బోధన్ రూరల్, మార్చి 6: నీళ్లు లేక ఎండుతున్న పంటలను చూసి తట్టుకోలేక రైతులు ఆత్మహత్యకు యత్నించడంతో ప్రభుత్వం దిగివచ్చి నీటిని విడుదల చేసింది. నిజాంసాగర్ కాలువ డి 28 కింద చివరి ఆయకట్టుకు నీరు అందక నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో పొట్ట దశలో ఉన్న వరి పంటలు ఎండిపోతుండటంతో తీవ్ర మనస్తాపం చెందిన గురునాథం అనే రైతు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా తోటి రైతులు అడ్డుకున్నారు. ఇదే విషయమై ‘పంట ఎండే.. గుండె చెదిరే’ శీర్షికన గురువారం నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితమైంది. దీనికి ఇరిగేషన్ అధికారులు స్పందించి, నిజాంసాగర్ కెనాల్‌ను పరిశీలించారు. సాలూర మండలంలోని జాడిజమాల్‌పూర్, బోధన్ మండలం రాంపూర్ శివారులోని చివరి ఆయకట్టుకు వరకు నీళ్లు అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఎండుతున్న పంటలకు నీళ్లు పారుతుండటంతో రైతులు అనందం వ్యక్తంచేశారు.
చండ్రుగొండ, మార్చి 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామానికి చెందిన రైతు చింతల పుల్లయ్య తనకున్న రెండెకరాలలో సాగుకు రూ.70 వేలకుపైగా పెట్టుబడి పెట్టాడు. సీతాయిగూడెం వెంగళరావు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో పుల్లయ్య పొలం ఉన్నది. ప్రాజెక్టులో నీరు లేక వరిపంట పొట్ట దశకు రాకముందే ఎండిపోతున్నది. అప్పు చేసి సాగు చేసిన పొలం తన కండ్ల ముందే ఎండిపోతున్నదని పుల్లయ్య ఆవేదన వ్యక్తంచేశాడు.
నకిరేకల్, మార్చి 6 : నకిరేకల్ మండలం పాలెంలో లోవోల్టేజీతో రెండు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ రాకపోవడంతో రైతులే ట్రాన్స్ఫార్మర్లను తీసుకుని గురువారం నకిరేకల్ సబ్‌స్టేషన్ పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రానికి వచ్చారు. విద్యుత్తు అధికారులు ఎల్సీలు ఇవ్వడం లేదని, లైన్‌మన్ పనులు కూడా తామే చేసుకోవాల్సి వస్తున్నదని మండిపడుతున్నారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేసి ఇవ్వకపోతే 100 ఎకరాల వరి పంట ఎండిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు.