యాచారం, కందుకూరు మే 14: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన పట్టా, అసైన్డ్ భూముల్లో వానకాలం సీజన్ నుంచి సాగును నిలిపివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలె-క్టర్, జిల్లా వ్యవసాయ అధికారి కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యాచారం, కందుకూరు మండలాల్లో రైతులు వరి, జొన్న, మక్క, ఆముదం, ఉలవలు, పల్లి, కందులు, కూరగాయలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కానీ ప్రభుత్వం మాత్రం ఇకపై ఎలాంటి పంటలు సాగు చేయొద్దని తేల్చిచెప్పింది. ఇప్పటికిప్పుడు భూములను వదిలేయాలంటే పశువులు, గొర్రెల మందలను తీసుకుని ఎక్కడికి వెళ్లాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం హామీ ప్రకారం భూములు కోల్పోయిన రైతులందరికీ పునరావాసం కల్పించాలని, ఎకరాకు 121గజాల ఇంటి స్థలం ఇచ్చిన తర్వాతనే భూములను స్వాదీనం చేసుకోవాలని యాచారం పీఏసీఎస్ డైరెక్టర్ మక్కపల్లి స్వరూప డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే భూములను వదిలిపెట్టేదిలేదని, రైతలంతా కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
భూమికి భూమి ఇవ్వాలి
బుధవారం కందుకూరు మండలం తిమ్మాపూర్లో రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ రాజు, గ్రామసభ ఏర్పాటు చేశారు. రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ భూమి కోల్పోయిన రైతుల కుటుంబంలో ఎంత మంది 18 ఏండ్లు నిండిన వాళ్లుంటే అంత మందికీ అదనంగా రూ.5లక్షలు చెల్లిస్తామని చెప్పారు. అధికారుల ప్రతిపాదనకు రైతులు అంగీకరించలేదు. ఎకరం, రెండు ఎకరాలు ఉన్న తాము భూములు కోల్పోతే రోడ్డును పడుతామని ఆవేదన వ్యక్తంచేశారు. బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.