ఎల్లారెడ్డిపేట, మే 24: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అధ్వానంగా మారింది. నిర్వాహకులదే రాజ్యం అవుతున్నది. ఓ వైపు అధికారుల నిర్లక్ష్యంతో మందకొడిగా సాగుతుండగా, మరోవైపు సీరియల్ నంబర్ కాదని కాంటా వేస్తుండటంతో రైతులు మండిపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాలోని కేంద్రానికి పలువురు రైతులు వడ్లు తెచ్చి నెల రోజులపైనే అయింది. తేమ శాతం వచ్చింది.
ఇన్ని రోజులు ఏవేవో కారణాలు చెప్పి కాంటా వేయని సిబ్బంది, ఆదివారం సీరియల్ నంబర్‌ను విస్మరించి తెలిసినోళ్లు, పలుకుబడి ఉన్నోళ్లు అని తూకం వేశారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ సీరియల్ నంబర్ ఎంతో చూసుకుంటామని అడిగినా బుక్ చూపించడం లేదని, రైతులు అసహనం వ్యక్తం చేశారు.
దేవునిగుట్ట తండాలో నాకు మూడెకరాలు ఉన్నది. 200 బస్తాలు పండినయ్. నెల పదిరోజుల కింద కేంద్రానికి వడ్లు తెచ్చిన. తేమ శాతం మూడు రోజులకే వచ్చింది. నా బిడ్డ పెండ్లి ఉన్నదని సేతుల ఖర్చులకు పైసలెవ్వు, ఎట్లనన్న నావడ్లు జోకుమని బతిమిలాడినా. మా సర్పంచ్ భర్తతోటి అడిగిపిచ్చినా జోకలేదు. పెండ్లి గూడ అయిపోయింది. బాగ ఖర్చులపడి ఉన్న. నా నంబర్ ఇడిసిపెట్టి నా వెనకచ్చినోల్ల నంబర్ వడ్లు జోకుతున్నరు. బుక్ గూడా సూపించుమంటె చూపిస్తలేరు. వాళ్లు చెప్పిందే నంబర్ అయితుంది.
– బానోత్ శ్రీరామ్, రైతు, దేవునిగుట్ట తండా, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల
దేవునిగుట్ట తండాలో నాలుగున్నర ఎకరాల పొలం ఉన్నది. నేను పొయిన్నెల 17న వరికోపిచ్చిన. అదే రోజు సెంటర్‌కు తెచ్చిన. నాది సీరియల్ నెంబర్ 15 అని సెంటరోల్లు చెప్పిర్రు. కానీ నా వెనుక వచ్చిన వాళ్ల్ల వడ్లు జోకుతున్నరు. ఇప్పుడు 18 నంబర్ వడ్లు తూకం పెట్టిన్రు. మల్ల మధ్యల నంబర్లు ఇడిసిపెట్టి 23వ నంబర్ జోకుతున్నరు. ఇష్టం వచ్చినట్టు తూకం వేస్తున్నరు. అడిగితే ఎవరికి చెప్పుకొంటవో చెప్పుకో అంటున్నరు. వడ్ల పైసలు వస్తయేమోనని ఇల్లు మొదలు పెట్టిన. వడ్లు జోకుడే అయితలేదు ఇంక ఇల్లు పనులు ఎట్లా చేసేది.
– గుగులోత్ నరేశ్, రైతు, దేవునిగుట్ట తండా, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల