బేల, అక్టోబర్ 24 : తేమ పేరిట సోయా పంటను(Soya crop) కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ రైతులు ఆదిలాబాద్(Adilabad )జిల్లా బేల మండలంలో ధర్నా(Farmers dharna) నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద నిరసన తెలుపుతూ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాధిక మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌రెడ్డితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. బేల సబ్ మార్కెట్ యార్డులో కొనుగోళ్ల కోసం సొసైటీ అధికారులు బుధవారం నుంచి గ్రామాలవారీగా సోయా కొనుగోళ్ల కోసం షెడ్యుల్‌ను ప్రకటించారని తెలిపారు. దీంతో సోయా పంటను తీసుకొచ్చామని పేర్కొన్నారు. కానీ, మార్కెట్ యార్డులో సొసైటీ అధికారులు తేమ శాతం అధికంగా ఉండడంతో కొనుగోలుకు నిరాకరించారని మండిపడ్డారు. మార్క్‌ఫెడ్ అధికారులు భేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.