నమస్తే న్యూస్‌నెట్‌వర్క్, నవంబర్ 3 : వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట తడవడంతో మొలకలు వచ్చి మరింత నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సక్కగా కొనకపోవడంతో పంట తడిసిందని చెప్తున్నారు. తరుగు పేరిట తమను మరింత ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. సర్కార్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల తీరుపై సోమవారం రైతులు పలు జిల్లాల్లో ఆందోళనలకు దిగారు. సిద్దిపేట జిల్లా నంగునూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మొలకెత్తిన ధాన్యాన్ని పోసి రైతులు నిరసన తెలిపారు. అనంతరం వివేకానంద చౌరస్తా వద్ద ధర్నా చేస్తూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే పురుగు మందు తాగి ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ పక్క వర్షం.. మరోపక్క అధికారుల నిర్లక్ష్యంతో వారం రోజులుగా ధాన్యం కొనుగోళ్లు స్తంభించి పోయాయి. సహనం కోల్పోయిన రైతులు సోమవారం ఏఎంసీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అక్కడ అధికారులు లేకపోవడంతో దుబ్బాక పట్టణంలోని ఛత్రపతి శివాజీ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించారు. హుస్నాబాద్‌లో తడిసిన ధాన్యం కొనుగోలు చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు దుబ్బాక రైతుల కష్టం కన్పిస్తలేదా? అని ప్రశ్నించారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సుమారు 2 గంటలపాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. తహసీల్దార్ సంజీవ్‌కుమార్, సీఐ శ్రీనివాస్ రైతులతో మాట్లాడి, ఆందోళన విరమించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నాగవ్వ అనే రైతు తన తడిసిన ధాన్యం కొనాలని తహసీల్దార్ కాళ్లపై పడి వేడుకున్నది.
ఎల్లారెడ్డిపేటలో అన్నదాతల ఆందోళన
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన రైతులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రహదారిపై ధాన్యం లారీని అడ్డు పెట్టి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన ధాన్యం దింపుకొనేందుకు అధికారులు గొల్లపల్లిలోని రాజరాజేశ్వర ఇండస్ట్రీస్‌ను కేటాయించారని, సదరు మిల్లు నిర్వాహకులు ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ లారీలను వెనక్కిపంపిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇదివరకు కొనుగోలు కేంద్రం నుంచి పంపిన నాలుగు లారీల్లో ఒక్కో లారీకి సగటున 8 క్వింటాళ్ల ధాన్యం కోత విధించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఐదు రోజుల క్రితం ధాన్యం లోడ్ లారీని మిల్లుకు పంపగా తేమ శాతం 22 వస్తుందని, 15 క్వింటాళ్ల తరుగు తీస్తామని చెప్పడంపై మండిపడ్డారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కాట్రపల్లిలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తున్నదని మండిపడ్డారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తానని చెప్పి మోసం చేసిందని ధ్వజమెత్తారు.