కొడంగల్, జూన్ 25: మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం సంబంధించిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం సరైన నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే ఉపాధి కోసం నగరబాట పట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరాకు రూ.50 నుంచి రూ.80 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని ప్యాలమద్ది, పెద్దనందిగామ గ్రామాల్లో రెవె న్యూ, ఇరిగేషన్ అధికారులు గ్రామ సభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం సరైన పరిహారం చెల్లించడం లేదని వాపోయారు. ఇక్కడ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెలిస్తే.. వేరేచోట భూములు కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటామని, లేకుంటే కూలీ కోసం నగరబాట పట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు.