కోదాడ రూరల్/తిప్పర్తి/కోటగిరి/భీమ్గల్, ఏప్రిల్ 8 : ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్ జిల్లా ల్లో మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరలో హడావుడిగా కేంద్రాన్ని ప్రారంభించి రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు ఐకేపీ సెంటర్ ఎదురుగా కోదాడ- ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనను విరమింపజేశారు.
ఈ సందర్భంగా రైతులు, నాయకులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో టెంట్ మాత్రమే వేశారని, సిబ్బందికి రసీదు బుక్కులు ఇవ్వలేదని, తేమ యంత్రాలు, గన్నీ బస్తాలు, సన్నాలు కొలిచే మెషిన్, బ్లోయర్లు లేకుండా ఎలా కొనుగోళ్లు చేస్తారని ప్రశ్నించారు. కాగా నల్లగొండ జిల్లా తిప్పర్తిలోనూ రైతులు నిరసనకు దిగారు. కొర్రీల పేరుతో కొనుగోళ్లు నిలిపివేశారంటూ రైతులు తిప్పర్తిలో నార్కట్పల్లి-అద్దంకి హైవేపై బైఠాయించారు. సకాలంలో కొనకపోతే అకాల వర్షానికి ధాన్యం తడిసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. 40 కిలోల బస్తాకు 2 కిలోల తరుగు తీయడం ఏమిటని మండిపడ్డారు. రైతుల శ్రమను దోచుకుంటుంటే అధికారులు పట్టించుకోరా? అని ప్రశ్నించారు. అనంతరం కడ్తాను నియంత్రించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కాగా ఇదే జిల్లా భీమ్గల్ మండలం గోన్గొప్పులలోనూ రైతులు ధర్నాకు దిగారు. స్థానిక ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 40 కిలోల బస్తాకు దాదాపు రెండు కిలోల తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ షబ్బీర్, ఎస్సై మహేశ్ అక్కడికి చేరుకొని వారికి సర్దిచెప్పారు. ఇకపై రైతులు కోరిన విధంగానే కాంటాలు వేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.