ఆమనగల్లు, డిసెంబర్ 27 : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోటపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం పత్తి రైతులు ధర్నా నిర్వహించారు. నాలుగు రోజులుగా తాము తెచ్చిన పత్తిని కొనుగోలు చేయకుండా దళారులు తెచ్చిన పత్తిని కొనుగోలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు రైతులు వాపోతున్నారు. దళారులు తెచ్చిన పత్తికి మద్దతు ధర ఇస్తూ రైతులు తెచ్చిన పత్తికి కొర్రీలు పెట్టి మద్దతు ధర ఇవ్వడం లేదని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని, రైతులు పండించిన పత్తిని వెంటనే కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పత్తికి మద్దతు ధర ఇవ్వాలని రైతుల ధర్నా
చెన్నూర్ రూరల్, డిసెంబర్ 28 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట సమీపంలోని వరలక్ష్మి జిన్నింగ్ మిల్లులో పత్తికి మద్దతు ధర చెల్లించాలని కోరుతూ శుక్రవారం చెన్నూర్-మంచిర్యాల ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. మంగళవారం వరకు పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.7520 ఉండగా, ప్రస్తుతం క్వింటాలుకు రూ.100 తగ్గించారని, తగ్గించిన రూ. 100 పెంచాలని డిమాండ్ చేశారు. చెన్నూర్ సీఐ రవీందర్, సీపీవో రైతులతో మాట్లాడి నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు.
నాలుగు రోజుల నుంచి నిరీక్షిస్తున్న
నాగిళ్ల గ్రామ పంచాయతీలోని కొర్ర తండా నుంచి నాలుగు రోజుల క్రితం పత్తి అమ్మడానికి తీసుకువచ్చాను. సీసీఐ అధికారులు రైతులు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయకుండా దళారులు తెచ్చిన పత్తిని కొనుగోలు చేస్తూ మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దళారులు తెచ్చిన పత్తికి మద్దతు ధర ఇచ్చిన రైతులు తెచ్చిన పత్తికి మాత్రం మద్దతు ధర ఇవ్వడం లేదు.
-బాలూ నాయక్, కొర్ర తండా
పత్తిని వెంటనే కొనుగోలు చేయాలి
మేము పత్తి అమ్మడానికి ఆకుతోటపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాం. సీసీఐ అధికారులు మాత్రం నామమాత్రంగా ఇద్దరు ముగ్గురు రైతులు తెచ్చిన పత్తిని కొనుగోలు చేసి దళారులు తెచ్చిన పత్తిని మొత్తం కొనుగోలు చేస్తూన్నారు. దళారులు, సీసీఐ అధికారులు కుమ్మక్కై రైతుల పత్తి కొనుగోలు చేయకుండా మద్దతు ధర ఇవ్వకుండా నట్టేట ముంచుతున్నారు. – కొర్ర మధ్యనాయక్