వేల్పూర్/డిచ్పల్లి/నస్రుల్లాబాద్, జూన్ 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్‌లో జాతీయ రహదారిపై శుక్రవారం బైఠాయించారు. యాప్‌ను ఎత్తివేయాలని, పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాల్కొండ సీఐ జాన్‌రెడ్డి, వ్యవసాయాధికారులు వచ్చి శనివారంలోగా ఆరు లారీల యూరియా పంపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. యూరియా దొరకడం లేదంటూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని సొసైటీ గిడ్డంగి ఎదుట చెప్పులు వరుసలో నిరసన తెలిపారు.
యూరియా యాప్‌ను తొలగించాలని, పాత పద్ధతిలోనే ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని బాన్సువాడ-పొతంగల్ రహదారిపై శుక్రవారం రైతులు రాస్తారోకో చేశారు. గురువారం యాప్ ద్వారా బుక్ చేస్తున్న రైతులు శక్రవారం ఉదయమే స్థానికంగా ఉన్న గ్రోమోర్ ఎరువుల దుకాణానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలు దా టినా షాప్ తెరువక పోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో శాంతించారు.