాలు పడి కొనుగోలు కేంద్రాలకు తెస్తే రోజుల తరబడి కొనడం లేదని ఆక్రోశం వెళ్లగక్కుతున్నరు. తెచ్చిన ధాన్యం అకాల వర్షాలకు ఎక్కడ తడుస్తుందోనని ఆందోళన చెందుతున్నరు. తాలు, తడిసిన ఇలా రకరకాల పేరిట కొర్రీలు పెడుతూ నిలుపు దోపిడీ చేస్తుండ్రు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. అసలు రాష్ట్రంలో గవర్నమెంట్ నడుస్తున్నదా? అని ప్రశ్నిస్తున్నరు. గతంలో కేసీఆర్ గవర్నమెంటే సక్కగున్నదని పాత రోజులని యాదికి తెచ్చుకుంటున్నరు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలనూ ఏర్పాటు చేయాలన్న సోయి అధికారులకు లేకుండాపోయిందని మండిపడుతున్నరు.
రేవంత్‌రెడ్డి ఉన్నట్టా? లేనట్టా?
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 50 రోజులైంది. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకు అధ్వానమైంది. అసలు సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టా? లేనట్టా? రైతుల పరిస్థితి ఏందో కూడా ఆయనకు తెల్వదు. కొనుగోలు కేంద్రాల్లో పొద్దుమాపు రైతులు అరిగోస పడుతున్నరు. కొనుగోలు కేంద్రంలో యంత్రాల కోసం లొల్లులు, సీరియల్ నంబర్, వంతుల పేరిట నానా ఇబ్బందులు పడుతున్నాం. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల సంగతి దేవుడెరుగు. కనీసం తాగడానికి నీళ్లు లేవు. కొనుగోలు కేంద్రం నిర్వహణకు సరిగ్గా లేదు. కేంద్రం నిర్వాహకులు రావడం, చూడటం, పోవడం తప్ప చేసిందేమీ లేదు. ఏమన్నా అంటే మా చేతుల ఏం ఉంది? మేము చేయాలె? అంతా లీడర్లు, అధికారులకే ఎరుక అనే సమాధానం చెప్తున్నారు.
-ఇట్టబోయిన అరుణ్, యువ రైతు, అక్కన్నపేట సిద్దిపేట జిల్లా
నిత్యం వడ్ల కాడనే కాపలా..
వడ్ల కొనుగోళ్లు వెంటనే చేపట్టాలి. ప్రస్తుతం వర్షం ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. రోడ్డుపైన వడ్లను ఆరబెట్టేందుకు ఉదయం రోడ్డుపై నేర్పుకోవాలి, సాయంత్రం టార్పాలిన్ కప్పి కాపలాకాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం వస్తే భయమేస్తున్నది. కేసీఆర్ కాలంలో వడ్ల కోతలు ఏర్పడిన వెంటనే కొనుగోలు కేంద్రాల్లో తూకం చేపట్టేవారు. ఇప్పుడు గన్నీ బ్యాగులు లేవు, తూకం లేదు, తరలించేందుకు లారీలు లేవు. గన్నీ బ్యాగుల కోసం క్యూలో వేచి ఉండాల్సి వస్తుంది. వర్షాలకు తడుస్తున్న వడ్లు మొలకెత్తుతుంది. కొనేటప్పుడు ఏం పరిస్థితి ఉంటుందోననే భయం పట్టుకున్నది. తడిసిన వడ్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.
– జగతి అశోక్, రైతు, బాలంపేట, దౌల్తాబాద్, వికారాబాద్ జిల్లా
ఎప్పుడు కొంటరోనని ఎదురుచూపులే..
నాకున్న ఎకరం పొలంలో దొడ్డురకం వరి వేసిన. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అమ్ముకునేందుకు కేంద్రానికి తీసుకొచ్చిన. ఇక్కడ సకాలంలో కొంటలేరు. నా ధాన్యాన్ని 20 రోజులపాటు కొనుగోలు కేంద్రంలోనే ఉంచి ఆరబెట్టిన. ఎండావానల నుంచి కాపాడుకునేందుకు అన్ని రోజులపాటు అక్కడే కాపలా ఉన్నా. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్పుడు దయతలిచి కొన్నారు. ఇన్ని రోజులూ ఎండంతా మా మీద నుంచే వెళ్లింది. ఇలాంటి కష్టాల వల్ల సన్నకారు రైతుల నడ్డి విరిగినట్లవుతున్నది. ఎప్పుడు కొనుగోలు చేస్తారోనన్న ఎదురుచూపులకే రోజులు గడిచిపోతున్నాయి. ఎప్పుడు వానొస్తదో తెలియక భయమేస్తున్నది. తడిస్తే మళ్లీ ఆరబోసుకోవాల్సిందే కదా. లారీలు రావడం లేదని తోలకం పెట్టలేదు.
– బీరకాయల వెంకటేశ్వర్లు, రైతు, దామరచర్ల, చండ్రుగొండ, భద్రాద్రి జిల్లా
ధర్నా చేస్తే కానీ కాంటా వేయరేమో?
కోనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 20 రోజులు దాటిపాయే. ఇప్పటిదాకా కాంటా వేసిందే లేదు. సంచులు, లారీలు సరిగా వస్తలేవు. ఇప్పటిదాకా 12 లారీలే వచ్చియన్. ఇంకా కాంటా వేయాల్సిన వడ్లు మస్తు ఉన్నయ్. అధికారులకు, సర్కార్‌కు మా బాధ తెలుస్తలేదు. కడుపు మండిన రైతులు రోడ్లెక్కుతున్నరు. మొన్న మాల్తుమ్మెదల ధర్నా చేస్తే కాంటా చాలుజేసిండ్రు. మేము కూడా ఆందోళన చేస్తే గానీ మా వడ్లు తూకం వేయరేమో. ప్రభుత్వం స్పందించాలి. వెంటవెంటనే వడ్లు కొని తరలించాలి. – కృష్ణ, రైతు, గోలిలింగాల్, మం:నాగిరెడ్డిపేట్, కామారెడ్డి జిల్లా
లారీ వచ్చి వారమైనా అన్లోడ్ చేస్తేలే…
లారీలు ఖాళీగా దొరికితే ఆర్డీవో పట్టుకొని ధాన్యం లోడ్ చేసుకెళ్లాలని చెప్తున్నరు. మా లారీ ఓనర్స్ అసోసియేషన్ తప్పనిసరిగా ఒక ట్రిప్ కొట్టాలని చెప్తున్నరు. అలా ఒక లోడ్ కోసం వస్తే, రెండో లోడ్‌కు పొమ్మని ఒత్తిడి తెస్తున్నరు. ధాన్యం లోడ్‌తో వచ్చిన లారీ వారమవుతున్నా ఇంకా అన్లోడ్ కాలేదు. అంత బరువుతో ఏడెనిమిది రోజులుంటే లారీల టైర్లు పగులుతున్నాయి. దానికి ఎవరు బాధ్యులు? ధాన్యం తీసుకొస్తే వచ్చే కిరాయి ఆరు నుంచి ఏడు వేలు. ఈ కిరాయికి వారం రోజులు ఎండలో ఇబ్బందులు పడుతున్నం. కూడు లేదు, తాగేందుకు మంచినీరు దొరక్క బోరు నీళ్లు తాగుతున్నం. తక్షణం ప్రభుత్వం స్పందించి ఒకటి, రెండు రోజుల్లో అన్లోడ్ చేయించేలా చర్యలు తీసుకోవాలి. మంచిర్యాల జిల్లా ఇందారంలోని ఈ రైస్ మిల్లులకు 128 లారీలు వచ్చి లైన్లో ఉండి వారం రోజులైతే ఇప్పటికీ 30 లారీల ధాన్యమే దించుకున్నరు. రోజుకు 20 బండ్లు కూడా అన్లోడ్ కావడం లేదు. హమాలీలు లేరని చెప్తున్నరు. మా లారీ డ్రైవర్లను గోస పెడుతున్నరు. – ఎండీ షఫీయుద్దీన్, లారీ డ్రైవర్, మంచిర్యాల జిల్లా
రాత్రీ పగలు కుప్పల వద్ద కాపలా
నేను ఆరు ఎకరాల్లో జొన్న సాగు చేసిన. 46 క్వింటాళ్లు ఆదిలాబాద్ మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చిన. గురువారం కాంటా చేసినా లారీల్లో లోడ్ చేసేంత వరకు పంట అమ్మకానికి సంబంధించిన పట్టీలు ఇస్తలేరు. తొమ్మిది రోజులుగా మార్కెట్ యార్డుల్లో రాత్రీపగలు నాతోపాటు వందలాది మంది రైతులు కాపలాగా ఉంటున్నరు. లారీలు, హమాలీల కొరత కారణంగా రవాణాలో జాప్యం జరుగుతున్నది. కేసీఆర్ పాలనలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధరతో పంటలను అమ్ముకున్నరు. ఇంటికి వచ్చి కాంటాలు పెట్టి కొనుగోలు చేసిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకున్నరు. కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రజాప్రతినిధులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు.
-ఇటిక్యాల భూమన్న, రైతు, అంకోలి, ఆదిలాబాద్ రూరల్ మండలం
గన్నీలు లేవు.. లారీలు రావు
వరి ధాన్యం అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. వర్షం పడితే ధాన్యం తడిసిపోతుంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయకపోవడంతో ఎండలో ఆరబోస్తున్నం. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకం వేసిన గన్నీ బస్తాలు ఉండటం లేదు. లారీలు సకాలంలో రావడం లేదు. దీంతో ధాన్యం మిల్లులకు తరలించే వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. లారీల సమస్య తీవ్రంగా ఉన్నదని, అదనంగా డబ్బులు ఇవ్వాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు.
– నిమ్మగళ్ల దుర్గమ్మ, కుల్చారం, మహిళా రైతు, మెదక్ జిల్లా