జగిత్యాల, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో రైతన్నలు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వంతో కొట్లాడి, మెడలు వంచి సౌకర్యాలను సాధించుకుందామని బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చా రు. రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన పిట్టల లింగన్న అలియాస్ తోకల లింగన్న కుటుంబసభ్యులను అధ్యయన కమిటీ సభ్యులు మంగళవారం పరామర్శించారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న లక్ష్మిని ఓదార్చారు. అనంతరం రైతులతో అధ్యయన కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు లు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత హృదయ విదారకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన 400 రోజుల్లో 418 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, సగటున రోజుకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. లింగన్న భార్య లక్ష్మిని పరామర్శిస్తున్న సమయంలో ఆమె కన్నీటి ధారను ఏడేండ్ల కూతురు చిన్న చేతులతో తుడుస్తున్న దృశ్యం కలచివేసిందని చెప్పారు. తల్లుల కన్నీళ్లను బిడ్డలు తుడిచే దుస్థితి తేవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రైతు సమస్యలే పునాది అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని రైతు కేంద్రంగానే నిర్వహించారని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం వ్యవసాయ రంగ అభివృద్ధికి పక్కా ప్రణాళికతో కృషి చేశారని వివరించారు. ‘తెలంగాణలో ఎకరం భూమి పడావు పడద్దు.. రైతు చేయి పడావు ఉండద్దు’ అన్న ఉద్దేశంతో కేసీఆర్ పనిచేశారని చెప్పారు. నేడు ఆ పరిస్థితులు దెబ్బతిన్నాయని, రైతులు మళ్లీ వలసలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ వ్యవసాయాన్ని కేసీఆర్ బాగు చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వందల ఆత్మహత్యలు జరిగితే సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు పట్టదని, కనీసం పరామర్శకు కూడా రాకుండా వీరంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజలకు, రైతులకు పూర్తిగా విశ్వాసం పోయిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పదేండ్లపాటు ఉన్న మంచిరోజులు పోయి, చెడ్డరోజులు దాపురించాయని రైతులు కుమిలిపోతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ విమర్శించారు. రైతులు అధైర్యపడవద్దని మంచిరోజులు వస్తాయని చెప్పారు. రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ రేవంత్‌రెడ్డి సర్కార్ చేసిన హత్యలేనని, సర్కార్‌పై హత్య కేసు నమోదుచేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో ఆయన పాట, మాటతో సభికులను భావోద్వేగానికి గురి చేశారు. మ్యానిఫెస్టోలే పెట్టని అనేక పథకాలను సైతం అమలుచేసిన ఘనత కేసీఆర్‌దేనని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కొనియాడారు. రేవంత్ పాలనలో రైతులు ఆనందంగా లేరని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. రైతు లింగన్న ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని, పార్టీ తరుఫున రూ.లక్ష సాయం అందిస్తామని, పిల్లల చదువులకు సాయం చేస్తామని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
లింగన్న భార్య లక్ష్మి బిగ్గరగా రోదిస్తుండగా, తల్లి కండ్లలో నుంచి ధారగా వస్తున్న కన్నీళ్లను ఆమె కూతురు తుడిచింది. తల్లి లక్ష్మి కండ్ల నీళ్లను బిడ్డ తుడవడం చూసి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి చలించిపోయారు. బిడ్డా నీ పేరేంటి అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించగా, నైనిక అని ఆ చిన్నారి చెప్పంది. ఈ సందర్భంగా నా మనుమరాలి పేరు కూడా నైనికనే అంటూ నిరంజన్‌రెడ్డి కండ్లల్లో నీళ్లు తీసుకోవడంతో ఆ దృశ్యాన్ని చూసిన వారందరి కండ్లు చెమ్మగిల్లాయి.
జగిత్యాల, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ)/ ఇబ్రహీంపట్నం: “రికాం లేకుండా నా మొగడు ఎవుసం పనిచేసిండు.. పిల్లలను మంచిగ సదివియ్యాలె.. మా అవ్వను.. మీ అయ్యను మంచిగ చూడాలె అనెటోడు.. బ్యాంకుల తీసుకున్న రూ.2.3 లక్షల లోన్ మాఫీ అయితది, రైతు భరోసా అత్తది అని నమ్ముకున్నడు.. అవి ఏవీ రాకపోయేసరికి ఆగమైండు.. దీనికితోడు పసుపు పంటకు పురుగు తగిలింది.. పంట సక్కగ అచ్చెటట్టు కనిపించకపోయేసరికి పిరికిల పడిపోయిండు.. సంకురాత్రి పండుగ నాడు పొద్దికి పసుపు పంటకు నీళ్లు పెడుతా అని పోయి అటే పోయిండు.. నాకు దిక్కెవ్వరు..?
నా బిడ్డ ల గతేంది..? సార్’ అంటూ రైతు పిట్టల లింగన్న భార్య లక్ష్మి కంటికి నాలుగు ధారలు పడుతుండగా ఏడ్చిన ఏడుపుతో ఇంటికి వచ్చిన వారందరూ చలించిపోయారు. తల్లి కండ్లళ్ల నుంచి వస్తున్న నీళ్లను ఆమె ఏడేండ్ల బిడ్డ తన చిట్టి చేతులతో తుడవడంతో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ చలించిపోయారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన రైతు పిట్టల లింగన్న గత నెల 14న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దవాఖానలో చికిత్స పొందుతూ, 20న మృతిచెందాడు. మంగళవారం బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ సభ్యులు లింగన్న ఇంటికి వెళ్లి ఆయన భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.