జక్రాన్పల్లి, ఆగస్టు 8: నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్కు చెందిన రైతు కుంట రాజేశ్ (30)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నాడు. పంట దిగుబడి సరిగా రాక.. పెట్టుబడి డబ్బులు మీదపడి రాజేశ్ ఆప్పుల పాలయ్యాడు.
అప్పు తీర్చేందుకు మూడెకరాల భూమిని అమ్మాలనుకున్నాడు. ఆ భూమి ధరణిలో ఎక్కకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక రాజేశ్ తన వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆత్మహత్యకు ముందు.. అర్గుల్ గ్రామ వాట్సాప్ గ్రూప్లో వాయిస్ మెసేజ్ పెట్టాడు. భూమి తన పేరిట పట్టా కాలేదని, విక్రయానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫలితంగా అప్పులు కట్టలేని పరిస్థితి వచ్చిందని, దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. ఎస్సై తిరుపతి కేసు దర్యాప్తు చేపట్టారు.