కూసుమంచి (నేలకొండపల్లి), మే 16 : తేమ శాతం వచ్చి నెల దాటినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై రైతన్నలు భగ్గుమన్నారు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడ్డారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల తీరుతో విసిగిపోయిన అనాసాగరం రైతులు శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు అన్ని పార్టీల వారు మద్దతు ప్రకటించారు. అనాసాగరంలో సుమారు 50 మంది రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు పోసి అమ్మకానికి ఎదురుచూస్తున్నారు.
అందులో కొందరు రైతులు పచ్చి ధాన్యం అమ్ముకోగా.. మిగిలిన రైతులు ప్రభుత్వం అందించే బోనస్ రూ.500 వస్తుందనే ఆశతో రాశులుగా పోశారు. కానీ.. మిల్లర్లు 1638 రకం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆలస్యమైంది. అంతేకాక ధాన్యం కాంటా వేయడానికి గన్నీ బ్యాగులు లేకపోవడం, కాంటా వేసిన ధాన్యం తరలించేందుకు లారీలు రాకపోవడం, ఇంకా 15 లారీలకుపైగా ధాన్యం కాంటా పెట్టాల్సి ఉండటం.. ఈలోగా శుక్రవారం వర్షం కురవడంతో రైతులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి రైతులతో మాట్లాడారు. గన్నీ బ్యాగులు వెంటనే పంపించి కాంటా వేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
భిక్కనూరు, మే 16: ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ ఓ కౌలు రైతు వరి కుప్పకు నిప్పంటించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరులో చోటుచేసుకున్నది. రైతు రమేశ్ స్థానిక సిద్ధరామేశ్వర ఆలయ భూములను కౌలుకు చేస్తున్నాడు.
ఎకరన్నరలో వరి సాగుచేసి.. పంటను కొనుగోలు కేంద్రానికి తరలించాడు. ధాన్యం ఆరబెట్టినా ఇంకా తూకం వేయడం లేదని ఆవేదన చెంది గురువారం కుప్పకు నిప్పంటించాడు. కేంద్రం నిర్వాహకులు డబ్బులు ఇచ్చిన రైతుల వడ్లను మాత్రమే కాంటా వేస్తున్నారని ఆవేదన చెందాడు. కొన్నిరోజులుగా అకాల వర్షం కురుస్తున్నదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగాడు. అధికారులు స్పందించి గురువారం రాత్రి కాంటా చేశారు.