న్యూఢిల్లీ: గత రెండేండ్లలో అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న 50 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సమాచార సాంకేతిక చట్టం(ఐటీ యాక్ట్), ఇతర నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలను తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంట్‌కు తెలిపారు. మహిళలు, పిల్లల భద్రత ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, నిషేధించిన ప్లాట్‌ఫామ్‌లు ఐటీ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత(బీఎస్ఎన్), స్త్రీల అసభ్య చిత్రణ నిషేధ చట్టం-1986 నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ప్రసారం కావడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని, సంబంధిత మధ్యవర్తుల నుంచి నివేదిక కోరినట్లు తెలిపారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎస్సీపీసీఆర్) కూడా ఈ విషయంలో సంబంధిత సంస్థలకు నోటీసులు జారీ చేసిందన్నారు.