ఖానాపూర్, మే 22 : తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో రైతులు రోడ్డెక్కారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో ఖానాపూర్-నిర్మల్ జాతీయ రహదారిపై ఎనిమిది గ్రామాల రైతులు మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఖానాపూర్, మస్కాపూర్ మార్కెట్ యార్డుల పరిధిలోని ఖానాపూర్, ఎగ్బాల్పూర్, తల్వపాడ్, దిలావర్పూర్, సత్తనపల్లి, పాత తల్వపాడ్, మస్కాపూర్, సుర్జాపూర్ గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
విషయం తెలుసుకున్న సివిల్ సప్లయీస్ డీఎం సుధాకర్, తహసీల్దార్ సుజాత అక్కడికి చేరుకుని వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో కలెక్టర్ అభిలాష అభినవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, సహకార సంఘం అధికారులు ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు వద్దకు వచ్చి తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం ఆందోళన విరమించారు.
ఊటూర్, మే 22 : బినామీ డాక్యుమెంట్లు సృష్టించి క్రాప్ లోన్ నిధులు స్వాహా చేసిన ఊటూర్ ఎస్బీఐ అధికారులు, సిబ్బంది బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం తంగిడికి చెందిన రైతు కురువ ఆశప్పకు సర్వే నం. 90/అ/ ఆ2 లో ఆరు ఎకరాల పొలం ఉన్నది. ఏప్రిల్ 2024న ఇదే పొలాన్ని రెండు ఎకరాలు కుమారుడు సాయిబన్నపై పట్టా చేశాడు. తండ్రీకొడుకులు వ్యవసాయ రుణం పొందేందుకు కృష్ణ మండల కేంద్రంలోని కార్పొరేషన్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు అధికారుల సూచన మేరకు సంబంధిత బ్యాంకుల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ పొందేందుకు వెళ్లారు.
మక్తల్ ఎస్బీఐ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా ఊటూర్ ఎస్బీఐ నుంచి కురువ ఆశప్ప పేరుపై రూ.1.70 లక్షలు, సాయిబన్న పేరుపై రూ.1.60 లక్షల వ్యవసాయ రుణం తీసుకున్నట్టు బ్యాంకు అధికారులు చూపించారు. దీంతో గురువారం ఊటూర్ ఎస్బీఐకి చేరుకున్న బాధిత రైతులు తమకు తెలియకుండా తమ పేర్లపై క్రాప్ లోన్ ఎలా తీసుకుంటారని సిబ్బందిని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా మాదాసి కురువ సంఘం జిల్లా కార్యదర్శి కురువ ఆశప్ప, సభ్యులు బ్యాంకు వద్దకు చేరుకొని అధికారులను నిలదీశారు. బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.