కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ)/అలంపూర్ చౌరస్తా: తేమ పేరిట పత్తి కొనుగోలుకు నిరాకరించడంపై రైతులు భగ్గుమన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో రోడ్డెక్కారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని జీవీపీ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోళ్లు ప్రారంభించగా పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున పంటను అమ్మకానికి తీసుకొచ్చారు. తేమ శాతం 12కు మించి ఉన్నదని తేల్చిన అధికారులు కొనుగోళ్లకు నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన రైతులు స్థానిక జాతీయ రహదారిపైకి చేరుకొని గంటకుపైగా రాస్తారోకో నిర్వహించారు.
ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా విరమించాలని కోరారు. అధికారులు వచ్చి తమకు న్యాయం చేసే వరకూ వెనక్కి తగ్గేది లేదని భీష్మించారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఒక దశలో వాంకిడి ఎస్సై మహేందర్‌కు.. రైతులకు మధ్య తోపులాట జరగ్గా ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రైతులను సముదాయించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
పత్తి విక్రయించేందుకు వెళ్తే అధికారులు కొర్రీలు పెడుతున్నారంటూ జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు ఎదుట జాతీయ రహదారి-44పై రైతులు బైఠాయించారు. రూ.లక్షలు ఖర్చు చేసి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే సీసీఐ అధికారుల వెనక్కి పంపడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. భారీ వర్షాల కారణంగా పంటలు పండక వచ్చిన దిగుబడిని అమ్ముకుదామంటే ప్రభుత్వం, సీసీఐ అధికారుల తమను నట్టేట ముంచుతున్నాని మండిపడ్డారు. భారీ వర్షాలతో పొలాల్లో పత్తి తడవడంతో ఆరబెట్టుకొని అమ్ముకుందామని వస్తే సీసీఐ అధికారులు మాత్రం తేమ శాతం ఎక్కువగా ఉన్నదని కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందారు. సీఐ రవిబాబు, ఎస్సైలు వచ్చి నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.