వేల్పూర్/చిన్నకోడూర్, అక్టోబర్ 18 : బీఆర్ఎస్కు అన్ని సంఘాలు, వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. జాతీయ పార్టీని ఆదరించడంతోపాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలానికి చెందిన వివిధ గ్రామాల రైతులు రూ.1,50,116 మొత్తాన్ని మంగళవారం విరాళంగా అందజేశారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే తెలంగాణలో రైతు గోస తీరిందని వారు పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, పుష్కలంగా సాగునీరు అందించి రైతును రాజుగా చేశారని కొనియాడారు. బీఆర్ఎస్కు స్వచ్ఛందంగా విరాళాలు అందించి మద్దతు పలికిన వేల్పూర్ మండల రైతులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చర్లంకెరెడ్డి గ్రామంలో ముదిరాజ్ సంఘం రూ.10,016, శాలివాహన సంఘం రూ.5016 విరాళంగా అందజేశాయి. ఈ మొత్తాన్ని సదరు ప్రతినిధులు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజుకు అందజేశారు.