జగిత్యాల, మే 31(నమస్తే తెలంగాణ) : రైతులకు ఉచిత విద్యుత్తు ఎత్తివేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘రైతు డిస్కం’ ప్రతిపాదన తెచ్చాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి మాటలు, చేతలకు ఏమాత్రం పొంతన లేదని పేర్కొన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టమని, అలా పెడితే ఓట్లు అడగమని ప్రకటించిన రేవంత్‌రెడ్డి, ఒక్క విషయానికి సూటిగా సమాధానం చెప్పాలని, అది వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టడం లేదని చెప్పాలని, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడితే ఓట్లు అడగమని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.. ఈఆర్సీ సమావేశంలో ‘బోరు బావులకు 3 గంటల కరెంటు చాలు’ అని మాట్లాడటం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో బషీర్‌బాగ్ కాల్పులకు కారణమైన చంద్రబాబు నేతృత్వంలోనే రేవంత్‌రెడ్డి రైతులపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే ఓట్లు అడుగనని రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారం ఆశ్చర్యంగా ఉందని, రేవంత్‌రెడ్డికి ఎలాగూ ఓటు అడిగే అవకాశాన్ని ప్రజలు ఇవ్వరని తెలిపారు.
ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు ఎందుకు? ట్రాన్స్ఫార్మర్ రీడింగ్ తీస్తే ఎలా? అని రైతులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే దొంగ కనెక్షన్లు తొలగించేందుకు అంటూ విద్యుత్తు శాఖ సీఎండీ ముషారఫ్ పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్.. కాళేశ్వరం, రివర్స్ పంపింగ్, 24 గంటల విద్యుత్తు సరఫరా, రైతుబీమా, రైతుబంధు వంటి కార్యక్రమాలతో రైతుల్లో ఆత్మైస్థెర్యం నింపితే, రేవంత్‌రెడ్డి తప్పుడు హామీలు, కుట్రలతో రైతులను నిండా ముంచుతున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డికి రైతు సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టమని, రైతు డిస్కమ్ ఏర్పాటుచేయమని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలులో సర్కార్ ఫెయిల్ : కొప్పుల
ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. లారీలు రావు, గన్నీ సంచులు లేవు, కొనుగోలు చేసిన ధాన్యం ఎకడ నిల్వ చేయాలో తెలియని దుస్థితి నెలకొన్నదని ధ్వజమెత్తారు. అదనపు తూకంతో రైతు క్వింటాల్‌కు రూ.23.89 నష్టపోతున్నాడని, ఈ లెక్కన జగిత్యాల జిల్లాలోనే రూ.83 కోట్లు పక్కదారి పట్టాయని పేర్కొన్నారు. హమాలీ చార్జీలు, ధాన్యం తరలింపు ఖర్చులు ఇతరత్రా కలిపి జిల్లాలో రూ.22 కోట్లు, మొత్తంగా ధాన్యం కొనుగోలులో రూ.110 కోట్ల కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు.
జగిత్యాలలో ఇసుక మాఫియా విజృంభిస్తుంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు కండ్లు మూసుకున్నారా? అని ప్రశ్నించారు. సమావేశంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్రావు, కల్లెపల్లి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.