హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): వర్షాలు కురుస్తున్నాయని రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం… అంతలోనే ఆవిరైపోయిం ది. నాట్లు వేసుకున్న రైతులు పాట్లు పడాల్సి వస్తున్నది. ప్రభుత్వం సరిపడా ఎరువులు సరఫరా చేయకపోవడంతో రైతాంగమంతా రందిపెట్టుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ ఎరువుల విక్రయం 12వేల టన్నుల నుంచి 2357 టన్నుల స్థాయికి పడిపోయిన దుస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాదరణతో సాగు ముందుకు సాగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి.. ఎరువుల కోసం రోజుల తరబడి దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా రెండు, మూడు బస్తాలు మాత్రమే ఇస్తుండటంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ బస్తాలకు కూడా పోలీస్ పహారాలో పంపిణీ కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల యూరియా ఎక్కడంటూ రైతన్నలు ఆందోళనల బాట పడుతున్నారు. పనులు మాని పొద్దున్నే పంపిణీ కేంద్రాలకు చేరుకున్నా ఫలితం ఉండటం లేదంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమ గోడు వినేవారే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడ: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్
ఏం జరిగింది: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగపూర్ సహకార సంఘం గోదాం వద్దకు సోమవారం వందలాది మంది రైతులు చేరుకున్నారు కొంత మందికి మాత్రమే యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు దిగారు. ఇంతలో ఓ పోలీస్.. తమాషాలు చేస్తున్నారా..? అంటూ రైతుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అన్నదాతలంతా మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కారు తమను గోస పెడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కడ: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి సహకార సంఘం
ఏం జరిగింది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిథ్యం వహిస్తున్న వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు ఉదయాన్నే బారులు తీరారు. గంటల తరబడి క్యూలో నిలబడలేక పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. ఇక యూరియా బస్తాల పంపిణీ ఆలస్యమవడంతో ఇలా చెప్పులు వరుసలో పెట్టారు.
ఎక్కడ: రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్
ఏం జరిగింది: రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో యూరియా కోసం పొద్దున్నే రైతులు తరలివచ్చారు. యూరియా బస్తాల పంపిణీ మొదలుపెట్టే వరకూ పడిగాపులు కాశారు. అయినా అందరికీ అందకపోవడంతో ప్రభుత్వంపై మండిపడుతూ నిరాశతో వెనుదిరిగారు.
ఎక్కడ: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ప్యాక్స్ కేంద్రం
ఏం జరిగింది: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండల కేంద్రంలోని సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం ఆరు గంటల నుంచే బారులు తీరారు. స్టాక్ వచ్చిందన్న సమాచారంతో వివిధ గ్రామాల నుంచి వందలాది మంది రైతులు చేరుకున్నారు. సరైన ఏర్పాట్లు లేకపోవడం, బస్తాలు తక్కువ వచ్చాయని తెలుసుకున్న రైతుల్లో ఆగ్రహం వెల్లువెత్తడంతో పోలీసుల పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు. అది కూడా అడిగిన మేరకు ఇవ్వకుండా ఎకరాకు బస్తా చొప్పున పంపిణీ చేశారు.
ఎక్కడ: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం
ఏం జరిగింది: దహెగాం మండలకేంద్రంలోని సహకార సంఘ కార్యాలయానికి రెండు లారీల లోడు(800 బస్తాలు) రాగా, పలు గ్రామాల నుంచి రైతులు తరలివచ్చారు. ఉదయాన్నే చేరుకొని వర్షంలో తడుస్తూ టోకెన్ల కోసం క్యూలైన్లో నిల్చున్నారు. ఆఖరికి తలా రెండు, మూడు బస్తాలు అందించి అధికారులు ముగించేశారు.
ఎక్కడ: కరీంనగర్ జిల్లా గన్నేరువరం
ఏం జరిగింది: కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో యూరియా కోసం రైతులు బారులుదీరారు. బస్తాలు తక్కువగా, రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో పంపిణీ నెమ్మదిగా సాగింది. దీంతో రైతులు అసౌకర్యానికి గురయ్యారు.
ఎక్కడ: వనపర్తి జిల్లా ఆత్మకూరు పీఏసీఎస్ కార్యాలయం
ఏం జరిగింది: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ, మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రాల్లోని సింగిల్విండో కార్యాలయాల వద్ద ఎరువుల కోసం రైతులు సోమవారం ఎగబడ్డారు. తక్కువ మొత్తంలో యూరియా బస్తాలు రావడం.. పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో పోలీసు పహారా మధ్య పంపిణీ చేశారు.
ఎక్కడ: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్
ఏం జరిగింది: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో యూరియా కొరత కారణంగా సోమవారం తొర్రూరు-నర్సంపేట ప్రధాన రహదారిపై పీఏసీఎస్ కో-ఆపరేటివ్ ఎరువుల దుకాణం ఎదుట అన్నదాతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసుల పహారాలో యూరియా బస్తాలు పంపిణీ చేశారు.
ఎక్కడ: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం
ఏం జరిగింది: పెద్దపల్లి జిల్లాలోని కూనారం సహకార సంఘం కార్యాలయానికి యూరియా కోసం పెద్దసంఖ్యతో రైతులు తరలివచ్చారు. పొద్దున్నే వచ్చి లైన్లో నిల్చున్నా రెండు బస్తాలకు మించి రైతులకు అందలేదు. మరికొందరికి ఒక్క బస్తా కూడా అందలేదు. దీంతో సిబ్బందిపై మండిపడుతూ తిరిగివెళ్లారు. పొద్దంతా క్యూలైన్లో నిల్చున్నా తమకు యూరియా అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.