మోత్కూరు, ఫిబ్రవరి 10: యాసంగి పంటను ఎండిపోకుండా కాపాడేందుకు బిక్కేరు వాగులోకి (Bikkeru Vagu) ప్రభుత్వం గోదావరి నీళ్లను విడుదలచేయాలని రైతులు డిమాండ్ చేశారు. వెంటనే గోదావరీ జలాలను వదిలి పంటలను రక్షించాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం సదర్శాపురం, గుండాల మండలం పెద్ద పడిశాల గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో బిక్కేరు వాగులోకి తరలివచ్చిన రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినానాదాలు చేశారు.
ఫిబ్రవరిలోనే ఎండలు పెరిగిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, బోరు బావుల్లో నీరు ఇంకిపోతుందన్నారు. ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశలో ఉన్న నేపథ్యంలో నీళ్లు అందక ఎండిపోతున్నాయన్నారు. గత బీఆర్ఎస్ పాలన లో బిక్కేరు ద్వారా గోదావరి జలాలను వదలడంతో ఈ ప్రాంత రైతులు ఎక్కువ మొత్తంలో వరి సాగుకు సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోదావరి నీళ్లను వదలకపోవడంతో వరి సాగు చేస్తున్న తమ కళ్లముందే పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. వాగులోకి నీళ్లు వదిలి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.