ఆదిలాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): జొన్న పంటను విక్రయించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డును మూడు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించి కొనుగోళ్ల తీరును పరిశీలించారు. మార్కెట్ యార్డులో బోథ్ మండలం మర్లపల్లికి చెందిన కట్ట లక్ష్మి అనే మహిళా రైతు తాను 15 రోజుల కిందట జొన్న పంటను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చినా కొనడం లేదని, పంటను కొంటరో, కొనరో కూడా చెప్తలేరని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముందు రోదించింది. రెండ్రోజుల కిందట తాంసి మార్కెట్ యార్డును ఎమ్మెల్యే సందర్శించగా తలమడుగు మండలం కొత్తూరుకు చెందిన రైతు విజయ్ తాను పంటను తీసుకొచ్చి 12 రోజులవుతున్నా కొనుగోలు చేయడం లేదంటూ కన్నీరు పెట్టుకున్నాడు. జిల్లాలో ప్రతి మార్కెట్ యార్డులో రైతుల పరిస్థితి ఇలాగే ఉన్నది.
మార్కెట్లో భారీగా పంట నిల్వలు
ఆదిలాబాద్ జిల్లాలో యాసంగిలో రైతు లు 1.10 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేయ గా ఎకరాకు 15 క్వింటాళ్ల చొప్పున 16.50 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశా రు. నెల రోజుల కిందట పంట చేతికి రాగా కొనుగోళ్లు పది రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోళ్లను ప్రారంభించగా అప్పటికే పం టను ఇండ్లల్లో, పొలాల్లో నిల్వచేసుకున్న రైతులు.. విక్రయించడానికి భారీగా మార్కెట్‌కు తీసుకువచ్చారు. దీంతో కొనుగోలు కేంద్రాలు జొన్న పంటతో నిండిపోయాయి. కొనుగోళ్లను నిర్వాహకులు నాలుగైదు రోజులపాటు నిలిపివేస్తున్నట్టు తరచూ ప్రకటనలు జారీ చేస్తున్నారు. యాసంగిలో పండించిన శనగను ప్రభుత్వం సగంలో నిలిపివేయడం తో జొన్నలు కొనడాన్ని ఎప్పుడు నిలిపివేస్తారో తెలియక ఆందోళనతో పంటను విక్ర య కేంద్రాలకు తీసుకువస్తున్నారు. తాంసి మార్కెట్ యార్డులో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటరుకుపైగా రైతులు జొన్న పంటను పదిహేను రోజులుగా నిల్వ ఉంచారు.
రోజుల తరబడి మార్కెట్లోనే..
రైతులు తీసుకువచ్చిన పంటను కాంటా చేసినా లారీలు, హమాలీల కొరత కారణంగా సంచులను గోదాముల్లోకి తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఆదిలాబాద్, తాంసి, బోథ్ మార్కెట్ యార్డుల్లో వేల క్వింటాళ్ల పంట నిల్వలు ఉన్నాయి. రోజూ 15కుపైగా లారీలు వస్తే రవాణాలో ఆలస్యం జరిగే అవకాశాలు లేకపోగా అధికారులు సరిపడా లారీలను సమకూర్చడం లేదు. స్థానిక హమాలీలు పంటను సంచుల్లో నింపుతున్నా కాంటా వేయడానికి, సంచులను సీల్ చేసి లారీల్లో లోడ్ చేయడానికి బీహార్‌కు చెందిన హమాలీలు అవసరం ఉండగా వారి సంఖ్య సైతం తక్కువగా ఉన్నది. జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎండలు మండిపోతుండగా రైతులు పంటను విక్రయించడానికి 10 నుంచి 15 రోజులపాటు మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాయాల్సి వస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరోనా సమయంలోనూ గ్రామాల్లో కాంటా పెట్టి పంటను కొనుగోలు చేశారని, ఇప్పుడు మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి ఉంటున్నా కొనుగోలు చేయడం లేదని రైతులు అంటున్నారు.