మోతె, సెప్టెంబర్ 15: 16 రోజులుగా వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని మామిళ్లగూడెం సబ్‌స్టేషన్ వద్ద ఆదివారం రైతులు ధర్నా చేశారు. మామిళ్లగూడెం, కొత్తగూడెం గ్రామాల రైతులు అక్కడికి చేరుకొని ఆందోళన చేశారు. పొలాలకు విద్యుత్తు రావడం లేదని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పంటలకు నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. విద్యుత్తు అధికారులకు ఫోన్లు చేసినా ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాలు వచ్చినప్పటి నుంచి విద్యుత్తు స్తంభాలు, లైన్లు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించకుండా అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు 24 గంటల కరెంట్ వచ్చిందని, కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యానికి పంటలు ఎండిపోతుండటంతో సబ్‌స్టేషన్ ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులకు విద్యుత్తును పునరుద్ధరించాలని కోరుతున్నారు.
వర్షాలు వచ్చినప్పటి నుంచి కరెంట్ రావడం లేదు
వర్షాలు వచ్చినప్పటి నుంచి త్రీఫేజ్ కరెంట్ రావడం లేదు. నాకు 7 ఎకరాల వరి పొలం ఉంది. కరెంట్ లేక పొలం ఎండిపోతున్నది. కరెంట్ కోసం అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. మేమే ఎక్కడైనా విద్యుత్తు లైన్లు తెగిపడ్డాయో చూస్తున్నాము. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు.
-గట్టికొప్పల మోహన్‌రెడ్డి, రైతు, మామిళ్లగూడెం