(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ, జూలై 25 : నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనోద్యమంతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. త్వరలో మరికొంతమంది మంత్రులు కూడా క్యాబినెట్ బెర్త్‌లు కోల్పోనున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. వచ్చే నెల 13న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఆ వెంటనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ సన్నిహితుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఉప ప్రధానిగా పదోన్నతి లభించే అవకాశం ఉన్నదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. మంత్రివర్గంలో నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పురీ, పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రా తదితరులు బెర్త్‌లు కోల్పోవచ్చని సమాచారం.
ఆ రెండింటి ఆధారంగా..
ప్రధానంగా రెండు కారణాల వల్ల క్యాబినెట్లో మార్పులు జరుగొచ్చని తెలుస్తున్నది. మొదటిది.. క్యాబినెట్లోకి యువ రక్తాన్ని తీసుకురావడంతో పాటు మంత్రుల సగటు వయసును బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ వయసు అయిన 46 ఏండ్లకు దగ్గరగా తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న యూపీ, పంజాబ్ రాష్ర్టాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం రెండో కారణంగా తెలుస్తున్నది. ఇటీవల మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జి కురియన్, రైల్వే సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్ పదవీ కాలం ముగిసినప్పటికీ, వారిని రాజ్యసభకు రీ నామినేట్ చేయలేదు. ఇదే తరహాలో త్వరలోనే పలువురు నేతలను సాగనంపుతారని పార్టీలో ప్రచారం జరుగుతున్నది.
30 మంది మంత్రులపై ప్రభావం
క్యాబినెట్, స్వతంత్ర, సహాయ హోదాతో కలిపి ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్లో 72 మంది ఉన్నారు. ఇందులో 8 నుంచి 10 మంది మంత్రులకు ఉద్వాసన, 5 నుంచి ఏడుగురు సహాయ మంత్రులకు క్యాబినెట్ హోదా లేదా కీలక శాఖలతో పదోన్నతి ఉండొచ్చని తెలుస్తోంది. 10 నుంచి 15 మంది కొత్తవారికి అవకాశం, మరో 10 నుంచి 15 మంది మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతున్నది.
మంత్రి పురిపై వేటు
పెట్రోలియం, సహజ వాయువు శాఖల మంత్రి హర్దీప్ సింగ్ పురిని క్యాబినెట్ నుంచి తప్పించి వేరే బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం మొదలైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తప్పించి దక్షిణ భారతంలో ఒక పెద్ద సంస్థాగత పాత్ర ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒక వ్యక్తికి ఒక పదవి అన్న విధానం కింద ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న పంకజ్ చౌదరి, కేంద్ర సహాయ మంత్రిగా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న హర్ష్ మల్హోత్రాను తప్పించే అవకాశం లేకపోలేదు.
ఎవరికి చాన్స్?
ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రస్తుతం ప్రధానికి ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న శక్తికాంత దాస్, మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్ (రామాయణం సీరియల్లో రాముని పాత్రధారి), ఎంపీ అనురాగ్ ఠాకూర్‌కు చోటు దక్కేలా ఉందని తెలుస్తోంది. పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఆర్థిక మంత్రిగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2027లో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆప్ నుంచి వచ్చిన నేతల్లో రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్ (లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ)తో పాటు సందీప్ పాఠక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దక్షిణాది నుంచి విశాఖపట్నం ఎంపీ డీ పురంధేశ్వరికి, టీఎంసీ తిరుగుబాటు ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్కు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌కు కేంద్రమంత్రులయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉప ప్రధానిగా అమిత్ షా?!
కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అమిత్‌షా.. ప్రధాని మోదీకి సన్నిహితుడు. ఆయనకు ఉప ప్రధానిగా పదోన్నతి లభించే అవకాశం ఉన్నదని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. కాగా, గడిచిన 22 ఏండ్లుగా ఉప ప్రధాని పదవి ఖాళీగానే ఉన్నది. యూపీఏ-1,2 ప్రభుత్వ హయాంలో, ఎన్డీయే మూడు దఫాల్లో ఈ పదవిలో ఎవరినీ నియమించలేదు. చివరిసారిగా అద్వానీ ఉప ప్రధానిగా వ్యవహరించారు.