Congress | నవాబ్‌పేట, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): వారు దశాబ్దాల క్రితమే ఆ భూమిని కొన్నారు. పట్టాలు పొంది కాస్తులో ఉన్నారు. ఇప్పుడా పొలాలపై కొందరి కండ్లు పడ్డాయి. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కొందరు అధికార పార్టీ నాయకులు, అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం చౌడూరుకు చెందిన రైతులు బిజ్జలి చంద్రయ్య, శివయ్య, కృష్ణయ్య, బాలరాజు కన్నీటి పర్యంతమవుతున్నారు.
వారి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సుంకరి శేఖరయ్య పేరిట సర్వే నంబర్ 340, 341లలో ఉన్న భూమిని అదే గ్రామానికి చెందిన బిజ్జలి నారాయణ, భామిని పెంటయ్య 1977లో చెరో ఆరెకరాలు కొనుగోలు చేశారు. సర్వే నంబర్ 340లోని ఆరెకరాలను అగ్రిమెంట్ చేసుకుని సాదాబైనమా పత్రాలతో కాస్తులో ఉండగా, సర్వే నంబర్ 341లోని ఆరెకరాలకు అప్పట్లోనే పట్టా పొందారు. అప్పటి నుంచి వారిద్దరూ కాస్తులో ఉంటూ సాగు చేసుకుంటున్నారు. నారాయణ, పెంటయ్య మరణానంతరం వారి వారసులు సాగుచేసుకుంటున్నారు.
అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఈ భూమిపై కన్నేసి అధికారులతో కలిసి తమను వేధిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. బిజ్జలి నారాయణ, పెంటయ్య దాయాదులైన కొందరు భూమిని అగ్రిమెంట్ చేసుకున్నట్టు పత్రాలు సృష్టించి తమను వేధిస్తున్నారని తెలిపారు. సర్వే నంబర్ 341లోని భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని సర్వే నంబర్ 340లో కాస్తులో ఉన్నారని, వెంటనే ఆ భూమిని వదిలిపెట్టి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని వివరించారు. శుక్రవారం కాంగ్రెస్ ముఖ్యనేత బంధువులు వచ్చి భూమిలో బలవంతంగా కడీలు పాతేందుకు ప్రయత్నించగా నారాయణ, పెంటయ్య వారసులైన చంద్రయ్య, శివయ్య, కృష్ణయ్య, బాలరాజు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ దశాబ్దాలుగా తాము కాస్తులో ఉన్నామని, గ్రామానికి చెందిన నాయకులు గోపాల్, అమరేశ్ ఇటీవల తమ భూమిని ఇతరులకు అగ్రిమెంట్ చేయించి వేధిస్తున్నారని తెలిపారు. దీనివెనక బడా నాయకుల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. తమ భూములను లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు.