కొడకండ్ల, ఏప్రిల్ 6 : జనగామ జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులు ప్రస్తుతం తీవ్ర అయోమయంలో పడ్డారు. చేతికొచ్చిన పంటను చూసి మురిసిపోవాల్సిన సమయంలో, అసలు పొలంలో మొలిచింది వరి మొక్కా.. లేక కలుపు మొక్కా.. అన్న సందేహం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కొడకండ్ల మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేసిన వరి పంటలో కలుపు మొక్కలే ఎక్కువగా కనిపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో కొనుగోలు చేసిన విత్తనాల్లో నాణ్యత లోపించడంతో వరితోపాటు సమానంగా కలుపు మొక్కలు (వరిని పోలి ఉండే కలుపు) పెరుగుతున్నాయని బెంబేలెత్తిపోతున్నారు.
రూ.లక్షల పెట్టుబడి పశువుల మేతగా మారుతున్నదని అంటున్నారు. మార్కెట్లో దొరుకుతున్న నకిలీ విత్తనాల వల్ల పంట సర్వనాశనం అవుతున్నదని ఆందోళన చెందుతున్నారు. వరి పొలాల్లో వరిని పోలిన కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతుంటే, విత్తనాల నాణ్యతను తనిఖీ చేయాల్సిన వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నదని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటలు పాడవుతున్నాయని నెత్తీనోరు మొత్తుకుంటున్నా వినేవారే లేరని మండిపడుతున్నారు. పాలకుర్తికి చెందిన కమ్మగాని సోమయ్య 3 ఎకరాల్లో వేసేందుకు ఆగ్రోస్ నుంచి ఓ కంపెనీ విత్తనాలు తెచ్చాడు. వాటిని డ్రమ్సీడ్ పద్ధతిలో సాగు చేస్తే వరికి బదులు కలుపు వచ్చిందని వాపోయాడు.