ఎల్లారెడ్డిపేట/ మెదక్ (నమస్తే తెలంగాణ) జనవరి 31 : అన్నదాతలకు యూరియా గోసలు తప్పడంలేదు. వానకాలంలో బస్తాల కోసం ఇబ్బంది పడిన ఘటనలే యాసంగిలోనూ పునరావృతం కావడంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నా.. సరిపడా బస్తాలు అందడం లేదని వాపోతున్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లోని గోదాముకు 420 బస్తాలు వచ్చాయి.
అల్మాస్పూర్తోపాటు రాజన్నపేట, అక్కపల్లి, గుంటపల్లి చెరువుతండా రైతులు ఉదయం 6 గంటలకే గోదాము వద్దకు చేరుకుని క్యూలో చెప్పులు ఉంచారు. 9.30 గంటలకు సొసైటీ సిబ్బంది చేరుకోగా, ఆధార్ కార్డులు అందించారు. అప్పటికే 250 మంది రైతుల ఆధార్‌కార్డులు వచ్చాయి. ఎకరానికి బస్తా చొప్పున యూరియా ఇచ్చారు. 50 మంది రైతులకు బస్తాలు దొరకకపోవడంతో నిరాశతో వెళ్లిపోయారు. అలాగే మెదక్ జిల్లా రామాయంపేట సొసైటీకి ఉదయం నుంచే రైతులు క్యూకట్టారు.
యూరియా లారీ ఉదయం 10 గంటలకు రావడంతో అధికారులు యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకే అందించారు. చాలామంది యూరియా అందక పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మెదక్, హవేళీఘన్‌పూర్‌లో ఆగ్రోస్ సెంటర్ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. యాప్ గురించి తెలియక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అధికారులు యాప్‌పై అవగాహన కల్పించినా రైతులు యాప్‌లో నమోదు, ఆధార్ లింక్, బయోమెట్రిక్ సరిగా చేయడం తెలియక గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది.