మిర్యాలగూడ/వేములపల్లి, ఏప్రిల్ 7: యాసంగిలో పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ రైతులు సోమవారం రాత్రి మిల్లర్లతో గొడవకు దిగారు. దీన్ని నిరసిస్తూ మిల్లర్లు కొనుగోలు నిలిపివేయడంతో మంగళవారం దాదాపు ఆరువేలకుపైగానే ట్రాక్టర్లు రోడ్లపైనే నిలిచిపోయాయి. మిల్లర్ల వైఖరిని తప్పుబడుతూ రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లిలోని రైస్ మిల్లుల వద్దకు గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చారు. కొంతమంది మిల్లర్లు తక్కువ ధర చెప్పడంతో ‘మీ మిల్లుల నుంచి వస్తున్న కాలుష్యాన్ని పీలుస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నాం.. మేం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వరా?’ అంటూ వారు మిల్లర్లతో గొడవకు దిగారు. ఇందుకు నిరసనగా మిల్లర్లు మూకుమ్మడిగా మంగళవారం ఉదయం ధాన్యం కొనుగోలు నిలిపివేశారు.
దీంతో మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై, అవంతీపురం, యాద్గార్పల్లి రహదారులపై వేలాదిగా ధాన్యం ట్రాక్టర్లు నిలిచిపోయాయి. కొనుగోలు నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు శెట్టిపాలెం గ్రామ సమీపంలో రైస్ మిల్లుల వద్ద రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి ధర్నాకు దిగారు. గిట్టుబాటు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద, నాన్ ఆయకట్టు ప్రాంతంలోనూ కోతలు ముమ్మరం కావడంతో రెండు రోజులుగా ధాన్యం ట్రాక్టర్లు భారీగా తరలివస్తున్నాయి. వ్యాపారులు 4 గంటలపాటు కొనుగోలు నిలిపివేయడంతో వేలాది ట్రాక్టర్లు రోడ్లపై నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెంటనే మిల్లర్లతో సమావేశం ఏర్పాటుచేసి, పలు సూచనలు చేశారు.
మద్దతు ధర తగ్గకుండా రైతులకు గిట్టుబాటు ధర
ఇవ్వాలని, వెంటనే కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించారు. వ్యాపారులు ధాన్యం కొనుగోలు ప్రారంభించడంతో రైతులు ధర్నా విరమించారు. కాగా మంగళవారం ఒక్కరోజే ఆరు వేలకుపైగా ట్రాక్టర్లలో ధాన్యం తరలివచ్చింది.