కందుకూరు, జనవరి 17: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో ఫోర్త్ సిటీ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు ఎకరానికి రూ.2 కోట్లు, ఇంటిస్థలంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బేగరికంచెలో రెవెన్యూ అధికారులు శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దారు గోపాల్ మాట్లాడుతూ..
2023 చట్టం ప్రకారం ఎకరాకు ప్రభుత్వం రూ.45 లక్షలు చెల్లిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ధరకు తమ భూములను ఇవ్వబోమని, కనీసం ఎకరాకు రూ. 2 కోట్లు ఇవ్వాలని రైతులు ముకుమ్మడిగా డిమాండ్ చేశారు. తమకున్న ఎకరం, రెండెకరాల భూమిని ఇచ్చి ఎలా బతకాలని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు తెలియకుండా సర్వే నిర్వహించారని వాపోయారు. గ్రామ సభలను నిర్వహించడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.