దంతాలపల్లి, మే 10: అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని వరంగల్-ఖమ్మం హైవేపై ఆదివారం బీఆర్ఎస్ నేతృత్వంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే రైతులకు కష్టాలు వస్తున్నాయని మండిపడ్డారు.
వరి కోతలు చేపట్టి నెలలు గడుస్తున్నా నేటికీ ధాన్యం కొనుగోలులో వేగంపెంచలేదని విమర్శించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సత్వరం కాంటా పెట్టి మిల్లులకు తరలించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్ సునిల్కుమార్రెడ్డి, సొసైటీ పీవో వెంకన్న హామీతో ఆందోళన విరమించారు.